కార్మికులకు పండగే | CM KCR ANNOUNCES DUSSERA BONUS AND SINGARENI DEPENDENT JOBS | Sakshi
Sakshi News home page

కార్మికులకు పండగే

Published Fri, Oct 7 2016 11:51 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

CM KCR ANNOUNCES DUSSERA BONUS AND SINGARENI DEPENDENT JOBS

 
సింగరేణి కార్మికులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు 
వారసత్వ ఉద్యోగాలపై చరిత్రాత్మక నిర్ణయం  వెల్లువెత్తిన హర్షాతిరేకాలు
 సర్వీసుతో సంబంధం లేకుండా ఉద్యోగాలు
 లాభాల్లో వాటా శాతం 21 నుంచి 23కు పెంపు
 వీఆర్‌ఎస్ వారికి కూడా అవకాశం
 ఫలించిన కార్మిక కలలు
 
18 ఏళ్ల నిరీక్షణ.. ఆందోళనలు.. ధర్నాలు.. నిరసన లు.. చివరికి నేతలపై దాడుల వరకు వెళ్లిన వారసత్వ ఉద్యోగాల డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. కార్మికులు కళ్లలో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్న వారసత్వ ఉద్యోగాలకు బుధవారం లైన్‌క్లియర్ అరుు్యంది. సింగరేణి చరిత్రలోనే కనీవినీ ఎరుగని నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సర్వీసుతో నిమిత్తం లేకుండా వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని సింగరేణి యాజ మాన్యాన్ని ఆదేశించారు. ఈ నిబంధన తీసేసి వారసత్వం ఇవ్వడం సింగరేణిలో చరిత్ర సృష్టిస్తోంది. దీంతోపాటు కంపెనీ 2015-16 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సాధిం చిన రూ.1,066 కోట్ల లాభాల్లో నుంచి కార్మికులకు 23 శాతం వాటా ఇవ్వాలని ఆదేశించారు. తెలంగాణ కోసం ఉద్యమించి.. గనులు బంద్ చేసి సకల జనుల సమ్మెతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి దిక్సూచిగా మారి న సింగరేణి కార్మిక బిడ్డల చిరకాల కోరిక నెరవేరిం ది. తెలంగాణ వస్తే సింగరేణిలో తమకు ఏది కావాలని కోరుకున్నారో కార్మికులకు నేడు అది దక్కింది. దీంతో వారిలో ఆనందం వెల్లివిరిసింది. 
 
శ్రీరాంపూర్ :  వారసత్వ ఉద్యోగాలు, లాభాల్లో వాటా ఇంకా ఇతర ప్రధాన డిమాండ్లపై మూడు రోజులుగా గుర్తింపు సంఘం నేతలు, కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు హైదరాబాద్‌లో మకాం వేశారు. ఎప్పుడెప్పుడు సీఎం పేషీ నుంచి కబురు వస్తుందా అని ఉత్కంఠగా ఎదురుచూసిన నేతలకు బుధవారం సాయంత్రం పిలుపు రానే వచ్చింది. దీంతో సీఎం కార్యాలయంలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఎంపీ బాల్క సుమన్, కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు, టీబీజీకేఎస్ నుంచి అధ్యక్షుడు బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య, ఉపాధ్యక్షుడు ఆకునూరి కనుకరాజు, మిర్యాల రాజిరెడ్డిలు హాజరయ్యూరు. ఈ చర్చల్లో కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. సింగరేణిలో 1981 నుంచి వారసత్వ ఉద్యోగాలు మొదలయ్యాయి. తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో జాతీయ సంఘాలు యాజమాన్యంతో చేసుకున్న ఒప్పందం వల్ల 1998 జూన్ 6 నుంచి వారసత్వ ఉద్యోగాలు నిలిచిపోయాయి.
 
దీంతో కార్మికులు 18 ఏళ్ల  నుంచి వారసత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారు. అన్ని సంఘాల కంటే మొదటగా టీబీజీకేఎస్ వారసత్వ ఉద్యోగాలపై ప్రధానంగా దృష్టి సారించి పోరాటం మొదలు పెట్టింది. ఉద్యమ వేడిలో ఈ డిమాండ్ ఊపందుకుంది. దీంతో గత గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఇదే ప్రధాన డిమాండ్‌తో టీబీజీకేఎస్ ఎన్నికలకు వెళ్లింది. కార్మికులు ఈ డిమాండ్‌ను నెరవేర్చుతారనే ఉద్ధేశంతో జాతీయ సంఘాలను కాదని మొదటి సారి ప్రాంతీయ సంఘమైన టీబీజీకేఎస్‌ను గుర్తింపు సంఘంగా గెలిపించారు. అప్పటి నుంచి వారసత్వ ఉద్యోగాలపై యాజమాన్యం, ప్రభుత్వంపై టీబీజీకేఎస్ ఒత్తిడి తెస్తున్నా.. అది సాధ్యం కాలేదు. ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని శాఖలు, సంస్థలపై సమీక్ష సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించారు. కాని సింగరేణిపై ఆలస్యం చేయడంతో కార్మికుల్లో ఒకింత అసహనం రేకేత్తించింది. జాప్యమైనా సరే మెజారీటీ కార్మికవర్గానికి ప్రయోజనకారిగా మారే నిర్ణయాలు చివరికి తీసుకోవడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
 
 సర్వీసు నిబంధనకు చెల్లుచీటి..
 గతంలో వారసత్వ ఉద్యోగాలు ఉన్నప్పుడు రెండేళ్ల సర్వీసు నిబంధన ఉండేది. కార్మికుడు తన కొడుకు ఉద్యోగం పెట్టించుకోవాలంటే రెండేళ్ల ముందు దిగిపోయేవాడు. ఇప్పుడు ఒక వేళ వారసత్వ ఉద్యోగాలు వచ్చినా అదే పద్ధతి కొనసాగుతుందని అందరూ భావించారు. చివరికి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ నేతలు కూడా ఇదే భావనతో ఉన్నారు. ఈ నిబంధన పెడితే కేవలం రెండేళ్ల సర్వీసు లోపు ఉన్న వారి నుంచి తీవ్ర వ్యతిరేక వస్తుందని భావించి కనీసం మెడికల్‌బోర్డుకు దరఖాస్తు చేసుకుకే నాటికి రెండేళ్లు ఉన్న వారిని పరిగణనలోకి తీసుకున్నా మేలు జరుగుతుందని భావించారు. కాని సమావేశంలో కూర్చున్న తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకటిస్తుంటే టీబీజీకేఎస్ నేతలు, ఎమ్మెల్యే, ఎంపీలే కంగుతిన్నారు. ‘సర్వీసుతో సంబంధం ఏంటయ్యా.. ఉద్యోగంలో ఉంటే చాలు దరఖాస్తు ఇచ్చిండంటే వారసత్వం కల్పించడయ్యా..’ అంటూ సీఎం నోటి నుంచి నిర్ణయం రావడంతో నేతలంతా కరతాళ ధ్వనులు చేయడం వారి వంతైంది. దీంతో రేండళ్ల సర్వీసు లోపల ఉన్న సుమారు 3,200 మంది కార్మికులు కూడా నేడు వారసత్వ పరిధిలోకి వచ్చారు. వీరికి అరుదుగా దక్కిన అవకాశంగా భావిస్తున్నారు. 
 
 ముందు సర్వీసు దగ్గరపడ్డ వారికే ప్రాధాన్యం
 ముందు సర్వీసు దగ్గరపడ్డ వారిని సీరియల్ లిస్టులో ముందుగా పెట్టి వారసత్వం కల్పిస్తారు. ఒక వేళ కార్మికుని సర్వీసు 4 ఏళ్లు ఉండి అతడి కుమారుడి వయస్సు 35  ఏళ్ల వయస్సుకు దగ్గరపడిందంటేఉద్యోగ కనీస వయస్సు అర్హత కోల్పోయే ప్రమాదం ఉందని ముందుగా వారిని కూడా పరిగణనలోకి తీసుకోబోతున్నారు. ఈ వారసత్వ ఉద్యోగాలకు టైంబాండ్ అంటూ ఏదీ లేదని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కెంగర్ల మల్లయ్య తెలిపారు. ఇది నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు.
 
 వీఆర్‌ఎస్‌లో డిపెండెంట్లకు వరం..
 1997-2001 మధ్య వీఆర్‌ఎస్ డిపెండెంట్లకు కూడా వరాలు ఇచ్చారు. అప్పుడు ఈ మధ్యకాలంలో వారసత్వ ఉద్యోగాలు ఆగిపోవడంతో అప్పటికే దరఖాస్తు వారిలో సగం మందికి ఉద్యోగాలు ఇచ్చి మిగిలిన సగం మందికి రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. దీనికి కొంత మంది ఒప్పుకొని డబ్బులు తీసుకోగా.. చాలా మంది తమకు డబ్బులు వద్దని ఉద్యోగాలే కావాలని తీసుకోలేదు. అప్పటి నుంచి వారు ఉద్యోగాల కోసం పోరాడుతున్నారు. ఇప్పుడు వారందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి ఇందులో నిర్ణయం తీసుకున్నారు. ఇక డబ్బులు తీసుకున్న వారు, డిస్మిస్ కార్మికుల సమస్యను యూనియన్ నేతలు యాజమాన్యంతో చర్చించి పరిష్కరించుకోవాల్సిందిగా సీఎం సూచించారు. 
 
 పెరుగుతున్న లాభాల వాటా..
ఈ సారి కార్మికులకు లాభాల వాటా డబ్బులు పెద్దమొత్తంలో వచ్చే అవకాశం ఉంది. గత సంవత్సరం వచ్చిన లాభాలు రూ.461 కోట్ల నుంచి కార్మికులకు 21 శాతం వాటాగా రూ.106  కోట్లు పంచారు. ఇప్పుడు కంపెనీకి వచ్చిన మొత్తం లాభం రూ.1066.13 కోట్ల నుంచి 23 శాతంగా మొత్తం రూ. 245.21 కోట్లు పంపిణీ కాబోతున్నాయి. ఈ లెక్కన కార్మికులకు కనీసం రూ.43 వేల పైగా అందనున్నాయి. దీనికి తోడు ఇటివల కోలిండియాలో జరిగిన ఒప్పందం ప్రకారం కార్మికులకు పీఎల్‌ఆర్ బోనస్ క్రింద రూ.54,000 వేలు చెల్లించనున్నారు. మొత్తం కలిపి రూ.లక్షకు పైగా కార్మికులు అందుకోబోతున్నారు. వీటికి సంబంధించిన తేదీలు ప్రకటించాల్సి ఉంది. దీంతో దసరా, దీపావళి పండుగల సంతోషం కార్మికుల ఇళ్లలో ముందే చేరింది. 
 
 
 మా పోరాటం ఫలించింది
సింగరేణి సన్స్ అసోసియేషన్(ఎస్‌ఎస్‌ఏ) తరఫున వారసత్వ ఉద్యోగాల కోసం ఇన్నాళ్లు చేసిన మా  పోరాటం ఫలిచింది. వారసత్వ ఉద్యోగాల కోసం  చాలామంది ఎదురుచూస్తున్నారు. పండుగ పూట తీపి కబురు ఆనందంగా ఉంది. సీఎంకు, కృషి చేసిన టీబీజీకేఎస్‌కు ధన్యవాదాలు.
  - ఎన్.మహేశ్, ఎస్‌ఎస్‌ఏ
 
 ఉద్యోగం వస్తుందని ఆనందంగా ఉంది..
 వారసత్వ ఉద్యోగాల కోసం ఇన్నాళ్లూ ఎదురుచూశాం. ఇక రాదని అనుకున్న సమయంలో ముఖ్యమంత్రి ఉద్యోగాలు ప్రకటిం చడం ఆనందంగా ఉంది. తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకు దక్కుతాయ ని అనుకున్న భావన నేడు నిజమైంది. వారసత్వం ప్రకటించినందుకు సీఎంకు మా కృతజ్ఞతలు. 
 - ఎం.రమేశ్, కార్మికుడి కుమారుడు
 
 వారసత్వం మా హక్కు..
 వారసత్వ ఉద్యోగాలు మా హక్కు. 1998లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పోగోట్టిన వారసత్వ ఉద్యోగాలను నేడు తెలంగాణలో తెచ్చుకున్నాం. ఈ ఘనత కేసీఆర్‌దే. లాభాల వాటా కూడా పెంచడం మరింత సంతోషాన్ని నింపింది. దీనిపై వెంటనే యాజమాన్యంతో గుర్తింపు సంఘం రాత పూర్వక ఒప్పందం చేసుకుని త్వరలోనే అమలు చేయాలి. సింగరేణి కేసీఆర్‌కు ఎప్పుడూ రుణపడి ఉంటుంది. 
 - సాన రాజయ్య, కార్మికుడు
 
 ఇన్నాళ్లకు మా బిడ్డలకు ఉద్యోగాలు..
వారసత్వ ఉద్యోగాలు వస్తే మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని ఇన్నాళ్లు ఎదురుచూశాం ఇది నెరవేరింది. వయస్సు మీద పడడంతో ఎముకలు అరిగినా పని చేస్తూ వచ్చాం. వారసత్వం ఇస్తే దిగిపోతామని ఇన్నాళ్లుగా ఎదుచూసినందుకు ఫలితం దక్కింది. సర్వీసు నిబంధన లేకపోవడం వల్ల చాలామందికి ప్రయోజనం చేకూరింది.
 - సోదరి మారుతి, కార్మికుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement