త్వరలో ప్రధాని మోదీ రాక
ముందుగా 42 మంది
కేంద్ర మంత్రుల పర్యటన
కార్యక్రమాల రూపకల్పనలో
బీజేపీ కసరత్తు
దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలన్న పట్టుదలతో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ ముందుగా తమిళనాడుపై కసరత్తు ప్రారంభించారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమై ఉన్న బీజేపీ దేశవ్యాప్తంగా బలమైన పార్టీగా తీర్చిదిద్దేందుకు అన్ని రాష్ట్రాల సమస్యల పరిష్కారంపై మోదీ ప్రత్యక్ష పర్యవేక్షణకు దిగారు. ఇందుకోసం ఆయా రాష్ట్రాల పార్టీ అధ్యక్షులతో వీలున్నపుడల్లా సమావేశం అవుతున్నారు. అయితే దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాల్లో ఇప్పట్లో ఎన్నికలు లేనందున తన పూర్తి సమయాన్ని తమిళనాడుకు కేటాయించడం ప్రారంభించారు. గత ఏడాది పార్లమెంటు ఎన్నికల ప్రచారసమయంలోనే మోదీకి తమిళ ప్రజలు బ్రహ్మరథం పట్టినందున ఇదే ఊపును కొనసాగిస్తే 2016 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో జార్జికోటపై జెండా ఎగురవేయచ్చన్న నమ్మకంతో ఉన్నారు. అధికారంలో వున్న అన్నాడీఎంకే భవిష్యత్తు అమ్మ (జయలలిత) చరిష్మాపైనే పూర్తిగా ఆధారపడి ఉండగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఆమె మెడకు చుట్టుకుంది.
యూపీఏతో పొత్తు, 2 జీ స్పెక్ట్రం కేసుల కారణంగా అప్రతిష్టను మూటగట్టుకున్న డీఎంకే అధికారం చేజిక్కించుకునే స్థాయిలో పుంజుకోలేదు. రాష్ట్ర కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయిందని చెప్పవచ్చు. చిన్నా చితకా ప్రాంతీయ పార్టీలు బలమైన పార్టీతో పొత్తు కోసం ఎదురుచూసే స్థాయిని దాటిరాలేదు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ఇదే మంచి తరుణమని కమలనాథులు భావిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే, డీఎంకేలు లేని కూటమిని రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఏర్పాటు చేసుకున్న రికార్డును బీజేపీ సొంతం చేసుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీనే రాష్ట్రంలో సైతం పగ్గాలు చేపడితే మేలు జరుగుతుందని ప్రజలను నమ్మించే ప్రయత్నంలో బీజేపీ ఉంది. ఈ ఉద్దేశంతోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను ఇటీవల రెండుసార్లు రాష్ట్రానికి పంపి పార్టీ సభ్యత్వంపై ప్రత్యేక డ్రైవ్‌చేయించారు. ఇందుకు కొనసాగింపుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌కు మంగళవారం ఢిల్లీ నుంచి ఆకస్మిక పిలుపు అందింది.
హోసూరు పర్యటనలో ఉన్న తమిళిసై తన కార్యక్రమాలను రద్దుచేసుకుని సాయంత్రానికల్లా ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రం 5.10 గంటల నుండి 5.55 గంటల వరకు అంటే 45 నిమిషాలపాటూ ఇద్దరూ రాష్ట్రరాజకీయాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. కేవలం ఒక రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ప్రధానే స్వయంగా కార్యోన్ముఖులు కావడం గమనార్హం. దీర్ఘకాలిక సమస్యల నుంచి సున్నితమైన అంశాల వరకు అన్నీ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రాభివృద్ధి పథకాలు ఏమిటి, ప్రజలు వేటి కోసం ఎదురుచూస్తున్నారని అడిగారు. ఆధార కార్డుల జారీలో తలెత్తుతున్న సమస్యలను ప్రస్తావించి ప్రజలను ఏవిషయంలోనూ ఇబ్బందులు పెట్టవద్దని ఆదేశించినట్లు సమాచారం. రాష్ట్రంలోని రైతుల స్థితిగతులు, సాగునీటి పరిస్థితులు, జల వివాదాలను తెలుసుకున్నారు.
తమిళనాడు ప్రజల పట్ల ప్రధాని ఎంతో ఆసక్తిని చూపారని, కెనడా పర్యటనలో అక్కడి తమిళుల ఘనస్వాగతాన్ని ఆయన పదే పదే స్మరించుకున్నారని తమిళిసై చెప్పారు. జాతీయ పార్టీలు రాష్ట్రాల సమస్యలను పట్టించుకోవనే అభిప్రాయాన్ని తుడిచివేసేలా తమిళనాడు ప్రజలకు తెలియజెప్పాలని ఆయన ఆదేశించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తమిళనాడులో విస్తృతంగా ప్రచారం చేసేందుకు మేలో ఏకంగా 42 మంది కేంద్ర మంత్రులను రాష్ట్రానికి పంపుతున్నట్లు ఆమె చెప్పారు. ఏఏ జిల్లాల్లో ఏ శాఖ మంత్రి పర్యటించాలి, ఆ జిల్లాలోని ప్రధాన సమస్యలు ఏమిటీ అనే అంశాలపై రాష్ట్రం నుంచి నివేదిక సిద్ధమవుతోంది. వచ్చేనెల మొదటి వారం నుంచి కేంద్ర మంత్రుల పర్యటన ప్రారంభం అవుతుండగా, వీరి కార్యక్రమాల ముగింపు దశలో అంటే మే నెలాఖరు లేదా జూన్ మొదటివారంలో మోదీ పర్యటించేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. రెండు లేదా మూడు చోట్ల మోదీ ప్రసంగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
జార్జికోటపై కమలం కన్ను
Published Thu, Apr 23 2015 1:56 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement