
‘అసెంబ్లీ’ అనంతరమే కేబినెట్
మాతృభాషలో మాధ్యమిక శిక్షణపై మళ్లీ పోరాటం
చట్టాల్లో మార్పులు తెచ్చేలా పీఎంపై ఒత్తిడి
‘బెళగావి అసెంబ్లీ’లో ఉత్తర కర్ణాటక సమస్యలపై దృష్టి
జేడీఎస్ ప్రశ్నలకు దీటుగా జవాబిస్తా
పీఎంగా మోదీ సాధించింది శూన్యం
హామీల విషయంలో యూ టర్‌న తీసుకున్న బీజేపీ
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
మైసూరు : బెళగావిలో నిర్వహించనున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల అనంతరం మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. మైసూరు జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం జిల్లాలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అంతకుముందు మైసూరులోని హెలిప్యాడ్ వద్ద విలేకరులతో మాట్లాడారు. బెళగావిలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు పూర్తై తర్వాత మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. మాతృభాషలో మాధ్యమిక శిక్షణ అందించే విషయమై సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైన నేపథ్యంలో ఈ అంశాన్ని పునఃపరిశీలించాల్సిందిగా సుప్రీం కోర్టులో అర్జీని దాఖలు చేయనున్నట్లు తెలిపారు. అంతేకాక ఇందుకు సంబంధించి చట్టాల్లో సైతం మార్పులు తెచ్చేలా ప్రధానమంత్రిపై ఒత్తిడి తీసుకువస్తామని వెల్లడించారు. బెళగావి అసెంబ్లీ సమావేశాల్లో ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని సమస్యలపై ఎక్కువగా దృష్టి సారించడంతో పాటు అక్కడ సమస్యల పరిష్కారానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
ఇక బెళగావిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు జేడీఎస్ ప్రణాళికలు రచిస్తుండడంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ... వారి ప్రశ్నలన్నింటికి తాము ధీటుగా జవాబు ఇవ్వనున్నామని స్పష్టం చేశారు. ఇక అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రధాని నరేంద్రమోదీ సాధించిందేమీ లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని, అంతేకాక ఈ హామీల విషయంలో బీజేపీ ప్రభుత్వం యూ టర్న్ తీసుకుందని ఆరోపించారు. ఈ సందర్భంలో మంత్రులు ఉమాశ్రీ, ఆంజనేయ, శ్రీనివాస ప్రసాద్ తదితరులు సిద్ధరామయ్య వెంట ఉన్నారు.