
జైళ్లే టార్గెట్!
రాష్ర్టంలోని కేంద్ర కారాగారాల్ని గురి పెట్టి బాంబు దాడులకు తీవ్ర వాదులు వ్యూహ రచన చేసి ఉన్నారు.
సాక్షి, చెన్నై : రాష్ర్టంలోని కేంద్ర కారాగారాల్ని గురి పెట్టి బాంబు దాడులకు తీవ్ర వాదులు వ్యూహ రచన చేసి ఉన్నారు. ఒసామా బిన్ లాడెన్ చిత్రాలతో ఏకంగా ఈ బెదిరింపులు రావడం జైళ్ల శాఖను కలవరంలో పడేశాయి. ఏకంగా అన్ని జైళ్లకు ఒకే రకంగా బెదిరింపు లేఖలు రావడంతో నిఘాను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలో చెన్నై, వేలూరు, కోయంబత్తూరు, తిరుచ్చి, సేలం, మదురై, కడలూరు తదితర తొమ్మిది కేంద్ర కారాగారాలు ఉన్నాయి. ఆయా జైళ్లల్లో శిక్ష పడ్డ, విచారణను ఎదుర్కొంటున్న ఖైదీలు వేలల్లో ఉన్నారు. ఈ జైళ్లల్లో భద్రత కట్టుదిట్టంగానే ఉంటాయి. అయితే, కొన్ని సందర్భాల్లో పాత కక్షల నేపథ్యం, అధికారులు వేధిస్తున్నారంటూ వివాదాలు చోటు చేసుకోవడం జరుగుతుంటాయి. అయినా, సకాలంలో వీటిని అణచి వేయడం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా,తీవ్ర వాదులు కేంద్ర కారాగారాల్ని గురి పెట్టి ఉండటం కలకలం రేపుతోంది. రాష్ట్రం తీవ్ర వాదుల హిట్ లిస్టులో ఉండటం, ప్రధానంగా చెన్నై, మదురైకు మరింతగా బెదిరింపులు ఇన్నాళ్లు వస్తుండగా, ప్రస్తుతం ఏకంగా అన్ని కేంద్ర కారాగారాలకు ఒకే రకం బెదిరింపులు రావడంతో పోలీసు యంత్రాంగం, జైళ్ల శాఖ వర్గాలు అప్రమత్తం అయ్యాయి.
లాడెన్ ఫొటోలతో బెదిరింపు : కోయంబత్తూరు కేంద్ర కారాగారానికి వచ్చిన ఓ లేఖను శనివారం రాత్రి అధికారులు విప్పి చూశారు. అందులో ఒసామా బిన్ లాడెన్ చిత్ర పటం, భారత దేశ మ్యాప్, దాని మధ్యలో ఆంగ్ల అక్షరాలు టైప్ చేసి ఉండటంతో ఆ లేఖను తీవ్రంగా పరిగణించారు. అందులో ఓ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా జైళ్లల్లో దాడులు జరుగుతున్నాయని, ఇది కొనసాగిన పక్షంలో తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరికలు చేసి ఉన్నారు. కేంద్ర కారాగారాలన్నింటినీ బాంబులతో పేల్చి వేస్తామని తీవ్రంగా స్పందించి ఉన్నారు. అలాగే, ఇదే లేఖలను చెన్నై పుళల్ , వేలూరు, తిరుచ్చి, కడలూరు, కోయంబత్తూరు కారాగారాలు సైతం ఆదివారం రావడం గమనార్హం. ఈ లేఖలు బెదిరింపు లేఖలుగా భావించినా, అందులో పేర్కొన్న అంశాలు, చివరగా ‘అల్ ఉమా’ తీవ్ర వాద సంస్థ అని స్పష్టంగా రాసి ఉండటంతో అనుమానాలు బయలు దేరాయి. ఈ సంస్థకు చెందిన వాళ్లు కోయంబత్తూరు బాంబు పేలుళ్ల కేసులో రాష్ట్రంలోని పలు కారాగారాల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ దృష్ట్యా, ఈ లేఖను తీవ్రంగా పరిగణించిన జైళ్ల శాఖ ఆయా నగర పోలీసు కమిషనర్లకు అందజేశారు. ఈ లేఖ అన్ని కారాగారాలకు కోయంబత్తూరు ఉక్కడం తపాల కేంద్రం నుంచే వచ్చి ఉన్నట్టు విచారణలో తేలింది.
ఈ లేఖను పంపిన వాళ్లెవరు ..? అన్న విచారణ ఓ వైపు సాగుతుంటే, మరో వైపు అన్ని కారాగారాలతో వద్ద భద్రతను జైళ్ల శాఖ కట్టుదిట్టం చేశారు. జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఆయా జైళ్లలో కల్పించ బడ్డ భద్రతపై సమీక్షలో పడ్డారు. సందర్శకులకు ఆంక్షలు విధించే పనిలో పడ్డారు. జైళ్లు, పరిసరాల్లో గస్తీని ముమ్మరం చేయడంతో పాటుగా తనిఖీలు చేస్తున్నారు. కాగా, ఈ లేఖ గత వారం పుళల్ జైల్లో జరిగిన ఘర్షణ నేపథ్యంలో వచ్చిందా..? అన్న అనుమానాలు నెలకొన్నాయి. తీవ్ర వాది పన్నా ఇస్మాయిల్, మరి కొంత మంది ఖైదీలు, జైలు సిబ్బంది మధ్య తలెత్తిన ఈ వివాదం ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, జైళ్ల శాఖ కొత్త బాస్‌గా, చెన్నై మాజీ పోలీసు కమిషనర్, అదనపు డీజీపీ జార్జ్ బాధ్యతలు చేపట్టనున్న వేళ ఈ బెదిరింపులు వచ్చి ఉండడంతో ఆ శాఖ వర్గాలు భద్రతా పర్యవేక్షణతో పాటుగా కొత్త బాస్‌కు ఆహ్వానం పలికేందుకు సిద్ధం అవుతున్నారు.