ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా కొనసాగుతున్న సోమ్‌నాథ్ భారతీని మంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలని భారతీయ జనతా పార్టీ
సోమనాథ్‌ను సాగనంపాల్సిందే!
Published Thu, Jan 23 2014 11:43 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా కొనసాగుతున్న సోమ్‌నాథ్ భారతీని మంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఆ కుర్చీలో ఒక్క క్షణం కూడా కూర్చొనే రాజ్యాంగపరమైన హక్కు ఆయనకు లేదని పేర్కొంది. తమపైన దాడిచేసినవారికి నేతృత్వం వహించింది సోమ్‌నాథ్ భారతేనని ఉగాండా మహిళ గుర్తించడంతోపాటు ఆమె వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ సమక్షంలో రికార్డు కూడా చేసిన విషయం తెలిసిందే. పలు మహిళాసంఘాలు ఇదే డిమాండ్ చేయడం, ఢిల్లీ మహిళా కమిషన్ కూడా సోమ్‌నాథ్‌కు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. దీంతో దీంతో సోమ్‌నాథ్‌పై చర్యలు తీసుకోవాలని తాము చేస్తున్న డిమాండ్‌ను తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ మరింత బలంగా వినిపించింది. వెంటనే ఆయనను పదవి నుంచి తప్పించాలని ఆ పార్టీ నేత రవిశంకర్ ప్రసాద్ గురువారం డిమాండ్ చేశారు. నరేంద్రమోడీని అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. త్వరలోనే ఆప్ బుడగ పగులుతుందని ఆయన జోస్యం చెప్పారు.
కమిషనర్ బస్సీని కలిసిన గోయల్ బృందం
న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్‌ను అరెస్టు చేయాలని కోరుతూ విజయ్ గోయల్, విజేందర్ గుప్తా నేతృత్వంలోని కమలదళం గురువారం ఢిల్లీ కమిషనర్ బీఎస్ బస్సీని కలిసింది. అనంతరం గోయల్ మీడియాతో మాట్లాడుతూ... ‘ఉగాండా బాధితురాలు స్పష్టంగా గుర్తించి, మెజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలాన్ని ఇచ్చిన తర్వాత కూడా సోమ్‌నాథ్ భారతిని ఎందుకు అరెస్టు చేయరాదని ప్రశ్నిస్తూ కమిషనర్‌కు ఓ లేఖను సమర్పించామ’ని చెప్పారు.
Advertisement
Advertisement