
‘సెంట్రల్’లో టెన్షన్
చెన్నై, సాక్షి ప్రతినిధి:రాష్ట్రంలో తీవ్రవాద కార్యకలాపాలు అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. బెంగళూరు-గువాహటి ఎక్స్‌ప్రెస్ రైలు సుమారు ఆరునెలల క్రితం చెన్నై మీదుగా వె ళుతున్న తరుణంలో సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ఆగింది. సరిగ్గా అదే సమయంలో ఆ రైలులోని రెండు బోగీల్లో బాంబులు పేలగా ఒక ఇంజనీరింగ్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన జరిగి నెలలు దాటుతున్నా నిందితులెవరూ దొరకలేదు. నాటి నుంచి నగరంలోని పోలీస్ స్టేషన్లకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం పరిపాటి అయింది. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 1గంట సమ యంలో పోలీసులకు మరో ఫోన్‌కాల్ వచ్చిం ది. సాయంత్రం 4-6 గంటల మధ్య సెంట్ర ల్ రైల్వే స్టేషన్‌లో బాంబు పేలనుందని అందులోని సారాంశం.
ఈ ఫోన్‌కాల్‌తో ఉలిక్కిపడిన ఆర్పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులు సెంట్రల్లో తనిఖీలు ప్రారంభించారు. ఏ మూలను వదలకుండా గాలించారు. ఫ్లాట్‌ఫారంలపై బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్న అన్ని రైళ్లను తనీఖీలు చేశారు. రైల్వే స్టేషన్లోకి వచ్చే ప్రయాణికులను, వారి లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేసిగానీ వదల్లేదు. సుమారు నాలుగు గంటల పాటు విరామం లేకుండా వెదికినా అనుమానాస్పద వస్తువులు ఏమీ దొరకలేదు. దీంతో ఇదంతా ఆకతాయి పనిగా నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే పోలీసులను, ప్రయాణికులను, అధికారులను ఇంతగా భయాందోళనకు గురిచేసిన ఫోన్‌కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.