► కూలిన చెట్ల మధ్య జన జీవనం
►సహాయ కార్యక్రమాలు ముమ్మరం
►రెండు నౌకల్లో ఆహారం
►మరో రెండు రోజులు వర్షాలు
►నేడు విద్యాసంస్థలకు సెలవు
వర్దా తుపాను తీవ్రతతో తమిళనాడు ప్రజలు తల్లడిల్లిపోయారు.కూలిపోయిన భారీ వృక్షాల మధ్య చిక్కుకుపోయారు. బైటకు వచ్చే వీలులేక ఇళ్లలోనే బందీలుగా మారిపోయారు. తినేందుకు అన్నం, తాగేందుకు నీళ్లు లేక తిప్పలు పడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: వర్దా తుపాను తమిళనాడులోని నాలుగు జిల్లాల ప్రజలను వణికించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 130–140 కిలో మీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులకు భయపడిపోయిన ప్రజలు సోమవారం రాత్రి వరకు ఎవ్వరూ ఇళ్ల నుంచి బైటకు రాలేదు. ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో రాత్రంతా ప్రజలు చిమ్మచీకట్లో గడిపారు. తెల్లారేసరికి సా«ధారణ పరిస్థితులు నెలకొని ఉంటాయని ఆశించిన ప్రజలు రోడ్లలోని పరిస్థితులను చూసి బిత్తరపోయారు. ఎటుచూసినా నేలకొరిగిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు. వాటికింద పడి నలిగిపోయిన కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు దర్శనమిచ్చాయి. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం తదితర జిల్లాల ప్రజలు వర్దా తుపానుతో విలవిల్లాడిపోయారు.
తుపానులో చిక్కుకున్న పది వేల మందిని సహాయక బృందాలు రక్షించాయి. చెన్నై పరిసరాల్లో సిటీ బస్సులు, ఆటో, లోకల్ రైళ్ల రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. తుపాను తీవ్రస్థాయికి చేరుకోవడంతో బస్సుల్లోని ప్రజలను మధ్యలోనే దించి వేశారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన ప్రజలు రాత్రంతా చీకట్లోనే గడిపి, తెల్లారిన తరువాత కిలోమీటర్ల దూరం నడిచి గమ్యాలకు చేరుకున్నారు. అనేక చోట్ల ఇళ్లు, వ్యాపార సంస్థల పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. చెన్నై ప్రజలు ఎంతగానో ఇష్టపడే అందమైన పనగల్ పార్కు అందవిహీనంగా మారిపోయింది. పూర్తిస్థాయిలో విద్యుత్ పునరుద్ధరణకు మూడు రోజులు పడుతుందని విద్యుత్‌శాఖా మంత్రి తంగమణి ప్రకటించారు. మంగళవారం సాయంత్రానికి నగరంలో పాక్షికంగా విద్యుత్ పునరుద్ధరణ చేశారు. తిరువొత్తియూరు, ఎన్నూరులలో సముద్రంలో కెరటాలు ఎగిసిపడుతున్నాయి. సోమవారం ఒక్కరోజునే చెన్నైలో 38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
కాంచీపురం పుదూరు వద్ద వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న 9 మందిని మంగళవారం సాయంత్రం స్థానిక గజ ఈతగాళ్లు రక్షించారు. చెంగల్పట్టు జిల్లాలో వెయ్యి ఇళ్లు నీటమునిగాయి.తుపాను తాకిడితో నిత్యావసర వస్తువుల ధరలు మరింత ప్రియంగా మారిపోయాయి. అరలీటర్ పాల పాకెట్టు ధర రూ.50 పలికింది. తుపాను బాధితుల సహాయార్థం రెండు నౌకల్లో ఆహార పదార్థాలు చెన్నైకి చేరుకున్నాయి.
మరో రెండు రోజులు వర్షాలు చెన్నై నగరాన్ని వణికించిన వర్దా తుపాను తీరం దాటి సోమవారం అర్ధరాత్రి కర్ణాటక వైపు పయనించినా రాష్ట్రంలో మరో రెండురోజులు వర్షాలు పడే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ డైరెక్టర్ బాలచంద్ర¯ŒS మంగళవారం తెలిపారు. చెన్నైతోపాటూ ఉత్తరాది జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఆయన అన్నారు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో విద్యాసంస్థలకు బుధవారం కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది.