గెలిచేది మేమే
Published Fri, Nov 29 2013 12:48 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
న్యూఢిల్లీ: వచ్చే నెల నాలుగో తేదీన జరగనున్న శాసనసభ ఎన్నికల్లో మెజారిటీ సాధించి, అధికారంలోకి వస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆ పార్టీ ఢిల్లీ ఎన్నికల ఇన్‌చార్జి నితిన్ గడ్కరీ ఆరోపించారు. తన నివాసంలో గురువారం ఉదయంఆయన రవాణా విభాగానికి చెందిన సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తమ పార్టీకి అండగా నిలవాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ. ‘కేవలం గెలుపొందడమే కాదు. మూడింట రెండొంతుల మెజారిటీ సాధిస్తామనే నమ్మకం నాకుంది. కాంగ్రెస్ విధానాలతో ప్రజలు విసిగిపోయారు.
అందువల్లనే వారు మార్పు కోరుకుంటున్నారు. తమ పార్టీ మేనిఫెస్టోలో అనేక సంస్కరణలను ప్రకటించాం. అయితే అన్ని సమస్యలు ఏకకాలంలో పరిష్కారమవుతాయని మేము అనడం లేదు. ఒకదాని వెంట మరొకటిగా పరిష్కరిస్తాం. అయితే నాలుగురెట్ల మేర ఉత్తమ ప్రభుత్వాన్ని అందిస్తామని మాత్రం హామీ ఇవ్వగలను’ అని అన్నారు. కాగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా తమ పార్టీ తరఫున బరిలోకి దిగిన హర్షవర్ధన్‌కు క్లీన్ ఇమేజ్ ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాడన్నారు.
కాంగ్రెస్‌కు ఆ ఆలోచనే లేదు
ఆర్థిక రంగంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని గడ్కరీ ఆరోపించారు. దేశాన్ని స్వయంసమృద్ధి దిశగా నడిపించాలనే ఆలోచన అధికార కాంగ్రెస్ పార్టీకి ఎంతమాత్రం లేదన్నారు. ఆ కారణంగానే ఆరు లక్షల కోట్ల రూపాయల విలువైన గ్యాస్, పెట్రోల్, ముడిచమురును విదేశాలనుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రూ. 32 సంపాదించేవారెవరూ నిరుపేదలు కాదంటూ దేశప్రజలపై కాంగ్రెస్ పార్టీ మడ్డి జోకు విసిరిందన్నారు. అంతేకాకుండా ప్రతిరోజూ రూ. 28 సంపాదిస్తే సాధారణ జీవితం గడిపేయొచ్చని చెబుతోందన్నారు.
ఓట్లు చీల్చే పార్టీయే
కొత్తగా ఎన్నికల బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గురించి మాట్లాడుతూ అది కేవలం ఓట్లు చీల్చే పార్టీ మాత్రమేనన్నారు. స్టింగ్ ఆపరేషన్ నకిలీదని ఆ పార్టీ అంటోందని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అవిననీతిమయమైపోయారని ఆరోపిస్తోందన్నారు. అయితే తాము ఎవరికి టికెట్లు ఇవ్వలేదో వారికే ఆ పార్టీ ఇస్తోందన్నారు. ఓట్లు చీల్చే ఆ పార్టీకి అనవసరంగా ఓటు వేసి వృథా చేసుకోవద్దని ఆయన నగరవాసులకు సూచించారు.
Advertisement