హర్షవర్ధన్‌కు సవాలుగా మారిన
ఢిల్లీ బీజేపీ పగ్గాలు
అంతర్గత కుమ్ములాటలే పెద్ద తలనొప్పి
ఆప్‌ను ఎదుర్కోవడం
అంత సులభం కాదు
క్లీన్ ఇమేజ్ కలసి వచ్చే అంశం
విధానసభ ఎన్నికల్లో
విజయవంతమైన నాయకత్వం
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడు కావడం డా. హర్షవర్ధన్‌కు పెద్ద సవాలుగా మారింది. నరేంద్రమోడీని ప్రధానమంత్రిగా చేయాలంటే ఢిల్లీలోని ఏడు సీట్లలో అత్యధిక సీట్లను బీజేపీ గెలుచుకోవలసి ఉంది. ఇంటా బయటా సమస్యల నుంచి పార్టీని గట్టెక్కించి లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు తెచ్చిపెట్టడం అంతసులువైన విషయమేమీ కాదు. అంతర్గత కుమ్మలాటలతో చీలిపోయిన పార్టీని ఒక్కతాటిపై నడిపించడం, అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరింత ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ విజయరథానికి కళ్లెం వేయడం హర్షవర్ధన్ ముందున్న సవాళ్లు. రానున్న లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య అన్ని సీట్లలో ముక్కోణపు జరుగనుంది. కాంగ్రెస్ బలహీనంగా మారినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా వీస్తోన్న పవనాలు బీజేపీ లక్ష్యసాధనకు అడ్డుపడనున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఆప్‌ను తేలికగా తీసుకోబోమని బీజేపీ అంటోంది. ఏడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలోనూ, మాజీ అధ్యక్షుడు విజయ్ గోయల్ ఏకపక్షంగా నియమించిన కార్యవర్గంతో పనిచేయడంలోనూ హర్షవర్ధన్ నేర్పు చూపించవలసి ఉంటుంది. ప్రస్తుతం 14 జిల్లాల అధ్యక్షులుగా ఉన్నవారందరూ గోయల్ అనుచరులే.. వారితో పనిచేయడం కష్టం కనుక హర్షవర్ధన్ కొత్త కార్యవర్గాన్ని నియమించవచ్చని కొందరు అంటుండగా, దానికి ఆయనకు తగినంత సమయం లేదని మరికొందరు అంటున్నారు. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికను పార్టీ ఇప్పటికే ప్రారంభించింది. ఇటీవల ఢిల్లీ ఇన్‌చార్జ్‌గా నియమించిన ప్రభాత్ ఝాతోనూ, నితిన్ గడ్కరీతోనూ కలిసి హర్షవర్ధన్ లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థులను ఎంపిక చేయవలసి ఉంది. ఈ నెలాఖరు వరకు బీజేపీ తరఫున ఏడు లోక్‌సభ స్థానాల నుంచి పోటీచేసే అభ్యర్థుల పేర్లు ఖరారవుతాయని అంటున్నారు. ఢిల్లీ బీజేపీలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేత కావడంతోపాటు నిజాయితీపరుడైన నేతగా ఆయనకున్న గౌరవమర్యాదలు, ప్రతిష్ట, పార్టీ సీనియర్ నేతలతో ఆయనకున్న సత్సంబంధాలు, ఆర్‌ఎస్‌ఎస్ అండదండలు, ముఖ్యమంత్రి అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆవిష్కరించడం, ఆమ్ ఆద్మీ పార్టీ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడం.. హర్షవర్ధన్‌కు అనుకూల అంశాలని రాజకీయపండితులు అంటున్నారు.
హర్షవర్ధన్‌కు అనుకూలంగా ఉన్న ఈ అంశాలతో పాటు సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక వ్యక్తి.. ఒక పదవి.. అనే నియమాన్ని పక్కన బెట్టి విధానసభ పక్ష నేతగా ఉన్న హర్షవర్ధన్‌ను పార్టీ అధ్యక్షునిగా నియమించిందని చెబుతున్నారు.
ఏడు సీట్లూ గెలుస్తాం: హర్షవర్ధన్
‘ఢిల్లీలో 7 ఎంపీ సీట్లను గెలుచుకుని నరేంద్రమోడీని ప్రధానమంత్రిని చేయడమే మా ముందున్న లక్ష్యం.. ఈ క్రమంలో సరైన అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాం. త్వరలోనే ఆ పేర్లను వెల్లడిస్తాం..’ అని హర్షవర్ధన్ గురువారం మీడియాకు తెలిపారు. తనకు, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు విజయ్‌గోయల్ మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ‘మేమందరం కలిసికట్టుగా పనిచేసి ఢిల్లీలోని 7 సీటనూ గెలుచుకోవాలనే పట్టుదలతో ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఇంటింటికీ తిరిగి ఆప్ సర్కార్ 49 రోజుల పాలనలోని వైఫల్యాలను ప్రజలకు వివరిస్తాం.
కాంగ్రెస్‌తో జతకూడి ఆ పార్టీ అవినీతికి ఎలా పాల్పడింది కళ్లకు కడతాం..’ అని వివరించారు. కేజీగ్యాస్ కేసులో కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, కేంద్ర పెట్రోలియం మంత్రి వీరప్పమొయిలీపై కేసు నమోదు చేయడం ఆ పార్టీ ద్వంద్వ నీతికి నిదర్శనమని ఆయన ఆరోపించారు. ఆప్ మొదటి నుంచీ ఢిల్లీ ప్రజలను మోసం చేస్తూనే ఉందని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్, ఆప్‌లలో దేనినుంచి బీజేపీకి పోటీ ఉందని ప్రశ్నించగా.. తమ పార్టీకి ఆ రెండూ పోటీ కాదన్నారు. అయితే అవి దేశానికి ప్రమాదకరమని చెప్పారు. ఆప్ సర్కార్ రాజీనామా తర్వాత నగరంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులపై మాట్లాడేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌ను త్వరలోనే కలవనున్నట్లు హర్షవర్ధన్ తెలిపారు.
డాక్టర్ సాబ్.. జాదూ చలేగా?
Published Thu, Feb 20 2014 10:53 PM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM
Advertisement
Advertisement