కేసీఆర్ పై హక్కుల ఉల్లంఘన నోటీసు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. సింగరేణి విషయంలో సీఎం కేసీఆర్ శాసనసభను పక్కదారి పట్టించారని పేర్కొంటూ బీజేపీ నేతలు ఈ నోటీస్ ను ఇచ్చారు . జనవరి 5 న కేసీఆర్ అసెంబ్లీ లో మాట్లాడుతూ సింగరేణిలో కాంట్రాక్టు ఉద్యోగులు లేరని అవాస్తవాలు చెప్పినట్టు ఆ నోటీసులో పేర్కొన్నారు.
అనంతరం బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. దాదాపు 26 వేల మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఉన్నారన్నారు. ఓపెన్ మైన్, అండర్ గ్రౌండ్ మైన్స్ తో పాటు అన్నింటిలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ సభను, ప్రజలను తప్పు దారి పట్టించి కార్మికుల నోట్లో మట్టి కోడుతున్నారని మండిపడ్డారు. కార్మికులను మోసం చేస్తే సింగరేణి బంగారు గని ఎలా అవుతుంది.. బంగారు తెలంగాణ ఎలా అవుతుందని ప్రశ్నించారు. సభను తప్పుదారి పట్టించిన సీఎంపై చర్యలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్టు కార్మికులకు రావాల్సిన రూ. 500 కోట్లను సింగరేణి యాజమాన్యం తొక్కిపెట్టిందన్నారు. కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయకపోవడంతో వాళ్ళు వాళ్ళ హక్కులు కోల్పోతున్నారన్నారు. 4 రోజుల పాటు సింగరేణి యాత్ర చేసి అనంతరం సీఎం కేసీఆర్‌కు కూడా నివేదికను ఇస్తామని తెలిపారు. ఈ నోటీసుపై కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్, ఎస్ కుమార్ తదితరులు సంతకాలు చేశారు.