
వృద్ధురాలిని కలెక్టర్ వద్దకు మోసుకెళుతున్న సామాజిక కార్యకర్త
సాక్షి ప్రతినిధి, చెన్నై: కన్నతల్లి రుణం తీర్చుకోవాలనే విచక్షణ ఆ సంతానానికి లేకుండా పోయింది. కనికరం లేని 13 మంది సంతానం వల్ల ఆ తల్లి అనాథగా మారింది. భిక్షాటన చేస్తూ బతుకీడుస్తున్న క్రమంలో కాలు విరిగడంతో అనాథ శరణాలయంలో చేరిపోయింది. తమిళనాడుకి చెందిన 95 ఏళ్ల వృద్ధురాలి దీనగాథ ఇది. దిండుగల్లు జిల్లా కొడైక్కెనాల్‌కు చెందిన అంతోనియమ్మాళ్ (95) ఇరవై ఏళ్ల కిందట భర్త దేవరాజ్ వేధింపులు తట్టుకోలేక వేలూరు జిల్లా కాట్పాడిలోని తన కుమార్తె జయ్‌సీరాణి ఇంటికి వచ్చింది. అల్లుడు నందకుమార్ కూడా బాగా చూసుకోవడంతో కుమార్తె వద్దే స్థిరపడిపోయింది. ఐదేళ్ల క్రితం నందకుమార్ చనిపోవడంతో కుమార్తె జయ్‌సీరాణి తల్లిని వదిలించుకుంది. దీంతో అంతోనియమ్మాళ్ ఐదేళ్లుగా వేలూరులోని ఓ చర్చి వద్ద భిక్షాటన చేస్తూ కాలం గడిపేది.
భిక్షాటనతో వచ్చిన సొమ్మును కుమార్తె తీసుకెళ్లేది. ఈ స్థితిలో ఈ వృద్ధురాలు వారం రోజుల కిందట కిందపడడంతో కుడికాలి ఎముక విరిగింది. విషయం తెలుసుకున్న మణిమారన్ అనే సామాజిక కార్యకర్త వృద్ధురాలిని కలెక్టర్ వద్దకు మోసుకెళ్లి వినతిపత్రం అందజేసి వృద్ధురాలికి ఆహారం, వసతి కల్పించాల్సిందిగా కోరాడు. వృద్ధురాలిని అనాథగా వదిలేసిన 13 మంది సంతానంపై వేధింపుల చట్టం కింద అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి చేశాడు. స్పందించిన కలెక్టర్ సాంఘిక సంక్షేమశాఖాధికారిని పిలిపించి ఆంతోనియమ్మాళ్‌ను వృద్ధుల శరణాలయంలో చేర్పించాలని ఆదేశించారు.
అంతోనియమ్మాళ్ శుక్రవారం మీడియాతో తన గోడు వెళ్లబోసుకుంది. ‘నాకు 13 మంది పిల్లలు, మనుమలు, మనుమరాళ్లు ఉన్నారు. వారంతా నన్ను వదిలేయడంతో అనాథగా మారాను. దేవుడే దిక్కుగా బతుకీడుస్తున్నా. నేను చనిపోయే వరకు ఇంత అన్నం పెడితే చాలు. కాలు విరగడం వల్ల కాలకృత్యాలకు కూడా పోలేకపోతున్నాను. అందుకే అన్నం కూడా మానేశాన’ ని ఆవేదన వ్యక్తం చేసింది. బతికి ఉన్నపుడు తనను పట్టించుకోని కుమారులు, కుమార్తెలు, బంధువులు తాను చనిపోయిన తరువాత వచ్చి చూడకూడదని కన్నీటి పర్యంతమైంది.
Comments
Please login to add a commentAdd a comment