భగ్గుమన్న వర్గపోరు
- అర్ధంతరంగా నిలిచిన పాలికె సౌధ ప్రారంభోత్సవం
- పోలీసుల అదుపులో బీబీఎంపీ కార్పొరేటర్ ఉమేష్‌శెట్టి
- నాగరబావిలో 144 సెక్షన్ అమలు
బెంగళూరు : బృహత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీఎంపీ) పరిధిలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య విభేదాలు ఆదివారం భగ్గుమన్నాయి. ఫలితంగా ప్రజాసౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఉద్యానవనం, పాలికె సౌధ ప్రారంభం వాయిదా పడింది. ఆ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సుమారు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సంఘటన స్థలాన్ని బెంగళూరు నగర అడిషనల్ పోలీస్ కమిషనర్ అలోక్‌కుమార్, డీసీపీ లాబూరామ్ పరిశీలించి, పరిస్థితిని సమీక్షించారు. వివరాల్లోకి వెళితే...
గోవిందరాజనగర నియోజవర్గంలో చంద్రగిరి ఉద్యానవనం, పాలికె సౌధను బీబీఎంపీ నిధులతో నాగవార పాలికె వార్డు కార్పొరేటర్ ఉమేష్ శెట్టి నిర్మించారు. అత్యంత సుందరంగా రూపొందిన ఈ పార్క్‌ను ఆగష్టు 16, 24 తేదీలలో ప్రారంభించాలని అనుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వేడుకలు వాయిదా పడ్డాయి. ఆదివారం పాలికె సౌధతో పాటు పార్క్‌ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అనంతకుమార్, సదానందగౌడ, వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు రామలింగారెడ్డి, దినేష్ గుండూరావుతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్.అశోక్, స్థానిక ఎమ్మెల్యే ప్రియాకృష్ణను కార్పొరేటర్ ఉమేష్‌శెట్టి ఆహ్వానించారు.
ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం సభా ఏర్పాట్లను ఉమేష్‌శెట్టి పర్యవేక్షిస్తున్నారు. ఆ సమయంలో అక్కడకు పోలీసులు, ఎమ్మెల్యే ప్రియాకృష్ణ(కాంగ్రెస్) అనుచరులు చేరుకున్నారు. ఉమేష్‌శెట్టితో ఎమ్మెల్యే అనుచరులు వాదనకు దిగారు. గొడవ ఎక్కువ కావడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఉమేష్‌శెట్టిని అదుపులోకి తీసుకుని కేఎస్‌ఆర్‌పీ మైదానంలోకి తీసుకెళ్లారు. తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
ఆరోపణలు, ప్రత్యారోపణలు : బీబీఎంపీ నిధులతో అభివృద్ది చేసిన చంద్రగిరి పార్క్, పాలికె సౌధల ప్రారంభోత్సవాల వేడుకలను స్థానిక నాగరబావి కార్పొరేటర్ ఉమేష్‌శెట్టి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని స్థానిక శాసన సభ్యుడు ప్రియాకృష్ణ మండిపడ్డారు.
ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాలికె నిధులతో ఏర్పాటు చేస్తే బీజేపీ నాయకులను పిలిపించి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కనీసం తనను ఈ కార్యక్ర మానికి ఆహ్వానించలేదని మండిపడ్డారు. నాగరబావి వార్డు కార్పొరేటర్ ఉమేష్‌శెట్టి మాట్లాడుతూ ఇప్పటి వరకు నాలుగు సార్లు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. నాగరబావి వార్డు అభివృద్ది చెందడం స్థానిక శాసన సభ్యుడు ప్రియాకృష్ణకు ఇష్టం లేదని మండిపడ్డారు.