ప్రభుత్వం కూల్చివేతకు బీజేపీ కుట్ర: ఆప్
Published Mon, Feb 3 2014 11:48 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ: తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. తమ పార్టీకి పెరుగుతున్న ప్రతిష్ట చూసి బీజేపీ భయపడుతోందని, అందుకే అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొంది. ఢిల్లీ బీజేపీ సభాపక్షనేత హర్షవర్ధన్, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ, ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ తమ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆప్ నేత సంజయ్‌సింగ్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బీజేపీ తమ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపుతోందన్నారు. ప్రభుత్వాన్ని పడగ్టొటడం కోసం బీజేపీ తనను మూడుమార్లు సంప్రదించిందని కస్తూరిబానగర్ ఎమ్మెల్యే మదన్‌లాల్ ఆరోపించారు.
ఎన్నికల ఫలితాలు వెలువడకముందు నుంచే తనతో బేరసారాలు మొదలయ్యాయని చెప్పారు. ‘ఎన్నికల ఫలితాల వెలువడడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు అంటే.. డిసెంబర్ ఏడు అర్ధరాత్రి రాత్రి 12.30 గంటలకు నాకు ఐఎస్‌డీ కాల్ వచ్చింది. మరుసటి ఉదయం అరుణ్‌జైట్లీతో మాట్లాడిస్తానని కాలర్ చెప్పాడు. నేను ‘షటప్’ అని ఫోన్ పెట్టేశాను. తరువాత రెండు రోజులకు.. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకమునుపు నన్ను సంప్రదించిన వ్యక్తి మళ్లీ మాట్లాడాడు. ఆప్‌కు ఎలాగూ మెజారిటీ లేదు కాబట్టి తమకు మద్దతు ఇస్తే ఏది కావాలంటే అది ఇస్తామని అన్నాడు. తాజాగా పది రోజుల కిందట ఇద్దరు వ్యక్తులు నా దగ్గరికి ఇద్దరు వచ్చారు. వారిలో ఒకరు తనకు పరిచయస్తుడు కాగా మరొకరు నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకున్నాడు.
తొమ్మిది మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని కూల్చవలసిందిగా కోరాడు’ అని మదన్ లాల్ వివరించారు. ఇందుకు ప్రతిఫలంగా తనను ముఖ్యమంత్రిని, మిగతావారిని మంత్రులను చేస్తాననిప్రతిపాదించాడని, బీజేపీ తమ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుందన్నాడని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కావాలనుకునేవారికి 20 కోట్ల రూపాయలు కేబినెట్ మంత్రులకు 10 కోట్ల రూపాయలు ఇస్తానని ప్రతిపాదించాడని కూడా వివరించారు. ఈ ఆరోపణలను నిరూపించే సాక్ష్యాధారాలు తనవద్ద లేవని మదన్‌లాల్ చెప్పారు. బిన్నీతో తాను చేతులు కలిపినట్లు మీడియా దుష్ర్పచారం చే స్తోందని ఆరోపించారు. ఈ అసత్య ప్రచారాన్ని ఖండించడానికే తాను బీజేపీ బేరసారాలను బయటపెట్టినట్లు మదన్‌లాల్ చెప్పారు. బీజేపీ బేరసారాల గురించి పార్టీకి వెల్లడించినట్టు ఆయన చెప్పారు. తాను బిన్నీతో సమావేశం కాలేదన్నారు.
మీడియా సంస్థలకు కూడా పాత్ర ఉంది
ఆప్ నుంచి బహిష్కృతుడైన ఎమ్మెల్యే వినోద్‌కుమా ర్ బిన్నీ, బయట నుంచి ప్రభుత్వానికి మద ్దతు ఇస్తు న్న ఇద్దరు ఎమ్మెల్యేలు షోయబ్ ఇక్బాల్, రామ్‌బీర్ సింగ్ షౌకీన్ ప్రభుత్వానికి 48 గంటల అల్టిమేటం ఇవ్వడంతో ఆప్ అప్రమత్తమయింది. సోమవారం ఉదయం పార్టీ నేతలు సంజయ్‌సింగ్ ఆశుతోష్, ఎమ్మెల్యే మదన్‌లాల్ మీడియా సమావేశం ఏర్పా టు చేసి బీజేపీపై మండిపడ్డారు. కొన్ని మీడి యా సంస్థలకు కూడా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగస్వామ్యం ఉందని ఆప్ ఆరోపించింది. ఈ కుట్రలను ప్రజల ముందుకు తేవడానికి మంగళవారం నుంచి ‘పోల్ ఖోల్ అభియాన్’ చేపట్టనున్న ట్లు ఆప్ ప్రకటించింది. ఈ ప్రచారోద్యమం ద్వారా కాంగ్రెస్, బీజేపీ గుట్టురట్టు చేస్తామని ఆప్ ప్రకటించింది.ఆప్ సర్కారును కూల్చడానికి జరుగుతోన్న కుట్ర వెనుక అదానీ, అంబానీ హస్తం కూడా ఉందని సంజయ్ సింగ్ ఆరోపించారు. డిస్కమ్‌ల లెసైన్సులు రద్దు చేస్తానని కేజ్రీవాల్ హెచ్చరించిన రోజు నుంచి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు ఊపందుకున్నాయని ఆరోపించారు. కరెంటు సంక్షోభం గురించి ప్రభుత్వానికి సమాచారం అందకమునుపే బీజేపీ నిరసన ప్రదర్శనలు మొదలుపెట్టిందని సంజయ్ అన్నారు. బిన్నీ బీజేపీతో చేతులు కలిపారని ఆయన ఆరోపించారు.
నిజమేనా ?: కాంగ్రెస్
ఆమ్ ఆద్మీ పార్టీ విలేకరుల సమావేశాన్ని నిర్వహించడానికి ముప్పావుగంటల ముందు ఢిల్లీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ షకీల్ అహ్మద్ ఆప్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ చేస్తోన్న ప్రయత్నాల గురించి ట్వీట్ చేశారు. ‘బీజేపీకి సన్నిహితంగా ఉండే కోటీశ్వరుడైన పారిశ్రామిక ఆప్ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నిస్తున్నారట. ఆప్‌కు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలతో రాజీనామాలు ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇది నిజమేనా ?’ అని ట్వీట్ చేశారు.
ఆరోపణలను ఖండించిన బీజేపీ
తమ సర్కారును కూల్చివేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఆప్ చేసిన ఆరోపణలను ఆ పార్టీ ఖండించింది. ఇవి నిరాధారమైన, అర్థంపర్థంలేని ఆరోపణలని బీజేపీ నేత అరుణ్ జైట్లీ ట్వీట్ చేశారు. ప్రత్యామ్నాయం అందిస్తామని ఆప్ చెప్పిన మాటలు అసత్యాలని పేర్కొన్నారు. ఆప్ ఆరోపణలు నిరాధారమని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విజయ్ గోయల్ చెప్పారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలనుకుంటే బీజేపీ పార్టీలను విభజించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండేదని ఆయన అన్నారు. ఆప్ నేతల సర్టిఫికెట్ అమకు అవసరం లేదని, ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే డిసెంబర్ ఎనిమిది నాడే ఆ పనిచేసి ఉండేవాళ్లమన్నారు.
Advertisement
Advertisement