లోక్‌సభ ఎన్నికల ప్రచార తొలి దశ పూర్తయింది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు బహిరంగ సభలకు సన్నద్ధమవుతున్నాయి.
పింప్రి, న్యూస్‌లైన్: లోక్‌సభ ఎన్నికల ప్రచార తొలి దశ పూర్తయింది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు బహిరంగ సభలకు సన్నద్ధమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల ప్రచారం మొదటి దశను ఆయా పార్టీలు పాదయాత్రలు, వీధి సభలతో పూర్తి చేశాయి. ఇప్పుడు ప్రచారంలో రెండో దశ ప్రారంభమైంది.
ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. పుణేలో రాహుల్ గాంధీ, నరేంద్రమోడీ శరద్‌పవార్ రాజ్‌ఠాక్రే, నితిన్ గడ్కరీ, యోగేంద్ర యాదవ్, గోపీనాథ్ ముండే తదితర అగ్రనేతలు ఈ సభల్లో పాల్గొననున్నారు. దీంతో ప్రచారం తారస్థాయికి చేరుకోనుంది.
పుణే, పింప్రి, చించ్‌వడ్‌లతో పాటు జిల్లాలోని నాలుగు లోక్‌సభ నియోజక వర్గాల్లో ఈ నెల 17వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇందులోభాగంగా ముందుగా రాజ్‌ఠాక్రే ఉగాదిని పురస్కరించుకొని పుణేలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ నెల తొమ్మిదో తేదీన నిర్వహించనున్న సభలో కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ మరో సభలో పాల్గొననున్నారు.
ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ నాలుగు లోక్‌సభ నియోజక వర్గాల పరిధిలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. బీజేపీ ప్రచారానికి ఆ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఈ నెల 14వ తేదీన బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అదేవిధంగా నితిన్ గడ్కరీ, గోపీనాథ్ ముండేలు కూడా బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
ఎమ్మెన్నెస్ తరఫున రాజ్‌ఠాక్రే ‘వన్ మెన్ ఆర్మీ’లా అభ్యర్థుల ప్రచారం చేయనున్నారు. ఆదివారం హడస్పర్, వడగావ్‌శేరిలో ఆ మరుసటి రోజు కోత్‌రోడ్, పర్వతిలలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఆమ్ ఆద్మీ తరఫున యోగేంద్ర యాదవ్ ఈ నెల 12వ తేదీన బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.