బంద్‌కు పిలుపు
సాక్షి, చెన్నై: ఒక రోజు బంద్‌కు ఆటోకార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈనెల 19న రాజధాని నగరంలో ఆటోల సేవలను పూర్తిగా నిలిపివేయనున్నారు. చార్జీల పునఃపరిశీలన, ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు డిమాండ్, అధికారుల వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆటో కార్మిక సంఘాల సమాఖ్య ఆదివారం ప్రకటించింది. రాజధాని నగరంలో ఆటో వాలాల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు చార్జీలను ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. గత ఏడాది ఆగస్టుల్లో ఈ చార్జీలు అమల్లోకి వచ్చినా, ఇంత వరకు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. కొన్ని చోట్ల మీటర్లు వేస్తున్నా, మరి కొన్ని చోట్ల ఆటో వాలాలు అడిగినంత ఇవ్వాల్సిందే. ఈ దోపిడీపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆటో వాలాల భరతం పట్టే విధంగా ఆర్టీఏ, ట్రాఫిక్ పోలీసులు ఉరకలు తీస్తున్నారు. రోజుకు సుమారు మూడు నుంచి ఐదు వరకు ఆటోల్ని సీజ్ చేయడం లేదా, జరిమానాల మోత మోగించడం చేస్తూ వస్తున్నారు.
అదే సమయంలో తమ మీద అధికారులు చూపుతున్న వైఖరిని, చార్జీలు నామమాత్రంగానే ఉన్నాయంటూ ఆటో డ్రైవర్లు, యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పటికే పలు మార్లు చెన్నైలో ఆందోళనలకు దిగిన ఆటో కార్మిక సంఘాలు, ఇక తమ ఆందోళనలను ఉధృతం చేయడానికి నిర్ణయించారు. ఆటోల బంద్‌కు పిలుపు : ఆదివారం చెన్నైలో ఆటో కార్మిక సంఘాలన్నీ ఏక మయ్యాయి. అన్ని సంఘాల నాయకులు, ప్రతినిధులు గంటన్నరకు పైగా చర్చించారు. తమ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఒక రోజు బంద్‌కు పిలుపునిస్తూ ప్రకటన చేశారు. తీర్మానాల్ని ప్రకటించారు. మీటర్లు లేవని, వేయడం లేదన్న సాకుతో ఆటో డ్రైవర్లను ఆర్టీఏ, ట్రాఫిక్ పోలీసులు వేధించుకు తింటున్నారని ఆరోపించారు.
రోజుకు ఐదు ఆటోలు సీజ్ చేస్తున్నారని, ఒక్కోఆటోకు రూ.2000 నుంచి రూ.3000 వరకు జరిమానాలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో చార్జీలను పునః పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందు కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, ఈ కమిటీ ఆటో డ్రైవర్లు, యాజమాన్యాలు, ప్రయాణికులు ఇలా అన్ని వర్గాల వారితో చర్చించినానంతరం కొత్త చార్జీలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. చార్జీల పునఃపరిశీలన, తమ డిమాండ్ల సాధన, అధికారుల వైఖరిని ఖండిస్తూ ఈనెల 19న చెన్నైలో ఆటోల బంద్‌కు పిలుపు నిస్తున్నామని ప్రకటించారు. ఆటోలు ఆ రోజు నడపబోమని, అన్ని సంఘాలు ఏకమై తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని ఆటో డ్రైవర్లకు పిలుపు నిచ్చారు.