మెట్రో రైలు పనులకు మరో మూడు వేల కోట్లు అనివార్యమైంది. తిరువొత్తియూరు వరకు విస్తరించడంతో అదనపు నిధుల కోసం అంచనా వ్యయం సిద్ధమైంది. 9 కి.మీ. దూరం మేరకు పనులు చేపట్టనున్నారు. ఈ మార్గంలో 8 రైల్వే స్టేషన్లు ఏర్పాటు కాబోతున్నారుు. త్వరలో స్థల సేకరణకు రంగం సిద్ధమవుతోంది. మెట్రో పథకాన్ని తిరువొత్తియూరు వరకు పొడిగించడంతో ఆ పరిసర వాసుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.
సాక్షి, చెన్నై: రాజధాని నగరం చెన్నైలో ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించే విధంగా మెట్రో రైలు ప్రాజెక్టును రూ.15 వేల కోట్లతో శ్రీకారం చుట్టింది. చాకలిపేట నుంచి అన్నాసాలై వైపుగా జెమిని, సైదా పేట, గిండి మీదుగా మీనంబాక్కం వరకు ఓ మార్గం, సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి కోయంబేడు మీదుగా వడపళని, గిండిలను కలుపుతూ సెయింట్ థామస్ మౌంట్ వరకు మరో మార్గంలో మెట్రో రైలు సేవలకు నిర్ణయించారు. ఈ మార్గాల్లో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బ్రెజిల్‌లో రూపుదిద్దుకున్న మెట్రో రైలు బోగీలు చెన్నై చేరాయి. కోయంబేడు-ఆలందూరు మధ్య పనులు దాదాపుగా ముగింపు దశకు చేరాయి. ఈ మార్గంలో ట్రయల్ రన్ సాగుతోంది. ఇక స్టేషన్ల నిర్మాణం పూర్తి కాగానే, ఈ మార్గంలో సేవలకు కొత్త ఏడాదిలో శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, తొలి నాళ్లలో ఈ ప్రాజెక్టును ప్రకటించగానే, తిరువొత్తియూరు పరిసరాల్లో పెద్ద ఉద్యమం బయలుదేరింది.
చాకలిపేట నుంచి కాకుండా తిరువొత్తియూరు వరకు పొడిగించాలన్న డిమాండ్‌తో సాగిన ఈ ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. తిరువొత్తియూరులోని విమ్కోనగర్ వరకు ఈ ప్రాజెక్టును పొడిగించేందుకు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఆమోదముద్ర వేయడంతో తిరువొత్తియూరు పరిసరవాసులు ఆనందంలో మునిగారు. ఈ పరిస్థితుల్లో తాజాగా తిరువొత్తియూరు వరకు ప్రాజెక్టు పొడిగించడం ద్వారా అయ్యే అదనపు వ్యయంపై ఆ ప్రాజెక్టు అధికారులు నివేదిక సిద్ధం చేశారు. రైలుసేవల విస్తరణకు సంబంధించి స్థల సేకరణ లక్ష్యంగా ముందుకు సాగనున్నారు. 20వేల కోట్లకు చేరిన వ్యయం: మెట్రో రైలు ప్రాజెక్టుకు వ్యయం తొలుత 15 వేల కోట్లు అంచనా వేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రస్తుతం సుమారు ఇరవై వేల కోట్లకు సమీపించింది. తిరువొత్తియూరు విమ్కో నగర్ వరకు పొడిగించనుండడంతో అదనంగా మరో రూ.3వేల కోట్లు అనివార్యమైంది.
ఇందుకు సంబంధించిన అంచనా, ఆ మార్గం లో చేపట్టబోయే పనులకు సంబంధించిన అన్ని అంశాలతో నివేదిక రాష్ట్ర ప్రభుత్వం చెంతకు చేరింది. ఆ నివేదిక ఆధారంగా చాకలి పేట నుంచి తిరువొత్తియూరు విమ్కో నగర్‌కు 9 కి.మీ. దూరం మేరకు పనులు చేపట్టనున్నారు. 2.2కి.మీ భూగర్భ మార్గంలో, 6.8 కి.మీ. వంతెన మార్గం లో రైలు పయనించనుంది. కొరుక్కుపేటతో పాటు మరోచోట స్టేషన్లు భూగర్భ మార్గంలో ఏర్పాటు చేయనున్నారు. తండయార్ పేట, టోల్ గేట్, తాంగల్, గౌరిఆశ్రమం, తిరువొత్తియూరు, విమ్కోనగర్ స్టేషన్లు వంతెన మార్గం లో ఉంటాయి. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంతో కేంద్రానికి పంపనున్నారు. కేం ద్రం ఆమోదంతో స్థలసేకరణకు, వెనువెంటనే 9 కి.మీ. దూరం పనులకు శ్రీకారం చుట్టేందుకు మెట్రో ప్రాజెక్టు వర్గాలు కార్యాచరణను సిద్ధం చేశాయి.
మెట్రోకు రూ.3 వేల కోట్లు
Published Wed, Nov 19 2014 2:20 AM | Last Updated on Mon, Aug 20 2018 9:35 PM
Advertisement
Advertisement