గెలుపుమాదే: బీజేపీ ధీమా!
Published Mon, Dec 2 2013 11:55 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ: మోడీ నిర్వహించిన ప్రచారం, స్థానిక కార్యకర్తల కష్టం ఫలించి ఢిల్లీలో కమలం వికసించబోతోందంటూ ఆ పార్టీ నేతలు సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్‌గోయల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో విసిగిపోయిన ఢిల్లీవాసులు మార్పు కోరుకుంటున్నారన్నారు. ఈమారు విధానసభ ఎన్నికల్లో ప్రజాతీర్పు తమకు అనుకూలంగా వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ఢిల్లీలో నిర్వహించిన ప్రచార సభలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడంతోపాటు ఢిల్లీవాసులకు భ రోసా కల్పించిందన్నారు. మోడీ సభలకు జనం పోటెత్తగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ,
ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ నిర్వహించిన సభలు వెలవెలబోయాని, డిసెంబర్ ఎనిమిది ఫలితాలకు ఇవే ఉదాహరణలు అన్నారు. బీజేపీ నగరశాఖ ఆధ్వర్యంలో పక్కా వ్యూహం ప్రకారం ఎనిమిది నెలల క్రితమే పార్టీ ప్రచారాన్ని ప్రారంభించామన్నారు. విద్యుత్, మంచినీరు, మహిళల భద్రతతోసహా అన్ని అంశాలపై స్పష్టమైన హామీ ఇవ్వడంతోపాటు బీజేపీ చేపట్టబోయే కార్యక్రమాలను ఢిల్లీవాసులకు చెప్పగలిగామన్నారు. ‘ఘర్ ఘర్ బీజేపీ’ కార్యక్రమంతో ఢిల్లీలోని ప్రతి ఇంటికి బీజేపీ ప్రచారం చేరుకోవడం సత్ఫలితాలిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. 11,763 పోలింగ్ బూత్‌లకు సంబంధిచిన ప్రతి బూత్‌కి 30 సభ్యుల బృందాల ఏర్పాటు, 280 కార్యకర్త సమ్మేళనాలు, నిర్వహించినట్టు తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ వ్యతిరేకతపై పలు రిపోర్టులు విడుదల చేశామని గోయల్ గుర్తుచేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, పార్టీ జాతీయ నాయకులు ఎల్‌కే అద్వానీ, నరేంద్రమోడీ, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, నితిన్‌గడ్కారీ సైతం నగరంలో ఏర్పాటు చేసిన పలు బహిరంగసభల్లో పాల్గొన్నారని గుర్తుచేశారు.
Advertisement