
కాల్‌గర్ల్ అంటూ ఇంటర్నెట్ లో ప్రచారం
► చిత్రహింసకు సిద్ధంగా ఉండు!
► ఇంటర్నెట్‌లో కాల్‌గర్ల్‌గా ప్రచారం
► ఘరానా వ్యక్తి కోసం పోలీసుల గాలింపు
సాక్షి, బెంగళూరు : తనతో వివాహానికి అంగీకరించలేదనే అక్కసుతో ఒక దంతవైద్యురాలి సెల్‌ఫోన్ నెంబరును కాల్‌గర్ల్ అంటూ ఇంటర్నెట్‌లో పెట్టాడో ప్రబుద్ధుడు. వరుసగా అసభ్య కాల్స్ రావడంతో బాధితురాలు బెంబేలెత్తిపోయింది.
వివరాల్లోకి వెళ్తే... నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దంతవైద్యురాలిగా పని చేస్తున్న మహిళ గతంలో మనస్పర్ధల కారణంతో భర్త నుంచి విడిపోయింది. తరువాత మరో సంబంధం కోసం మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో తన ఫోటో, మొబైల్ నంబర్ తదితర వివరాలను నమోదు చేసుకుంది. ఈ క్రమంలో రాంకీ (పేరు మార్చాం) అనే వ్యక్తి మ్యాట్రిమోనీ ద్వారా పరియమయ్యాడు. దీంతో వైద్యురాలు రాంకీ వివరాల గురించి ఆరా తీయగా తగిన సంబంధం కాకపోవడంతో వైద్యురాలి తల్లితండ్రులు అతనితో వివాహానికి ఒప్పుకోలేదు.
అయితే కొద్ది రోజుల అనంతరం అతడు బాధితురాలికి ఫోన్ చేసి వివాహం గురించి ప్రస్తావన తేగా తమ తల్లితండ్రులు అంగీకరించలేదని వివాహం కుదరదంటూ తెలిపింది. అంతటితో ఊరుకోని దుండగుడు తనతో సహజీవనం చేయాలని ఒత్తిడి చేశాడు. ఇలాంటి పిచ్చి వాగుడు కట్టిపెట్టాలని ఆమె వారించి, మరోసారి తనకు ఫోన్‌లు చేయవద్దని, లేని పక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ తీవ్రంగా హెచ్చరించింది.
ఫోన్ చేసి మరీ...
దీంతో కొద్ది రోజుల పాటు ఊరికే ఉన్న రాంకీ జనవరి మొదటి వారంలో గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ చేసి హింసను అనుభవించడానికి సిద్ధంగా ఉండాలంటూ చెప్పి ఫోన్ కట్ చేశాడు. మరుసటి రోజు నుంచి వివిధ రకాల నంబర్ల నుంచి అనేక మంది వ్యక్తులు ఆమెకు ఫోన్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకిలా ఫోన్ చేస్తున్నారంటూ బాధితురాలు వారిని ప్రశ్నించగా కాల్‌గర్ల్ నంబర్ అంటూ ఒక వ్యక్తి నంబర్ ఇచ్చాడని తెలిపారు. మరి కొంతమంది తమకు ఇంటర్నెట్‌లో నంబర్ లభించిందంటూ తెలిపారు. ఎందుకిలా జరిగిందో బాధితురాలు ఆలోచించగా రాంకీఐ అనుమానమొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం విభాగం దర్యాప్తును ప్రారంభించింది.