ప్యారిస్: సేలంలో డీఎంకే నాయకులను హత్య చేసేందుకు వేచి ఉన్న కిరాయి ముఠా సహా ఏడుగురిని నగర పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సేలం కిచ్చిపాళయంకు చెందిన కేబుల్ శరవణన్ (36). డీఎంకే యువజన విభాగం నాయకుడు. ఇతని స్నేహితుడు చెల్లదురై (35). వీరిపై పలు కేసులు ఉన్నాయి. వీరి స్నేహితులు పేచ్చియమ్మ నగర్‌కు చెందిన శక్తి (25), ప్రదీప్ (32), అమ్మాపేట పాండియన్ (24), మణియనూర్ గోపినాథ్ (24), పన్నయపట్టి మణి, సెవ్వాపేటై శంకర్. ఈ క్రమంలో కేబుల్ శరవణన్, చెల్లదురై, అతని స్నేహితుల మధ్య పాత కక్షలున్నాయి. దీంతో వీరిద్దరిని హత్య చేసేందుకు అతని స్నేహితులు నిర్ణయించారు.
ఇందు కోసం తిరునెల్వేలి సుత్తమల్లికి చెందిన సుందర్ (25), సుడలైకన్నన్ (23), సతీష్ (23)తో కూడిన కిరాయి ముఠాను సేలంకు తీసుకొచ్చారు. అనంతరం కిరాయి ముఠాతో కలిసి శక్తి, ప్రదీప్, పాండియన్, గోపినాథ్, మణి, శంకర్ చెల్లదురైను హత్య చేసేందుకు వెంబడించారు. వారి నుంచి చెల్లదురై తప్పించుకున్నారు. దీని గురించి కిచ్చిపాళయం పోలీసుస్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. దీంతో కిరాయి ముఠాను పట్టుకునేందుకు పోలీసు కమిషనర్ ఎ.అమల్‌రాజ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇన్‌స్పెక్టర్ రాజా ఆధ్వర్యంలోని పోలీసులు అనేక ప్రాంతాల్లో తనిఖీలు జరిపారు. సన్యాసి గుండు ప్రాంతంలో కిరాయి ముఠా దాగి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు అక్కడ దాగి ఉన్న శక్తి, ప్రదీప్, సుడలై కన్నన్, సతీష్‌ను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి నాలుగు వేట కత్తులు, రూ.2,820 నగదు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత నెత్తిమేడు కరియ పెరుమాల్ కోయిల్ కరడు ప్రాంతంలో దాగి ఉన్న సుందరన్, పాండియన్, గోపినాథ్‌ను అరెస్టు చేశారు. వీరిని పట్టుకునే సమయంలో వారి కాళ్లకు గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. విచారణలో శక్తి, ప్రదీప్, మణి చెల్లదురై, కేబుల్ శరవణన్‌ను హత్య చేసేందుకు రూ.1.5 లక్ష ఇచ్చేవిధంగా తిరునెల్వేలికి చెందిన రౌడీలు సుందర్, సుడలై కన్నన్, సతీష్‌ను రప్పించినట్టు తెలిసింది. విచారణ తర్వాత నలుగురిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
డీఎంకే నాయకులపై హత్యాయత్నం
Published Fri, Sep 12 2014 12:25 AM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM
Advertisement
Advertisement