సాక్షి బెంగళూరు: బెంగళూరును విదేశీయులు అక్రమ అడ్డాగా చేసుకుంటున్నారు. విద్య, వైద్యం, వ్యాపారం వీసా మీద బెంగళూరులో ఉంటున్న విదేశీయులు చాలా మంది వీసా గడువు ముగిసినప్పటికీ తమ దేశానికి వెళ్లడం లేదు. విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (ఎఫ్‌ఆర్‌ఆర్‌వో) ఇటీవల హైకోర్టుకు సమర్పించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో సుమారు 28 వేల మంది విదేశీయలు ఉన్నారు. అందులో 66 దేశాలకు చెందిన 1076 మంది అక్రమంగా నివసిస్తున్నట్లు తేలింది. ఇందులో వెయ్యిమంది వరకూ బెంగళూరులోనే మకాం వేశారు. అనధికారికంగా ఈ సంఖ్య కొన్ని రెట్ల ఎక్కువగా ఉండవచ్చని అంచనా. పోలీసులు ఏడాది కాలంగా నగరంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టి అక్రమంగా ఉంటున్న విదేశీయులను గుర్తించారు. వారిపై విదేశీ పౌరచట్టం, పాస్‌పోర్టు చట్టంఉల్లంఘనల మేరకు కేసులు నమోదు చేశారు. ఈ విదేశీయులు డ్రగ్స్ దందా, దోపిడీలలో పాల్గొంటుండడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇటీవల కొలంబియా దోపిడీ దొంగల ముఠా పట్టుబడడం తెలిసిందే.
వెనక్కి పంపడం పెద్ద పని
విదేశీయుల గణాంకాలు మొత్తం ఎఫ్‌ఆర్‌ఆర్‌వో శాఖ వద్ద మాత్రమే ఉంటాయి. అక్రమంగా నగరంలో నివసిస్తున్న వారిని బెంగళూరు పోలీసులు పట్టుకుని పాస్‌పోర్టు చట్టం సెక్షన్ 12 ప్రకారం జైలు శిక్ష విధించవచ్చు. దీంతోపాటు ఎఫ్‌ఆర్‌ఆర్‌వోకి ఆ సమాచారాన్ని తెలియజేయాలి. ఎఫ్‌ఆర్‌ఆర్‌వో ఆయా దేశాల రాయబార కార్యాలయానికి వారి దేశీయులకు సంబంధించిన వివరాలను లేఖ రాస్తుంది. పాస్‌పోర్టు లేకుండా విదేశీయులను విమానాశ్రయం లోనికి కూడా రానివ్వరు. అక్రమంగా ఉంటున్న విదేశీయులను పోలీసులు వారి దేశ విమానంలో ఎక్కించి పంపించేస్తున్నారు. అయితే అదే విమానంలోనే తిరిగి భారత్‌కు విదేశీయులు మళ్లీ వస్తున్నారు. దీనికి తగిన విధానం రూపొందించాలని పోలీసు అధికారులు చెబుతున్నారు.
బంగ్లాదేశీయులు అధికం..
బంగ్లాదేశ్ నుంచి వలస వస్తున్న వారే చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. పశ్చిమ బెంగాల్ సరిహద్దు నుంచి రైలు మార్గం ద్వారా చాలా మంది బెంగళూరుకు చేరుకుంటున్నారని సమాచారం. బెంగళూరు చేరుకున్న వారిలో కొందరు చెత్త ఏరుకుంటూ, నిర్మాణ పనులతో జీవిస్తున్నారు. బెంగళూరులోని మహదేవపురతో పాటు తదితర ప్రాంతాల్లో గుడిసెలు, టెంట్లు వేసుకుని నివాసం చేస్తున్నారు. వారికి ఆధార్, రేషన్ కార్డులు కూడా తీసుకుని ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు.
తిరిగి వెళ్తున్నది కొందరే
వీసా గడువు ముగిసినప్పటికీ అక్రమంగా రాష్ట్రంలో ఉంటున్న వారిని వారి సొంత దేశాలకు పంపించడంలో రాష్ట్ర పోలీసులు అధికారులు విఫలమవుతున్నారు. అక్రమ వలసదారులను గుర్తించిన వెంటనే వారి సమాచారాన్ని ఎఫ్‌ఆర్‌ఆర్‌వోకు పంపించాలి. అక్రమంగా దేశంలో నివసిస్తున్న ఆ విదేశీయుల వివరాలను ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు ఎఫ్‌ఆర్‌ఆర్‌వో లేఖ ద్వారా తెలియజేస్తుంది. ఆ తర్వాత వారి వీసా పునరుద్ధరించడమా లేక వారి సొంత దేశాలకు పంపించడమా అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియ చాలా తక్కువగా జరుగుతోందని కొందరు అధికారులు చెబుతున్నారు.
66 దేశాల పౌరుల తిష్ట
బెంగళూరులో 66 దేశాలకు చెందిన పౌరులు అక్రమంగా నివసిస్తున్నారు. కాంగోకు చెందిన వారు 164 మంది, ఐవరికోస్ట్ నుంచి 100 మంది, అఫ్ఘనిస్తాన్ నుంచి 33, బంగ్లాదేశ్ నుంచి 36, నైజీరియా నుంచి 93 మంది, మారిషస్, మంగోలియా, నమీబియా ఇతర దేశాలకు చెందిన మరికొంత మంది విదేశీయులు నగరంలో తలదాచుకున్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు. అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించడం చాలా కష్టం. బెంగళూరుకు చేరుకున్న విదేశీయులు ఆ తర్వాత రిజిస్టర్ చేసుకున్న చిరునామాల్లో వారు ఉండడం లేదు. వీసా గడువు ముగిసిన అనంతరం గోవా, ముంబై, కేరళ, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాలల్లో తిరుగుతూ వస్తున్నారు. అక్కడక్కడ నేరపూరిత చర్యల్లోనూ పాలుపంచుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment