గుర్గావ్: ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వమే కారణమని హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్‌సింగ్ హూడా ఆరోపించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ హామీ ఇచ్చిన విధంగా మంచి రోజులొచ్చాయో లేదో ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు. ‘రైలు ప్రయాణం భారమయింది. చక్కెర, డీజిల్ ధరలు పెరిగాయి. వీటిని మంచి రోజులు అంటారా?’ అని ఆయన ప్రశ్నించారు. గుర్గావ్‌లోని కమాన్ సరాయిలో శనివారం నిర్వహించిన కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు. పేదల సంక్షేమంపై బీజేపీకి ఒక్క విధానమూ లేదని, వంటగ్యాస్ ధరను ప్రతి నెలా రూ.10 చొప్పున పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత ఎల్పీజీ ధరలు పెంచుతారని స్పష్టం చేశారు. మెట్రోరైలు మార్గాన్ని మనేసర్ వరకు పొడగిస్తున్నామని, ఇందుకోసం సవివర ప్రాజెక్టు నివేదికను తయారు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన విలేకరులతో అన్నారు. 108 కిలోమీటర్ల పొడవైన గుర్గావ్-మనేసర్-బవాల్ రోడ్డు ప్రాజెక్టును జపనీస్ కంపెనీ, ఢిల్లీ-ముంబై పారిశ్రామిక అభివృద్ధి సంస్థ, హర్యానా మాస్‌ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ సహకారంతో రాబోయే నాలుగేళ్లలో పూర్తి చేస్తామని హూడా ఈ సందర్భంగా ప్రకటించారు. దీనికి రూ.27 వేల కోట్ల వ్యయమవుతుందని, జపాన్ సంస్థ రుణం రూపంలో కొంత మొత్తం ఇస్తుందని తెలిపారు. హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కొందరు తమవైపు రావడానికి సిద్ధంగా ఉన్నారంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపైనా హూడా స్పందించారు. బీజేపీ నాయకులవన్నీ వ్యర్థ ప్రేలాపనలని ముఖ్యమంత్రి విమర్శించారు. ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోనే ఉంటారని స్పష్టీకరించారు.
ధరల పెరుగుదలకు కేంద్రానిదే బాధ్యత
Published Sun, Jun 29 2014 10:15 PM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM
Advertisement