జనతా దర్బార్కు భారీగా జనం.. మధ్యలోనే వెళ్లిన కేజ్రీవాల్
ఢిల్లీ సచివాలయం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన జనతా దర్బార్లో గందరగోళం నెలకొంది. దీంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యలోనే వెళ్లిపోవాల్సి వచ్చింది. వేలాది మంది ప్రజలు తమ కష్టాలు చెప్పుకోడానికి వచ్చారు. అక్కడకు ముఖ్యమంత్రితో పాటు మొత్తం మంత్రులంతా వచ్చారు. బ్యారికేడ్లు కూడా పడగొట్టి మరీ జనం తోసుకురావడంతో వారిని నియంత్రించడం ఢిల్లీ పోలీసులకు, సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ) దళానికి కష్టమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో కేజ్రీవాల్ సగంలోనే కార్యక్రమం వదిలి వెళ్లిపోయారు.
అంతమంది ప్రజలు వస్తారని ఊహించలేకపోయామని, అందుకే వారిని నియంత్రించడం కష్టమైందని, తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని పోలీసులు చెప్పడం వల్లే అక్కడినుంచి వెళ్లానని తర్వాత కేజ్రీవాల్ విలేకరులకు తెలిపారు. దాదాపు 50 వేల మంది ప్రజలు అక్కడికొచ్చినట్లు పోలీసులు చెప్పారు. వారిలో ఎక్కువ మంది డీటీసీ, బీఎస్ఈఎస్, వివిధ ప్రభుత్వాస్పత్రులు, మునిసిపాలిటీల్లాంటి శాఖల్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులే ఉన్నారు. తన ఫ్లాటును కొంతమంది ఆక్రమించుకున్నారని సునీతా కపూర్ అనే మహిళ చెప్పారు. ఆమె ఉదయం ఆరు గంటలకే అక్కడకు చేరుకున్నారు. ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరించేవరకు తాను విశ్రమించేది లేదని కేజ్రీవాల్ ఈ సందర్భంగా చెప్పారు.