
వాళ్లిద్దరూ వచ్చినా భయంలేదు: విజయ్‌కాంత్
పెరంబూరు(తమిళనాడు): రజనీకాంత్, కమల్‌హాసన్ రాజకీయాల్లోకొచ్చినా తమకేం భయం లేదని డీఎండీకే అధ్యక్షుడు, నటుడు ‘కెప్టెన్’ విజయ్‌కాంత్ అన్నారు. కమల్‌హాసన్ ఒక్కరే ధైర్యంగా రాష్ట్ర నాయకుల గురించి వాస్తవాలు మాట్లాడుతున్నారని మెచ్చుకున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం చేయాలని ఆయన అభిమానులు ఆశిస్తుండటంతోపాటు, ఆయనపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల అన్నాడీఎంకే నేతల అవినీతిపై కమల్‌హాసన్ విమర్శనాస్త్రాలను సంధించారు.
దీంతో తమిళనాడు భవిష్యత్ రాజకీయాలు ఎటువైపు దారి తీస్తాయోనన్న ఆసక్తి నెలకొంది. పుదుగై జిల్లా నెడువాసల్ గ్రామ ప్రజలు తమ ప్రాంతంలో హైడ్రో కార్బన్ పథకాన్ని అమలు చేయరాదంటూ గత ఏప్రిల్ 12వ తేదీ నుంచి పోరాటం చేస్తున్నారు. వారికి మద్దతు తెలపడానికి ఆదివారం డీఎండీ నేత విజయ్‌కాంత్, ఆయన సతీమణి ప్రేమలత ఆ గ్రామానికి వెళ్లారు.
ఈ సందర్భంగా విజయకాంత్ మాట్లాడుతూ హైడ్రో కార్బన్ పథకాన్ని అమలు పరచడానికి అధికారులతో మంత్రులు గ్రామంలోకి అడుగు పెడితే ప్రాణాలొడ్డి అయినా వారిని అడ్డుకుంటామని అన్నారు. సోమవారం ఆ గ్రామంలో హైడ్రో కార్బన్ పథకాన్ని ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలించిన విజయకాంత్ ఈ పధకాన్ని నిలిపి వేసేలా అవసరం అయితే రాష్ట్ర, కేంద్ర మంత్రులను కలిసి వారిపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా రజనీకాంత్, కమల్‌హాసన్ రాజకీయాలను ప్రస్తావిస్తూ, వారు రాజకీయల్లోకి వచ్చినా తమకు భయం లేదని వ్యాఖ్యానించారు.