తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. ఒక్క రోజు నిరీక్షిస్తే సహజ ప్రసవమవుతుంది. అలా అయితే తమ జేబులు ఎలా నిండుతాయి? బిడ్డ అడ్డం తిరిగే ప్రమాదం ఉంది, వెంటనే సిజేరియన్ చేయాల్సిందే. ఆలస్యం చేస్తే తల్లీబిడ్డుకు ముప్పు. మీరు ఆలోచించుకుని చెబుతామంటే కుదరదు, ఆపరేషన్ థియేటర్లో అన్నీ సిద్ధం. ...ఇదీ బెంగళూరులో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యుల హడావుడి. ఎలాగైనా సిజేరియన్ ప్రసవం చేయాలి, ఫీజులు వసూలు చేయాలి అనే ధోరణితో పాటు ప్రజల ఆలోచనల్లో వస్తున్న మార్పుల వల్ల కూడా కోత ప్రసవాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి.
బెంగళూరు (యశవంతపుర): కోత ప్రసవాలు (సిజేరియన్ కాన్పులు) గత 10 ఏళ్ల నుంచి క్రమక్రమంగా పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. బెంగళూరుతో పాటు రాష్ట్రంలోనూ సాధారణ ప్రసవాల స్థానాన్ని సిజేరియన్లు ఆక్రమిస్తున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సమీక్ష–4లో ఈ చేదు వాస్తవం వెల్లడైంది. కాసుల కక్కుర్తితో ప్రైవేట్ ఆస్పత్రులు అవసరం లేకపోయినా కోత ప్రసవాలు చేసి లక్షల రూపాయలు గుంజుతున్నాయన్న ఆరోపణలకు బలం చేకూరింది.
కోత ప్రసవాలదే జోరు
♦ సమీక్ష తెలిపిన మేరకు.. రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్లు 8 శాతం పెరిగాయి. 2005–2006లో ప్రతి వంద కాన్పుల్లో 31.9 శాతం ఉన్న సిజేరియన్లు 2015–2016లో నాటికి గణనీయంగా పెరిగి 40.3 శాతానికి చేరాయి.
♦ పదేళ్లతో పోల్చితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్లు 0.3 శాతం తగ్గాయి. నగరంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 21 శాతం, గ్రామీణ సార్వజనిక ఆస్పత్రుల్లో 14.8 శాతం సిజేరియన్ల కాన్పులే నమోదవుతున్నాయి.
♦ బెంగళూరులోని ప్రైవేట్ ఆస్పత్రులలో ప్రతి వంద కాన్పుల్లో 50–60 శాతం సిజేరియన్లే. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం సిజేరియన్ ప్రసవాలు 10–15 శాతం మించరాదు. తల్లీబిడ్డ ప్రాణాలకు ముప్పున్న సమయంలో మాత్రమే సిజేరియన్‌ను ఎంచుకోవాలని ఆరోగ్య సంస్థ నిర్దేశిస్తోంది.
♦ రాష్ట్రంలో 2005–2006లో 15.5 శాతం ఉన్న సిజేరియన్లు 2016 వచ్చేసరికి 26.2 శాతం నమోదైయింది. నగర ఆస్పత్రులలో 29.2 శాతం సిజేరియన్ ద్వారానే శిశువులు జన్మిస్తున్నారు.
ఎప్పుడు అవసరం అంటే...
‘శిశువు పెద్దిగా, తూకం ఎక్కువగా ఉండటం వల్ల సహజ ప్రసవం కాదు. గర్భంలో శిశువు తలకిందులుగా ఉండటం వల్ల శస్త్రచికిత్స తప్పనిసరి అవుతుంది. ఇక గర్భిణి మరీ బలహీనంగా ఉండడం, ఉమ్మనీరు పోవడం, సహజ ప్రసవాన్ని భరించే పరిస్థితి లేకపోవడం, తీవ్రమైన రక్తహీనత వల్ల అశక్తత తదితర సమయాల్లో సిజేరియన్లు అవసరం. తల్లీబిడ్డ పరిస్థితి డోలాయమానంగా ఉన్నప్పుడు కూడా సిజేరియన్ తప్పనిసరి అవుతుంది. అయితే ఈ పరిస్థితి లేకపోయినప్పటికీ అనేక ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్‌హోంలలో సిజేరియన్ ప్రసవాలు చేసి రూ.70–80 వేల వరకు బిల్లు చేతిలో పెడుతున్నారు’ అని ఒక గైనకాలజిస్టు చెప్పారు.
నొప్పుల సమస్యకు పరిష్కారంగానూ..
నేటి మహిళల్లో ఎక్కువమంది కాన్పు నొప్పులను తట్టుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తల్లిదండ్రులు, భర్త సిజేరియన్ చేయాలని కోరుతున్నారని కొందరు ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కొందరు సహజ ప్రసవం వరకు ఆగకుండా కోత ప్రసవం ద్వారా వెంటనే సంతానాన్ని చూడాలనుకుంటున్నారని బెంగళూరుకు చెందిన ప్రముఖ ప్రసవ వైద్యురాలు డాక్టర్ శాంత తెలిపారు.
అడిగి మరీ సిజేరియన్
సిజేరియన్ పద్ధతిని మధ్య, సంపన్న కుటుంబాలవారు నిస్సంకోచంగా ఎంచుకుంటున్నారు. ఫలానా రోజున ప్రసవం జరగవచ్చని వైద్యులు లేక్కతేల్చుతారు. అయితే ఆరోజున విదేశీ ప్రయాణం ఉందనో, అత్యవసర పని ఉందనో, లేక అమావాస్య, మంచిరోజు కాదు.. తదితర కారణాలతో నచ్చిన రోజు సిజేరియన్ ప్రసవానికి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనైతే.. మీ అమ్మాయి ప్రసవవేదనను భరించే స్థితిలో లేదు అని వైద్యులే ఒత్తిడి చేసి కోత ప్రసవంతో బిడ్డను తీస్తున్నారు. గ్రామీణ గర్భిణీల్లో సహజ ప్రసవాలే అధికం కావడం గమనార్హం. శారీరక కష్టం చేయడంతో పాటు ఇప్పుడు పోషకాహారం లభించడం తదితరాల వల్ల వారికి సిజేరియన్ల బెడద నగరవాసులతో పోలిస్తే తక్కువేనని ఆరోగ్య సర్వే తేల్చింది.
♦ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది: సిజేరియన్లు 10–15 శాతం మించరాదు.
♦ ఏం జరుగుతోంది: ప్రస్తుతం సిజేరియన్ కాన్పులు 40 శాతానికి చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment