సాక్షి, న్యూఢిల్లీ: ఛట్‌పూజ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ఏర్పాట్లు చేయాలని బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్టీ తరఫున చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. పూజకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలంటూ ఆయన సోమవారం లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జీ), మూడు మున్సిపాలిటీల మేయర్లకు ఉత్తరాలు రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఛట్‌పూజ నాడు సెలవు ప్రకటిస్తామని వెల్లడించారు. లక్షల మంది భక్తులు పాల్గొనే ఛట్‌పూజకు ఢిల్లీ ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేస్తున్న ధాఖలాలు కనపడడం లేదని ఎల్‌జీకి పంపిన ఉత్తరంలో పేర్కొన్నారు. పండుగ ఏర్పాట్లలో భాగస్వాములు కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘గణేశ్ చతుర్థి సందర్భంగా ఢిల్లీలో ఎన్నో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి.
ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఎంతోమంది యువకులు యమునానదిలో ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది పాల్గొనే ఈ పండుగ సందర్భంగా అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి’ అని అన్నారు. స్నానాల ఘాట్ల వద్ద భద్రతాచర్యలు, సరిపడా పోలీసులు, గజ ఈతగాళ్లు, అంబులెన్స్‌లు, రవాణా సదుపాయాల కల్పన, ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవడం, మహిళల భద్రతకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం సహా పలు అంశాలను లేఖలో ప్రస్తావించినట్టు పేర్కొన్నారు. వలంటీర్లుగా ఆయా ప్రాంతాల్లో అవసరమైన సేవలందించాలని బీజేపీ కార్యకర్తలకు గోయల్ సూచించారు.
ఛట్‌పూజ సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై పార్టీ ముఖ్య నాయకులతో స్థానిక పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఏటా ఎదుర్కొంటున్న ఎన్నో ఇబ్బందులను పలువురు ప్రతినిధుల ముందుంచారు. వీటన్నిం టికీ పరిష్కారం కనుగొనేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ కొన్ని ప్రతిపాదనలను ఎల్‌జీకి పంపిన ఉత్తరంలో ఆయన పొందుపర్చారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లకు సైతం గోయల్ కొన్ని సూచనలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా వీలైనన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.
ఛట్ పూజకు ఏర్పాట్లు చేయండి
Published Tue, Nov 5 2013 1:09 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement