ఆగి... అడుగేద్దామా?
Published Sun, Feb 16 2014 11:03 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీని అపఖ్యాతిపాలుచేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని కమలనాథులు భావిస్తున్నారా? ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు రావడం భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదా? లోక్‌సభ ఎన్నికల తర్వాతే ప్రభుత్వ ఏర్పాటు కోసం పావులు కదిపే అవకాశముందా? రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు సిద్ధమని బీజేపీ ప్రకటించినప్పటికీ ఆపార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో అసెంబ్లీని రద్దు చేయకుండా సుప్తచేతనావస్థలో ఉంచాలని లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఇందుకు కారణం బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నికలకు సుముఖంగా లేకపోవడమేనంటున్నారు. అసెంబ్లీని రద్దు చేసినట్లయితే లోక్‌సభ ఎన్నికలతోపాటు ఢిల్లీ విధానసభకు కూడా ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చేది. కానీ అసెంబ్లీని సస్పెన్షన్‌లో ఉంచడం వల్ల ఎన్నికల ముప్పు తప్పిందనే ఆనందంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. ఇంత త్వరగా విధానసభ ఎన్నికలను ఎదుర్కోవడం బీజేపీకి ఇష్టం లేదనే విషయాన్ని డాక్టర్ హర్షవర్ధన్ స్వయంగా అంగీకరించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని తమ ఎమ్మెల్యేలు ఎవరూ అధిష్టానాన్ని కోరలేదని, అయితే మళ్లీ ఎన్నికలకు వెళ్లడానికి మాత్రం తమ ఎమ్మెల్యేలు సుముఖంగా లేరని చెప్పారు. అందువల్ల అసెంబ్లీని రద్దు చేయకుండా సుప్తచేతనావస్థలో ఉంచాలన్న లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయం పట్ల బీజేపీ హర్షం వ్యక్తం చేస్తోంది.
అసెంబ్లీని సస్పెన్షన్‌లో ఉంచి, రాష్ట్రపతి పాలనను విధిస్తే... అటువంటి సమయంలో ఏదైనా పార్టీ తనకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన సంఖ్యా బలం ఉందని చె బుతూ ప్రభుత్వం ఏర్పాటుకు ముందకు వచ్చినట్లయితే లెఫ్టినెంట్ గవర్నర్ ఆ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాన్ని కల్పించవచ్చు. సరిగ్గా ఈ పరిస్థితి కోసమే బీజేపీ ఎదురుచూస్తోంది. ఇప్పుడే ప్రభుత్వ ఏర్పాటు కోసం ముందుకెళ్తే... పార్టీలను చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిందన్న అపఖ్యాతి లోక్‌సభ ఎన్నికలకు ముందు మూటగట్టుకున్నట్లవుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అందుకే లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తరువాత ప్రభుత్వం ఏర్పాటుకు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా పావులు కదుపవచ్చనే అభిప్రాయంలో ఉన్నట్లు తెలిసింది. అప్పటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనభ్యుల్లో కొంతమంది సొంత పార్టీ పట్ల అసంతృప్తి చెంది తమతో చేతులు కలపవచ్చనే అభిప్రాయంలో బీజేపీ ఉందంటున్నారు. ఇదే జరిగితే లోక్‌సభ ఎన్నికల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమంటున్నారు.
Advertisement