అధికార కాంగ్రెస్ పార్టీలో మొదలైన గ్రూపు రాజకీయాలు
మంత్రులంతా ఒకవైపు, ఎమ్మెల్యేలు మరోవైపు
పదవులు కాపాడుకోవడంపై అమాత్యుల దృష్టి
అవే పదవులు చేజిక్కించుకోవడం కోసం ఎమ్మెల్యేల చలో ఢిల్లీ
రాష్ట్రంలో వేడెక్కిన రాజకీయాలు
బెంగళూరు: అధికార కాంగ్రెస్ పార్టీలో నేతల తీరు ఎవరికి వారే ఎమునా తీరే అన్న చందంగా తయారైంది. అధికారం చేజారి పోకుండా ఉండేందుకు అమాత్యులు నానా తంటాలు పడుతుంటే ఆ మంత్రి పదవులను దక్కించుకోవడానికి ఆ పార్టీకి చెందిన శాసనసభ సభ్యులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకూ మంత్రులు, శాసనసభ్యుల మధ్య నాలుగు గోడల మధ్యకే మాత్రమే పరిమితమైన వార్ తాజాగా బహిర్గతమైంది. రాష్ట్రంలో దాదాపు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని మాత్రమే నమ్ముకున్న సీనియర్లను కాదని జేడీఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నాయకులకు ముఖ్యమంత్రితో పాటు మంత్రి పదవులు దక్కాయి. దీంతో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్న మాలికయ్య గుత్తేదార్ వంటి సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై గుర్రుగా ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత ఆ లుకలుకలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఎప్పుడు సీఎల్పీ సమావేశం జరిగినా ఎమ్మెల్యేలు మంత్రులపై విరుచుకు పడేవారు.
తమ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డు పడుతున్నారని, కమీషన్లు వసూలు చేస్తున్నారని సీఎం ముందే విమర్శించేవారు. విమర్శలు ఎదుర్కొంటున్న వారిలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి రామనాథరై, హెచ్.కే పాటిల్ తదితరులు ఉన్నారు. మరోవైపు చురుకుగా వ్యవహరించక పోవడంతో పలు శాఖల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు నత్తనడకన సాగుతున్నాయని గృహ నిర్మాణశాఖ మంత్రి అంబరిష్, ఉద్యానశాఖ మంత్రి శ్యామనూరు శివశంకరప్ప, రెవెన్యూశాఖ మంత్రి వీ.శ్రీనివాస్ ప్రసాద్‌పై కూడా సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు ఆక్రోశం వ్యక్తం చేస్తూ వచ్చారు. మరోవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మూడేళ్లయిన నేపథ్యంలో మంత్రి వర్గ ప్రక్షాళన చేయాలని హై కమాండ్ సిద్ధరామయ్యకు సూచించింది. ఈ కారణాలన్నింటి వల్ల మంత్రి వర్గ విస్తరణ, పునఃవ్యవస్థీకరణ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది
రచ్చకెక్కిన విభేదాలు...
మంత్రి వర్గ ప్రక్షాళన కచ్చితమన్న సంకేతాలు వెలువడటంతో ఆ పదవులపై కన్నేసిన కొంతమంది ఎమ్మెల్యేలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. క్రమంలో దాదాపు 35 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా చర్చలు జరుపుతున్నారు. ఏఏ మంత్రి ఎలా పనిచేస్తున్నారు? ఎమ్మెల్యేలకు అందుబాటులోలేనివారు ఎవరు? సమర్థంగా శాఖలను నిర్వహించలేని వారు ఎవరు అన్న విషయాల పై నివేదికలు తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సాయంత్రం తుమకూరులో కొంతమంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేటు హోటల్లో సమావేశమై సమాలోచనలు జరిపారు. ఈ సమావేశంలో మంత్రి మండలి నుంచి తప్పించాల్సిన 25 మంది అమ్యాత్యులతో కూడిన జాబితాను ‘ఆశావహ’ ఎమ్మెల్యేలు రూపొందించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాకుండా ఈనెలలో ఢిల్లీ వెళ్లి హైకమాండ్‌తో భేటీ అయ్యి జాబితా సమర్పించి విస్తరణ సమయంలో తమకు న్యాయం చేయాల్సిందిగా కోరనున్నారు. ‘మేము పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడటం లేదు. పార్టీ పటిష్టత కోసం ఎవరికి ఉన్నత పదవులు ఇవ్వాలనే విషయం పై మా అభిప్రాయాలను తెలియజేస్తున్నాం. ఈ విషయంలో ఎవరేమనుకున్నా మాకు అభ్యంతరం లేదు.’ అని ఎమ్మెల్యే యశ్వంత్‌పుర ఎమ్మెల్యే ఎస్.టీ సోమశేఖర్ బహిరంగంగానే ప్రస్తుత అమాత్యులకు సవాలు విసురుతున్నారు.
ఇక ఎమ్మెల్యేల సమాలోచనపై ప్రస్తుత మంత్రులు కూడా ఆగ్రహంగా ఉన్నారు. వీరిలో కొంతమంది అమాత్యులు బహిరంగంగానే తమ అసహనాన్ని వెల్లడిస్తున్నారు. ‘మా పనితీరుపై అంచనా వేయడానికి వారు ఎవరు. మంత్రి స్థానంలో ఉండాలో లేదో నిర్ణయించాల్సింది హైకమాండ్ లేదా ముఖ్యమంత్రి మాత్రమే. ఇలా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడితే వారి పై క్రమశిక్షణా రాహిత్యం కింద కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మా పదవులను ఎలా నిలుపుకోవాలో మాకు తెలుసు.’ అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి పేర్కొంటున్నారు. ఇలా అధికార పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు తలోదిక్కుగా ఉంటే రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి ఎలా అని? రాజకీయ విశ్లేషకులతో పాటు సగటు మధ్యతరగతి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.