మృత్యువు ఆమె సీటు కిందే పొంచి ఉంది!
ఆమె ఎక్కిన రైలు గమ్యం చేరలేదు. గురువారం ఆమె ఇంటికి రావలసింది. అమ్మను ఆలింగనం చేసుకోవలసింది. కానీ నవ్వుతూ కేరింతాలు కొడుతూ ఇంటికి రావలసిన అమ్మాయి శవమై వచ్చింది. మృత్యువును తత్కాల్ టికెట్ తో కొనుగోలు చేసి మరీ ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లింది.
మన గుంటూరు అమ్మాయి
మన గుంటూరు అమ్మాయి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉద్యోగి స్వాతి పరుచూరి ఉగ్రవాదులు చెన్నై రైల్వేస్టేషన్ లో ఆగి ఉన్న బెంగుళూరు - గువహటి ట్రెయిన్ లో పెట్టిన బాంబుకి బలైపోయింది. స్వాతి మంచి ప్రతిభగలిగిన విద్యార్థిని. గత డిసెంబర్ లో ఆమె టీసీఎస్ లో చేరింది. ఈ ఫిబ్రవరిలోనే ట్రెయినింగ్ పూర్తి చేసుకుని తొలి జీతాన్ని తీసుకుంది. ఆమె తల్లితండ్రులను కలవాలనుకుంది. వారిని కలిసి ఆనందాన్ని పంచుకోవాలనుకుంది. కబుర్లు కలబోసుకోవాలనుకుంది. అందుకే తత్కాల్ లో టికెట్ కొని బెంగుళూరులో రైలు ఎక్కింది. మృత్యువు ఆమె సీటు కిందే బాంబు రూపంలో పొంచి ఉందన్న సంగతి ఆమెకు తెలియలేదు.
తత్కాల్ లో మృత్యువును కొనుగోలు చేసిన స్వాతి
చెన్నై స్టేషన్ లో ఆగి ఉండగా బాంబు పేలింది. తల్లిదండ్రులు తమ కూతురు చుట్టూ కట్టుకున్న ఆశలు ఆకాంక్షల బంగారు కోటలు భగ్నమైపోయాయి. కొద్ది రోజుల్లోనే ఆమెకి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు సంబంధాలు కూడా చూస్తున్నారు. స్వాతి ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్సెస్ లో బిటెక్ చేసింది. ఆమె తల్లి కామాక్షి పాలిటెక్నిక్ టీచర్, తండ్రి రైతు, తమ్ముడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు.
గుంటూరు శ్రీనగర్ కాలనీకి ఇప్పుడు చిరునవ్వుల స్వాతి చిరనిద్రలో వస్తోంది. వీధి వీధంతా విషాదమై ఆమె కోసం ఎదురుచూస్తోంది. ఉగ్రవాద రక్కసి ఖాతాలో మరో ప్రాణం ఆవిరై చేరింది.