జేడీఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత బసవరాజ్ హొరట్టిని శాసనమండలి అధ్యక్షుడిగా చేయడానికి ముఖ్యమంత్రి ...
బిల్లుల ఆమోదానికి సిద్ధరామయ్య ప్రణాళికలు
జేడీఎస్‌తో జతకట్టడానికి వ్యూహం
బెంగళూరు: జేడీఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత బసవరాజ్ హొరట్టిని శాసనమండలి అధ్యక్షుడిగా చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా పార్టీ నాయకులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. ఇటీవల శాసనసభ నుంచి శాసనమండలికి జరిగిన ఎన్నికలతో పాటు ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల నుంచి శాసనమండలికి జరిగిన ఎన్నికల తర్వాత బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ సంఖ్యాబలం పెరిగింది. అయితే బిల్లుల పాస్ కావడానికి అవసరమైన సంఖ్యాబలం మాత్రం అధికార పక్షానికి లేదు. అందువల్లే అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించిన బీబీఎంపీ విభజనకు సంబంధించిన బిల్లు ఇప్పటికీ మండలి ఆమోదం పొందకుండా పెండింగ్‌లో ఉంది. సమస్య పరిష్కారం కోసం జేడీఎస్‌ను మచ్చిక చేసుకుని వారి సహకారంతో అన్ని రకాల బిల్లులు పాస్ చేయించుకోవాలని సిద్ధరామయ్య ప్రణాళికలు రచిస్తున్నారు.
అందుకోసం జేడీఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఏడుసార్లు ఎమ్మెల్సీగా గెలిచిన బసవరాజ్ హొరట్టికి శాసనమండలి అధ్యక్షస్థానాన్ని కట్టబెట్టాలని సిద్ధరామయ్య నిర్ణయించినట్లు సమాచారం. అదే గనుక జరిగితే ప్రస్తుతం శాసనమండలిలో కాంగ్రెస్, జేడీఎస్‌ల సంయుక్త సంఖ్యా బలం నలభై మూడుకు చేరుకుంటుంది. ఇక ఖాళీగా ఉన్న మూడు నామినేటెడ్ ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థుల ఎంపిక పూర్తయితే సంయుక్త సంఖ్యాబలం 46కు చేరుతుంది. దీంతో ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ బిల్లు అయినా మండలి ఆమోదం పొందుతుందనేది సిద్దు వ్యూహం. ఇక ఈ విషయమై జేడీఎస్ పార్టీ నేతలను ఒప్పించే బాధ్యత బసవరాజ్ హొరట్టికి సీఎం సిద్ధరామయ్య అప్పగించినట్లు సమాచారం. అత్యంత ప్రతిష్టాత్మకమైన మండలి అధ్యక్ష పదవినికి తమ పార్టీ నేతకు ఇప్పించడానికి దళం నాయకులు కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సభాపతి డీ.హెచ్ శంకరమూర్తి త్వరలో తన పదవికి రాజీనామ చేయనున్నట్లు సమాచారం.