కోటలు, ఆలయూలకు ప్రసిద్ధి
కొయ్యబొమ్మలకు పెట్టిందిపేరు
ప్రాజెక్టులు, పర్యాటక క్షేత్రాలు చాలానే
ఎన్నో చారిత్రక ఆనవాళ్లు.. నిర్మల్ కోటలు, బురుజులు. మరెన్నో చరిత్రాత్మక గురుతులు.. వెయ్యి ఉరుల మర్రి, పోరాటాలు. ఆధ్యాత్మికతను పెంచే ఆలయూలు.. బాసర, అడెల్లి, కదిలి. ఆహ్లాదాన్ని పంచే పర్యాటక ప్రాంతాలు.. జన్నారం అడవులు, కడెం జలాశయ అందాలు, తాగు, సాగు నీరందించే ప్రాజెక్టులు.. కడెం, స్వర్ణ గడ్డెన్నవాగు ప్రాజెక్టులు. కళలు ఉట్టిపడే కొయ్యబొమ్మలు, నకాశి కళాకారుల నుంచి జాలువారే పెరుుంటింగ్‌లు.. ఒకటేమిటి.. ఇలా చెప్పుకుంటూ పోతే కొత్త జిల్లా నిర్మల్‌లో ప్రతీది విశేషమే. విశ్లేషణాత్మక అంశమే.
- నిర్మల్
బాసర సరస్వతీదేవి
చదువుల తల్లి బాసర సరస్వతీ కొలువుదీరి ఉన్నది కొత్తగా ఏర్పడుతున్న నిర్మల్ జిల్లాలోనే. నిత్యం అక్షరాభ్యాసం కోసం పలు రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. దేశంలో కాశ్మీర్ తరువాత రెండో సరస్వతీ దేవాలయం ఇదే కావడం విశేషం. బాసర పుణ్యక్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం అనేక సౌకర్యాలు ఉన్నాయి. పలు విశ్రాంతి గృహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
నిర్మల్ కొయ్యబొమ్మలు
నిర్మల్ కొయ్యబొమ్మలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచాయి. పొనికి కర్రతో తయారు చేస్తున్నారు. 1955లో నిర్మల్ కొయ్యబొమ్మల పారిశ్రామిక సహకార సంఘాన్ని ఏర్పాటు చేశారు. నిర్మల్ కొయ్యబొమ్మలు సహజ రూపాన్ని తలపిస్తాయి. వివిధ రకాల పండ్లు, ఫలాలు, పక్షులు, జంతువుల వంటి కళారూపాలకు జీవం పోస్తున్నారు. పెయింటింగ్‌ను డెకో పెయింటింగ్‌తో వేయడం ఇక్కడి ప్రత్యేకత. బ్లాక్ పెయింటింగ్ బ్యాక్‌గ్రౌండ్‌గా వస్తూ, ఇక్కడి చిత్రాలు రూపుదిద్దుకుంటాయి.
కదిలిలో పాపహరేశ్వరాలయం
దిలావర్‌పూర్ మండలంలోని కదిలి పాపహరేశ్వరాలయం అత్యంత పురాతనమైన, ప్రాశస్త్యం కలిగిన ఆలయం. పూర్వం పరశరాముడితో ప్రతిష్టించిన శివలింగంగా చెబుతుంటారు. ఆలయంలోని విగ్రహాలు అత్యంత శిల్పకళ ఉట్టిపడేలా ఉంటాయి. నందీశ్వరుడు, ద్వారపాలకులు, వినాయకుని విగ్రహం, శివలింగం, మాతాన్నపూర్ణదేవి విగ్రహాలు అత్యంత ప్రాశస్త్యం కలిగినవి. చుట్టూ అటవీ ప్రాంతంతో పచ్చని చెట్ల మధ్య ఉన్న ఈ ఆలయం భక్తుల కొంగుబంగారంగా నిలుస్తోంది.
మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే అటవీ ప్రాంతంలో ఉన్న కాల్వ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయం బాగా పేరెన్నికగన్నది. ఇక్కడి కోనేరులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారినిని దర్శించుకుంటారు.
బూర్గుపల్లి రాజరాజేశ్వరాలయం
మామడ మండలంలోని బూర్గుపల్లి శ్రీరాజరాజేశ్వరాలయం శివరాత్రి ఉత్సవాలకు ప్రసిద్ధి. భక్తుల కొంగుబంగారంగా నిలిచే ఈ ఆలయం గుట్టల మధ్య అటవీ ప్రాంతంలో వెలసింది. శ్రీ పరమేశ్వరుడు భూలోకానికి వచ్చి బూర్గుపల్లి ఆలయంలో వెలిసిన అనంతరం లక్ష్మణచాంద మండలం బాబాపూర్ శివాలయం, అక్కడి నుంచి కరీంనగర్ జిల్లా వేములవాడకు వెళ్లినట్లు పురాణాలు చెబుతున్నాయి. నిర్మల్ మండలంలోని సోన్‌లోని చారిత్రాత్మక వేంకటేశ్వర, దక్షిణాముఖ హనుహన్ ఆలయాలు ప్రసిద్ధి గాంచారుు.
ప్రాజెక్టులు
సారంగాపూర్ మండలంలో స్వర్ణ ప్రాజెక్టు కింద సుమారు 10 వేల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 1183 అడుగులు. అలాగే ఎస్సారెస్పీ కింద సరస్వతీ కెనాల్ ద్వారా నిర్మల్ జిల్లాలోని పలు మండలాల్లో సుమారు 50 వేల ఎకరాల ఆయకట్టుకు నీర ందుతుంది.
భైంసాలో గడ్డెన్నవాగు ప్రాజెక్టు వేల ఎకరాల ఆయకట్టు కలిగింది. కడెం ప్రాజెక్టు జిల్లాకు తలమానికం. ఈ భారీ నీటి పాదరుల ప్రాజెక్టు 700 అడుగులు, 7.50 టీఎంసీల నీటి సామర్థ్యం కలదు. కడెం ప్రాజెక్టు దిగువ భాగంలో బోటింగ్‌లను ఏర్పాటు చేయడంతో నిత్యం పర్యాటకుల తాకిడి కనిపిస్తుంది. తెలంగాణ టూరిజం కింద ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టారు. హరితా రిసార్ట్‌లను ఏర్పాటు చేశారు.
కోటలు
నిర్మల్ పట్టణంలో నిమ్మలనాయుడి కాలంలో ఛత్తీస్, బత్తీస్, శ్యాంఘడ్ కోటలు, గొలుసు కట్టు చెరువులు, బురుజులు కట్టించారు. ఇవి ఆ కాలం నాటి చరిత్రను కళ్లకు కడుతున్నారుు. చరిత్రాత్మక ఆనవాళ్లను గుర్తు చేస్తున్నాయి. పర్యాటకంగా వాటిని మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది.