మహిళ లేని కేబినెట్‌తో సాధికారతా?
సీపీఎం బహిరంగసభలో బీవీ రాఘవులు
ఖమ్మం: మహిళలేని కేబినెట్‌తో మహిళా సాధికారత ఎలా సాధ్యమవుతుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు విమర్శించారు. మహాజన పాదయాత్రలో భాగంగా శుక్రవారం ఖమ్మం బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఏపీలోని అమరావతిలో నిర్వహించిన జాతీయ పార్లమెంట్‌లో పాల్గొన్న కేసీఆర్ కుమార్తె కవిత మహిళా సాధికారత గురించి ప్రసంగించారని, తన తండ్రి కేబినెట్‌లో మహిళను ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. సీపీఎం గతం లో చేసిన పోరాటాల ఫలితంగానే గత, ఇప్పటి పాలకులు ప్రాజెక్టులు పూర్తి చేశా రనే విషయాన్ని మంత్రి హరీశ్‌రావు తెలుసుకోవాలన్నారు.
తెలంగాణ ఏర్పాటై నప్పుడు రాష్ట్ర అప్పులు కేవలం రూ.60 వేల కోట్లు ఉంటే, ఇప్పుడు అవి రూ.1.20 లక్షల కోట్లకు చేరుకున్నాయన్నారు. వీటితో సామాజిక తెలంగాణ ఏర్పాటుకు ఎంత ఖర్చు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఉద్యోగాల భర్తీ చేయ మని అడుగుతున్న కోదండరాంపై విమర్శలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాగా, అధికారంలోకి వస్తే దేవుడికి ఇస్తానన్న మొక్కులను తీర్చేందుకు కేసీఆర్ సిద్ధమయ్యాడని, అదే విధంగా అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.