ఓటర్లకు ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషిన్‌లు! | Complaints of cash, gift distribution in RK Nagar bypolls | Sakshi
Sakshi News home page

ఓటర్లకు ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషిన్‌లు!

Published Fri, Apr 7 2017 9:31 AM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM

ఓటర్లకు ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషిన్‌లు!

ఓటర్లకు ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషిన్‌లు!

ఆర్కేనగర్‌లో అభ్యర్థుల లీలలు
►  నగదు ముట్టిందా అనేందుకు కోడ్‌ భాష.. స్వామికి దండం పెట్టుకున్నారా!
►  అమ్మ భౌతికకాయం బొమ్మతో ప్రచారం
►  పన్నీర్‌కు వాసన్‌ మద్దతు


సాక్షి ప్రతినిధి, చెన్నై: సవాలక్ష నిబంధనల అతిక్రమణకు అనంతకోటి ఉపాయాలు ఉన్నాయని ఆర్కేనగర్‌ ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. నగదు పంపిణీని అడ్డుకునేందుకు అధికారులు అవస్థలు పడుతుండగా కోడ్‌ భాషతో అభ్యర్థులు తమ పనికానిచ్చేస్తున్నారు. ఆర్కేనగర్‌లో సుమారు  రెండు లక్షల ఓటర్లుండగా, ఒక్కో ఓటుకు రూ.4వేలు నుంచి రూ.10వేల వరకు చెల్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నగదు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు 35 మంది పరిశీలకులు, 10 ప్లయింగ్‌ స్క్వాడ్‌ల ను, ఆదాయ పన్ను శాఖ అధికారులను ఎన్నికల కమిషన్‌ నియమించింది. వీరుగాక పెద్ద సంఖ్యలో పోలీసులు, పారా మిలటరీ దళాలు తిరుగుతున్నాయి. అయినా బుధవారం ఒక్కరోజునే లక్ష మంది ఓటర్లకు నగదు పంపిణీ సాగినట్లు తెలుస్తోంది.

అయితే నోటు తీసుకున్నా తమకే ఓటు వేస్తారని గ్యారంటీ ఎముందని అభ్యర్థులకు అనుమానం పట్టుకుంది. ఆధ్యాత్మిక భావాలు అధికంగా ఉండే తమిళ ప్రజలు సెంటిమెంట్‌కు కట్టుబడి ఉంటారు. అందుకే నగదును అందజేసే ముందు భగవంతుని బొమ్మలపై ప్రమాణం చేయించుకుంటున్నారు. వారి వారి మతాలను అనుసరించి ఓటు కోసం ఒట్టు వేయించుకుంటున్నారు. నగదు పంపిణీ సక్రమంగా జరిగిందా లేక కార్యకర్తలు నొక్కేసారా అనే అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు మరో బృందం పర్యటిస్తోంది. వీరు ఓటర్ల వద్దకు, టీ దుకాణాల వద్ద గుంపులుగా ఉండేవారి వద్దకు వెళ్లి ‘స్వామికి దండం పెట్టుకున్నారా’ అని ప్రశ్నించగా పెట్టుకున్నాం అని బదులిస్తే నగదు ముట్టినట్లు. డబ్బులు అందనివారు ‘ ఎక్కడయ్యా స్వామి...ఎలా దండం పెట్టుకునేది’అని సమాధానం చెబుతున్నారు.  

ఇదిలా ఉండగా, కొందరు ఓటర్లకు వాషింగ్‌ మెషీన్, ఫ్రిజ్‌ తదితర వస్తువుల కూపన్లు పంచుతున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఇదే మాటలు వినపడడంతో అధికారులు కోడ్‌ భాషను కనుగొన్నారు. శీర్కాళి నియోజకవర్గ అన్నాడీఎంకే ఎమ్మె ల్యే భారతి తన అనుచరులతో వస్తుండగా అధికారులు ఆయన కారును ఆపి తనిఖీలు చేశారు. అయితే ఏమీ దొరకలేదు. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో ధన ప్రవాహం ఎన్నికల కమిషన్‌ను ఊపిరి తీసుకోనివ్వడం లేదు. ఇప్పటికే అధికారుల బృందాలతో ఆర్కేనగర్‌ నిండిపోగా, తాజాగా మరో ఉన్నతాధికారి ఢిల్లీ నుంచి చెన్నైకి చేరుకున్నారు.

అమ్మ భౌతికకాయం బొమ్మ, శవపేటిక ప్రచారం
ఇదిలా ఉండగా, అమ్మ మరణానికి శశికళ, ఆమె కుటుంబీకులే కారణమని ప్రజలు అనుమానిస్తుండగా, దీన్ని అవకాశంగా తీసుకున్న పన్నీర్‌సెల్వం వర్గం ఆర్కేనగర్‌లో చిత్రమైన ప్రచారం చేసింది. ఒక జీపుపై అమ్మ భౌతికకాయాన్ని పోలిన బొమ్మను శవపేటిలో ఉంచి ప్రచారం నిర్వహించడం కలకలం రేపింది. ఈనెల 12వ తేదీన ఆర్కేనగర్‌లో పోలింగ్‌ జరగనుండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచార వేగం పెంచారు. అయితే అన్నాడీఎంకేలోని రెండు చీలిక వర్గాల అభ్యర్థులు దినకరన్, మధుసూదనన్‌ ఒకరి కొకరు గట్టిపోటీ ఇస్తున్నారు. అయితే విచ్చలవిడిగా నగదును వెదజల్లుతూ ఓటర్లను ప్రలోభపెట్టడంలో దినకరన్‌ ముందున్నరానే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలకు తగ్గట్లుగా నగదు బట్వాడా చేస్తూ అన్నాడీఎంకే, డీఎంకే కార్యకర్తలు పట్టుపడుతున్నారు. భారీ మొత్తం నగదు స్వాధీనమైంది.

ఈ పరిస్థితిలో ఢిల్లీలోని ప్రధాన ఎన్నికల కమిషన్‌ కార్యాలయం ఆదాయపన్ను శాఖకు చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారి విక్రమ్‌ భాద్రాను ప్రత్యేక అధి కారిని నియమించగా ఆయన గురువారం ఉదయం చెన్నైకి చేరుకున్నారు. ఈ అధికారి అభ్యర్థులపైనే గాక ఆర్కేనగర్‌లో పనిచేసే అధికారులపై కూడా నిఘాపెట్టే అధికారాలను ఈసీ కల్పించింది. ఆర్కేనగర్‌లో ఎన్నికల విధులు నిర్వహించే అన్నిశాఖల అధికారులు విక్రమ్‌ బాద్రా కనుసన్నల్లో నడుచుకోవాల్సి ఉంది. ప్రజలు, పార్టీ నుంచి వచ్చే ఫిర్యాదులను సైతం స్వీకరించి నేరుగా ఢిల్లీకి పంపి వాటిపై ఆయనే నిర్ణయం తీసుకుంటారు. ఇదిలా ఉండగా, ఎన్నికల అధికారులతో కూడిన ఫ్ల్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాల్లో రాజకీయ పార్టీల ప్రతి నిధులను కూడా చేర్చాలని ఆలోచిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి రాజేష్‌ లఖానీ చెప్పారు. నగదు బట్వాడాపై మారుమూల సందుల్లో సైతం నిఘా పెంచేందుకు ద్విచక్రవాహనాల పోలీసు దళాలు గురువారం రం గంలోకి దించినట్లు చెన్నై పోలీసు కమిషనర్‌ కార్తికేయన్‌ తెలిపారు. కాశిమేడు ప్రాంతంలో ఓటర్లకు నగదు పంచుతున్న డీఎంకే కార్యకర్త కరుణానిధిని అరెస్ట్‌ చేశారు.   
          
దినకరన్‌ ఓటమికి ఏడపాడి కుట్ర: స్టాలిన్‌
ఆర్కేనగర్‌ ఎన్నికల్లో దినకరన్‌ గెలిచినట్లయితే తన సీఎం సీటుకు ముప్పు తప్పదని సీఎం ఎడపాడి పళనిస్వామి భయపడుతున్నారని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్‌ అన్నారు. ఆర్కేనగర్‌ పార్టీ నేతలతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం సీటును కాపాడుకునేందుకు దినకరన్‌ ఓటమికి ఎడపాడి పాటుపడుతున్నారని వ్యాఖ్యానించారు. తమిళ మానిల కాంగ్రెస్‌ అధ్యక్షుడు జీకేవాసన్‌ గురువారం పన్నీర్‌సెల్వం అభ్యర్థికి మద్దతు ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement