వారిది నిర్భాగ్యపు బతుకే
సినిమాల్లో నిర్మాతలది నిర్భాగ్యపు బతుకేనని యువ నిర్మాత సురేష్‌కామాక్షి వ్యాఖ్యానించారు. ఇక్కడ అందరూ సురక్షితంగానే ఉన్నారని, డబ్బు పెట్టే నిర్మాత మాత్రం నిత్యం చచ్చి బతుకుతున్నారని అన్నారు. వీహౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై సంచలన దర్శకుడు స్వామి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం కంగారు. ఈ చిత్రం ఈనెల 24న తెర మీదకు రానున్నది. ఈసందర్భంగా సురేష్ కామక్షితో చిట్‌చాట్.
ప్ర: చాలా ఆవేదనలో ఉన్నారు?
జ: సినిమాకు పనిచేసే లైట్ మెన్‌నుంచి స్టార్ హీరో హీరోయిన్ల వరకు వేతనాలు ఇచ్చేది నిర్మాతలే. అలా, అందరికీ పారితోషికాల్ని ఇచ్చే నిర్మాత ఇవాళ సంతోషంగా ఉన్నాడా అంటే కచ్చితంగా లేదు. నిర్మాతల పాట్లు, వాళ్లు ఎదుర్కొనే సవాళ్లు చెప్పలేనివి. చిత్రానికి టెంకాయ కొట్టిన నాటి నుంచి సెన్సార్‌పూర్తి చేసుకుని విదుదల అయ్యే వరకు నిర్మాత పడే వే దన అంతా ఇంతా కాదు.
ప్ర: లైట్‌మెన్ సమస్యను సృష్టించినట్టున్నారే?
జ: షూటింగ్ ఆరంభమైందంటే రోజూ ఖర్చే. ఏ రోజుకు ఆ రోజు వేతనాలు చెల్లించాల్సిందే. మధ్యలో ఒకటి రెండు రోజులు వేతనాలు చెల్లించకుంటే, షూటింగ్ నిలిపి వేస్తారు. అలా, లైట్ మెన్, హెయిర్ డ్రెస్సర్ కూడా షూటింగ్‌లను నిలిపి వేయగలరు. వారందరికీ వేతనాలు ఇచ్చే నిర్మాత మాత్రం ఏమీ చేయలేడు. అలాంటి ఒక చేదు అనుభవం నాకూ ఎదురు అయింది. ఒక లైట్ మెన్ రెండు రోజుల పాటుగా షూటింగ్ నిలిపి వేయించాడు. కొడెకైనాల్‌లో షూటింగ్ జరుగుతుండగా, అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక పోవడంతో వేతనాలు ఇవ్వడం రెండు రోజులు ఆలస్యమైంది. అంత వరకు ఆగలేక ఓ లైట్ మెన్ షూటింగ్ నిలిపి వేయించాడు. నిర్మాతది ఎంతటి నిర్భాగ్యపు పరిస్థితో చూడండి. ఇక్కడ నిర్మాత పెట్టుబడికే ఎలాంటి గ్యారంటీ లేదు.
ప్ర: సినిమాను వ్యాపారం చేసుకుంటారుగా...?
జ : మంచి ప్రశ్న. ఒక చిత్రం నిర్మిస్తే అది నాలాంటి చిన్న నిర్మాత చిత్రం అయితే, వ్యాపారం చేయడం చాలా కష్టం. ఎవరి ఆకాంక్ష మేరకు సినిమా తీయాలో తెలియదు. ఒప్పందాల ప్రకారం ఇక్కడ వ్యాపారం జరగడం లేదు. మరో విషయం ఏమిటంటే, చిన్న నిర్మాతలకు ఇక్కడ మర్యాద లేదు. ప్రముఖ హీరోల చిత్రాలనే కొనుగోలు చేయడానికి బయ్యర్లు ఆసక్తి చూపుతున్నారు. ఇక, చిన్న చిత్రాలకు సెన్సార్‌సమస్య, పైరసీ బెడద తప్పదు. ఇలాంటికష్ట నష్టాలు ఎన్నో.
ప్ర: కంగారు చిత్రం గురించి చెప్పరూ...?
జ: కంగారు చిత్రం చాలా బాగా వచ్చింది. పాటలు ఇప్పటికే మార్కెట్‌లోకి విడుదలై ప్రజాదరణ పొందాయి. ఈ చిత్రాన్ని 24న విడుదల చేస్తున్నాం. కంగారు చిత్రం విజయంపై నాకు చాలా నమ్మకం ఉంది.