
పీహెచ్‌సీలో చిన్నారి కిడ్నాప్‌కు యత్నం
వేలూరు: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు గుర్తించిన రోగులు మహిళను పట్టుకొని దేహశుద్ధి చేశారు. వేలూరు అడుకంబరైలోని ప్రభుత్వ ఆసుపత్రికి రోజూ వేలసంఖ్యలో రోగులు వస్తుంటారు. కాగా ఆసుపత్రిలోని ప్రసవ వార్డులో ఆర్కాడు తాలుకా కలవైకి చెందిన కల్పన ఎనిమిది రోజుల క్రితం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. కల్పన శనివారం ఉదయం చిన్నారిని బెడ్‌పైనే ఉంచి మరుగుదొడ్డికి వెళ్లింది. అనంతరం బయటకు వచ్చిన ఆమెకు చిన్నారి కనిపించలేదు. ఈ విషయాన్ని వెంటనే ఆమె చుట్టుపక్కల వారికి తెలిపింది. సమాచారం తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది వెంటనే చిన్నారి కోసం గాలింపు చేపట్టారు.
ఇదిలాఉండ గా చిన్నారిని ఒక మహిళ ఆసుపత్రి నుంచి బయటకు తీసుకెళ్లినట్లు సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. దీంతో రోడ్డుపై వెళుతున్న సదరు మహిళను అడ్డుకుని సహరోగులు విచారించారు. విచారణలో తన పేరు మహేశ్వరి అని, చిన్నారి తన కుమార్తెకు జన్మించినందువల్లే తీసుకెళుతున్నట్లు తెలిపింది. అయితే మహేశ్వరి కుమార్తె ఎనిమిది నెలల గర్భవతి గుర్తించిన వారు చిన్నారిని ఆమె నుంచి తీసుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం ఆమెను పోలీసులకు అప్పగించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇదే తరహాలోనే తరచూ చిన్నారులు మాయమవుతున్న నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.