కర్ణాటక ప్రభుత్వంపై నరేంద్రమోడీ విమర్శ
= కన్నడలో ప్రసంగాన్ని ప్రారంభించిన ‘నమో’
= ఐటీ రంగంలో బెంగళూరు దేశానికే తలమానికం
= ‘నమో’ ప్రసంగంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం
సాక్షి, బెంగళూరు: గతంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ప్రజా సంక్షేమ పథకాలను, నిర్ణయాలను రద్దు చేయడమే లక్ష్యంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గోహత్యా నిషేధ బిల్లును పక్కన పెట్టడమే ఇందుకు తార్కాణమని పేర్కొన్నారు. ఇదంతా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో న గరంలోని ప్యాలెస్ గ్రౌండ్‌లో ‘భారత గెల్లిసి’(భారత్‌ను గెలిపించండి) పేరిట ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో నరేంద్రమోడీ పాల్గొన్నారు.
నరేంద్రమోడీ తన ప్రసంగాన్ని ‘నిమగెల్లా నన్న నమస్కారగళు (మీకందరికీ నా నమస్కారాలు)’ అంటూ కన్నడలో ప్రారంభించారు. మోడి కన్నడలో మాట్లాడగానే సభా ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగిపోయింది. ఇక తన ప్రసంగం ప్రారంభంలోనే బెంగళూరు నగర నిర్మాత కెంపేగౌడ, కనకదాసు, బసవేశ్వర, కిత్తూరు రాణి చెన్నమ్మల పేర్లను మోడీ ప్రస్తావించారు. అంతేకాదు శనివారం భారత రత్నకు ఎంపికైన ప్రొఫెసర్ సి.ఎన్.రావు, క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌లకు నరేంద్రమోడీ తన శుభాకాంక్షలను తెలియజేశారు.
బెంగళూరు నగరం ఐటీ రంగంలో భారతదేశానికే తలమానికంగా నిలిచిందని ప్రశంసించారు. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఐటీ, పరిశోధనల రంగానికి ఎక్కువగా ప్రాముఖ్యాన్ని ఇచ్చిందని, అందుకే ఇప్పుడు ఇస్రో ‘మంగళయాన్’ వంటి గొప్ప మైలురాయిని చేరుకోగలిగిందని పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థ ఉందని అయితే ఇంజనీర్స్, టెక్నికల్ విభాగాల్లో ఉద్యోగుల కొరత కారణంగా రైల్వేలు సామాన్య ప్రజలకు మెరుగైన సేవలను అందించలేక పోతున్నాయని పేర్కొన్నారు.
భారతదేశంలోని నాలుగు ముఖ్య ప్రాంతాల్లో నాలుగు యూనివర్సిటీలను రైల్వేల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసి ఇందులో రైల్వేలకు అవసరమైన ఇంజనీరింగ్, టెక్నికల్ విభాగాల్లో యువతకు శిక్షణ ఇస్తే నిరుద్యోగాన్ని పారదోలడంతో పాటు రైల్వేల పనితీరును కూడా మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. అయితే రైల్వేలను కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా మార్చుకుంటోందని, ఏ ప్రాంతంలో ఎన్నికలు జరుగుతుంటే ఆ ప్రాంతం వారికి రైల్వేలైన్లను, రైల్వే కోచ్‌ల తయారీ కర్మాగారాలను ఏర్పాటు చేస్తామని చెప్పి ఓట్లను దండుకుంటోందని మోడీ విమర్శించారు.
ఇక ‘పింక్ రెవల్యూషన్’ పేరిట కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘మీట్ ఎక్స్‌పోర్ట్’పై న రేంద్రమోడీ విరుచుకుపడ్డారు. దేశ సంపదను పూర్తిగా తుడిచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ తరహా విధానాలను అనుసరిస్తోందని ధ్వజమెత్తారు. మాంసం దుకాణాలకు సబ్సిడీలు, ఇన్సెంటివ్‌లు ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం ఐటీ రంగానికి ఎందుకు ప్రోత్సాహకాలు ఇవ్వలేకపోతోందని మోడీ ప్రశ్నించారు. రోజుకు రూ.26 సంపాదించే వారు పేదవారు కాదని కేంద్ర ప్రభుత్వం అంటోందని, ఇది పూర్తిగా పేదవారిని అవమానించడమే అవుతుందన్నారు. ప్రస్తుతం రూ.26కి 300గ్రాముల ఉల్లిపాయలు కూడా రావని, మరి ఒక కుటుంబం మొత్తం కడుపునిండా ఎలా భోజనం చేయగలుగుతుందని ప్రశ్నించారు. భారతదేశాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో నడపగల సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు.
పొగతో భయాందోళనలు... : ఆదివారం జరిగిన ‘భారత గెల్లిసి’ సభలో పొగ కనిపించడంతో సభికుల్లో భయాందోళనలు చెలరేగాయి. ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసిన ‘భారత గెల్లిసి’ సభా వేదిక పైకి నరేంద్రమోడీ చేరుకొని కూర్చోగానే వేదిక ఎడమవైపు ఉన్న గోడ పక్క నుంచి నల్లని పొగ రావడం కనిపించింది. ఆ పొగ ఏమిటోనని, అసలు అక్కడ ఏం జరిగిందని సభికుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. అయితే ఆ పొగ అక్కడున్న జనరేటర్‌ను ఆన్ చేయడం వల్ల వచ్చింది మాత్రమేనని తెలియడంతో సభికులు ఊపిరి పీల్చుకున్నారు.
సభా స్థలి మొత్తం ‘నమో జపం’... : ఇక మోడీ ప్రసంగానికి సభకు హాజరైన వారి నుంచి విశేష స్పందన లభించింది. సభా ప్రాంగణంలో నరేంద్రమోడీ హెలికాఫ్టర్ ల్యాండ్ కాగానే సభలోని కార్యకర్తలందరూ ‘మోడీ మోడీ’అంటూ నినాదాలు చేశారు. ఇక నరేంద్రమోడీ సభ ప్రవేశ రుసుముగా రూ.10 వసూలు చేసిన విషయం తెలిసిందే. ప్రవేశ రుసుముగా వసూలు చేసిన ధనం రూ.35 లక్షల నగదును ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ రాష్ట్రీయ ఏకతా ట్రస్ట్’కు అందజేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జోషి వెల్లడించారు.
బీజేపీ పథకాలను రద్దు చేయడమేకాంగ్రెస్ లక్ష్యం
Published Mon, Nov 18 2013 1:46 AM | Last Updated on Wed, Aug 15 2018 6:22 PM
Advertisement
Advertisement