మహిళల భద్రతకు పెద్దపీట
Published Mon, Nov 25 2013 2:17 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పాలనలో రేప్‌ల రాజధానిగా మారిన ఢిల్లీని అధికారంలోకి రాగానే సురక్షిత నగరంగా మారుస్తామని ఢిల్లీ బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి నితిన్ గడ్కరీ హామీని ఇచ్చారు. మీరు వేసే ఓటుతో నగర రూపురేఖలే మారిపోతాయని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలో రోజురోజుకు మహిళలపై పెరుగుతున్న నేరాలపై ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ఓటేసి గెలిపిస్తే మహిళల భద్రత కోసం ఉమెన్ కమాండ్ ఫోర్స్‌ను, కేసుల విచారణ త్వరితగతిన జరిగేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేస్తామని హామీని ఇచ్చారు. వివిధ రంగాల్లో పక్కా ప్రణాళికతో నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ‘షీలా సర్కార్‌పై ప్రభుత్వ వ్యతిరేకత ఉంది.
1998లో తాము అధికారానికి దూరం కావడానికి కారణమైన ఉల్లిగడ్డ ధరల పెరుగుదల ఈసారి కాంగ్రెస్ సర్కార్‌కు తగులుతుంద’ని తెలిపారు. అయితే ఎన్నికల్లో తొలిసారిగా పోటీచేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ తమ అవకాశాలపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు. తమ పార్టీ టికెట్లివ్వని అభ్యర్థులకు కేజ్రీవాల్ పార్టీ ఆదరించిందని తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్‌తో ఏఏపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందన్నారు. అందుకే వివిధ మార్గాల్లో ఆ పార్టీకి కాంగ్రెస్ సహకరిస్తుందని తెలిపారు. కల్లబొల్లి కబుర్లతో ప్రజల ముందు మేనిఫెస్టోను ఉంచిన కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. నిత్యావసర సరుకుల ధరలపై ఇప్పటికే కాంగ్రెస్‌పై గుర్రుగా ఉన్న ప్రజలు వారికి మరోసారి పట్టం కట్టేందుకు సిద్ధంగా లేరని తెలిపారు. అధికారంలోకి రాలేని ఏఏపీ మేనిఫెస్టో వల్ల ప్రయోజనం లేదన్నారు.
టికెట్ల పంపిణీలో బీజేపీలో అసంతృప్తి ఉన్న మాట నిజమే అయినా ఇప్పుడు సద్దుమణిగిందని తెలిపారు. మొదటగా తీవ్ర అగ్రహం వ్యక్తం చేసిన నాయకులు ఆ తర్వాత గాడిలోకి వచ్చారన్నారు. 70 అసెంబ్లీ నియోజకవర్గాల కోసం 1,500 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో అందరిని సంతృప్తి పరచడం సాధ్యమయ్యే పనికాదని చెప్పారు. కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కో సీటుకు ముగ్గురు మంచివాళ్లు ఉన్నారని, అభ్యర్థులను ఖరారు చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. టికెట్ల పంపిణీ నిష్పక్షపాతం జరిగిందని, డబ్బులకు అమ్మారన్న ఆరోపణలు ఏమీ రాలేదని చెప్పారు. హరినగర్ ఎమ్మెల్యే హర్‌శరణ్ సింగ్ బల్లీకి తాము టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ ఆదరించిందన్నారు. గత ఎన్నికల్లో ఒకరికే అవకాశమిచ్చిన తాము ఈసారి ఐదుగురు పూర్వాంచీయులకు అవకాశమిచ్చామని తెలిపారు. భోజ్‌పురి గాయకుడు, నటుడు మనోజ్ తివారీని కూడా పార్టీలో చేర్చుకున్నామన్నారు. తాము అధికారంలోకి వస్తే యమునా నదిలోని వ్యర్ధాలను తొలగించేందుకు భారీ ప్రణాళికలున్నాయని గడ్కరీ తెలిపారు. పరిశ్రమలు, విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఈ నదిలోని నీటిని రీస్లైకింగ్ చేస్తామన్నారు. కరెంట్‌ను ఉత్పత్తి చేసేందుకు బహిరంగ ప్రాంతాల్లో సోలార్ ప్యానెల్‌లను ఏర్పాటుచేస్తామని హామీని ఇచ్చారు.
Advertisement
Advertisement