నయన తారను అధిగమిస్తానా? లేదా?
కోలీవుడ్‌లో ఎవరేమన్నా...కాదన్నా...దుమ్ము రేపుతున్న ప్రస్తుత హీరోయిన్లు ఇద్దరే. వారిలో ఒకరు నయన తార, మరొకరు హన్సిక. ఈ ఇద్దరిలో ఒకరు ఉంటే, ఆ చిత్రం విజయం మినిమం గ్యారంటీ అనే స్థాయికి ఎదిగారు. పారితోషికంలోను కోటి దాటారు. దీంతో నయన తార, హన్సికల మధ్య పోటీ నెలకొందన్న ప్రచారం జరుగుతున్నది. ఈ మధ్య విజయాల పరంగా హన్సిక, నయన తారను ఓవర్ టేక్ చేస్తున్నదన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ సందర్భంగా నటి హన్సికతో మినీ ఇంటర్వ్యూ.
ప్ర: ఉత్తరాది నుంచి వచ్చి తమిళంలో సినీ అభిమానుల మనసును దోచుకున్న మీరు వారి గురించి ఏమి చెబుతారు..?
జ: నన్ను ఇంతగా ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు. ఇక్కడి యువత గురించి చెప్పాలంటే, అన్ని విషయాల్లో అడ్వాన్స్‌గా ఉన్నారు. చాలా వివరాలు తెలుసుకుంటున్నారు. దేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి కృషి పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఇది గ్రహించాల్సిన విషయమే.
ప్ర: మీరు ముంబైలో అనాథ, వృద్ధాశ్రమాలకు విశేష సేవలు అందిస్తున్నారుగా..? మరి తమిళనాడులో సేవలందించరా?
జ: ముంబైలో మా అమ్మ, అన్నయ్య ఉన్నారు. వారు ఆశ్రమాల నిర్వహణ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ప్రత్యక్షంగా పరిరక్షణ బాధ్యతలు చేపడితేనే అలాంటి సేవా కార్యక్రమాలకు న్యాయం జరుగుతుంది. అయి తే, తమిళనాడులో అనాథ ఆశ్రమాలు నెలకొల్పాలన్న కోరిక నాకూ ఉంది. అందుకు దైవ నిర్ణయ ఎలా ఉం టుందో చూడాలి.
ప్ర: తమిళనాడులో మీకు నచ్చిన వంటకం?
జ: తమిళనాడులోనే కాదు. ఎక్కడైనా ఇష్టమైన వం టకం ఇడ్లీ. స్కూల్లో కూడా కొంచెం బొద్దుగా ఉండడం తో ఇడ్లీ అని ఆట పట్టించేవారు.
ప్ర: హన్సిక నాకు నచ్చిన హీరోయిన్ అని ఇటీవల విశాల్ చేసిన వ్యాఖ్యల గురించి కామెంట్...
జ: ఆయన వ్యాఖ్యలు చాలా సంతోష పరిచాయి. విజయ్ , ధనుష్, జయం రవిల వరుసలో నాకు నచ్చిన మరో నటుడు విశాల్.
ప్ర: 2015లో మీకు, నయనకు మధ్యలో అసలైన పోటీ గురించి...?
జ: నయన తార నాకంటే సీనియర్. ఆమె నటించిన చిత్రాలు నేను చూస్తాను. నాకు ఆమె నటన అంటే చాలా ఇష్టం. అంతే కాకుండా, ఓ సీనియర్ నటిగా ఆమె అంటే గౌరవం. ఇక పోతే నా పోరితోషికం ఎంత? అన్న విషయం నాకే తెలియదు. అవన్నీ మా అమ్మ చూసుకుంటుంది. అలాగే 2015లో నేను, నయన తారను అధిగమిస్తానా? లేదా అన్న విషయంలో ఎలాంటి చింత లేదు. నాకు నేనే పోటీ. 24 గంటలు శ్రమిస్తా. చిత్రం చిత్రానికి వైవిధ్యం చూపడానికి ప్రయత్నిస్తుంటాను.
ప్ర: అరణ్మణై చిత్రంలో దెయ్యంగా నటించి మెప్పించారుగా? మళ్లీ అలాంటిపాత్ర వస్తే నటిస్తారా..?
జ: అరణ్మణై చిత్రానికి సీక్వెల్ తీస్తే నటించేందుకు సిద్ధం.
ప్ర: మీకు వరుసగా విజయాలను అందిస్తున్న సుందర్ సీ గురించి..?
జ: చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. సుందర్ సీ , కుష్భు మేడమ్ మా కుటుంబ సభ్యులు. నాకు నచ్చిన మొనగాడు సుందర్ సీ. అంబళ చిత్రం షూటింగ్‌లో నన్ను తేనేటీగ కుట్టినప్పుడు, ఒక రోజంతా ఆహారం తీసుకోలేదు. అప్పుడు ఆయన ఓ తల్లిలా నన్ను చూసుకున్నారు. సుందర్ సీ షూటింగ్ అంటే, అమ్మకు నా గురించి ఎలాంటి చింత ఉండదు. సుందర్ సీ, ఖుష్భు నన్ను సొంత కూతురిలా చూసుకుంటున్నారని అమ్మ చెబుతారు.