మోడీ సభలకు ఏర్పాట్లు షురూ | arrangements ready to narendra modi conferences | Sakshi
Sakshi News home page

మోడీ సభలకు ఏర్పాట్లు షురూ

Published Wed, Mar 26 2014 3:02 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

arrangements ready to narendra modi conferences

సాక్షి, చెన్నై:  రాష్ట్రంలో గెలుపే లక్ష్యంగా డీఎంకే కూటమి ఉరకలు తీస్తోంది. తమ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయూలని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నిర్ణయించారు. అందుకు తగ్గ ఏర్పాట్లలో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ నిమగ్నమయ్యూరు. రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ నేతృత్వంలో కూటమి ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ఇందులో డీఎండీకే, పీఎంకే, ఎండీఎంకే, ఐజేకే, కొంగునాడు పార్టీలు ఉన్నాయి.

అత్యధిక స్థానాల్ని కైవశం చేసుకోవడమే లక్ష్యంగా ఈ కూటమి నేతలు ఉరకలు తీస్తున్నారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా డీఎండీకే నేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత వేర్వేరుగా సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. ఎండీఎంకే నేత వైగో కూడా ప్రచార బాటకు శ్రీకారం చుట్టారు. తాను విరుదునగర్ నుంచి పోటీ చేస్తున్నప్పటికీ, కూటమి అభ్యర్థుల విజయం కోసం ప్రచారాన్ని వేగవంతం చేశారు. అలాగే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, పీఎంకే నేత రాందాసు తమకు పట్టున్న చోట్ల ప్రచార సభలతో దూసుకెళుతున్నారు. తమ ప్రచారాలకు అనూహ్య స్పందన వస్తుండడంతో పాటు మోడీ నామ జపం మారుమోగుతోంది. దీంతో ప్రచారానికి మోడీని ఆహ్వానించాలని నిర్ణయించారు. రాష్ట్ర పార్టీ వినతికి స్పందించిన మోడీ రెండు చోట్ల ప్రచార సభలకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

 ఏర్పాట్లలో నాయకులు బిజీ
 ప్రచారానికి మోడీ వస్తుండడంతో అందుకు తగ్గ ఏర్పాట్లపై బీజేపీ రాష్ట్ర నాయకులు దృష్టి కేంద్రీ కరించారు. ఆయన ప్రచార సభల వేదికల్ని ఎంపిక చేస్తున్నారు. కన్యాకుమారి, చెన్నైలో మోడీ ప్రచార సభలను నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ మేరకు సభల ఏర్పాట్లతో పాటు ముఖ్య నాయకుల్ని పిలిపించి వారి ద్వారా కూడా ప్రచారం చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. పార్టీ పార్లమెంటరీ నేత సుష్మాస్వరాజ్ సైతం ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మోడీ ప్రచార సభ వేదికపై బీజేపీ కూటమిలోని పార్టీల మిత్రులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంగా మదురైలో పొన్ రాధాకృష్ణన్‌ను మీడియా కదిలించగా మోడీ ప్రచార సభలకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఆయన పర్యటనల వివరాల మేరకు ఇక్కడ వేదికల్ని సిద్ధం చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement