
సీబీఐ ఉచ్చు
*అక్రమ మైనింగ్‌లో కాంగ్రెస్ నేతలకు బిగుసుకుంటున్న వైనం
*అనిల్‌లాడ్ అరెస్ట్‌తో బళ్లారి జిల్లాలోని గనులు యజమానుల గుండెల్లో దడ
బళ్లారి : బీజేపీ నాయకులే బళ్లారి జిల్లాలో అక్రమ గనుల తవ్వకాలు చేపట్టారని చెప్పుకుంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన బళ్లారి సిటీ ఎమ్మెల్యే అనిల్‌లాడ్ అసలు బండారం బయట పడింది. బుధవారం సాయంత్రం బళ్లారి సిటీ ఎమ్మెల్యే అనిల్ లాడ్‌ను బెంగళూరులో సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడంతో బళ్లారిలో మళ్లీ అక్రమ గనుల తవ్వకాలు చేపట్టిన నేతల గుండెల్లో దడ మొదలైంది. ఇప్పటి వరకు బీజేపీకి చెందిన వారినే అక్రమ గనుల తవ్వకాల్లో అరెస్ట్‌లు చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం సీబీఐ అధికారులు సమగ్ర తనిఖీలు చేస్తుండటంతో కాంగ్రెస్ నేతల అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. బళ్లారి జిల్లా సండూరులో గనులు తవ్వకాల్లో అనిల్‌లాడ్ రారాజుగా వెలుగొందారు. వీఎస్‌లాడ్, వీఎస్‌లాడ్ అండ్ సన్స్‌కు చెందిన గనుల తవ్వకాల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. 2010లో ఎమ్మెల్యే అనిల్‌లాడ్‌కు చెందిన వీఎస్ లాడ్ గనుల కంపెనీ నుంచి కార్వార ఎమ్మెల్యే సతీష్‌శైల్‌కు చెందిన మల్లికార్జున షిప్పింగ్ కంపెనీకి అక్రమంగా 1.50 లక్షల టన్నుల ఇనుప ఖనిజం సరఫరా చేశారనే ఆరోపణలు ఉండటంతో ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు.
2010 నుంచి ఆయనపై ఈ ఆరోపణలు ఉన్నప్పటికీ తాను అక్రమ గనుల తవ్వకాలు చేపట్టలేదంటూ బూకాయిస్తూ వచ్చారు. బళ్లారి జిల్లాకు చెందిన అక్రమ గనుల తవ్వకాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలకు ప్రస్తుతం ఉచ్చు బిగుసుకుంటుండటంతో మిగిలిన అక్రమ గనుల తవ్వకాలు చేపట్టిన నేతల్లో దఢ మొదలైంది. బళ్లారి జిల్లాలోని హొస్పేట, సండూరు, బళ్లారి ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ప్రముఖులకు అక్రమ గనుల తవ్వకాల్లో భాగస్వామ్యం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇప్పటి వరకు అక్రమ గనులు తవ్వకాలపై విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనిల్‌లాడ్ అరెస్ట్‌తో నోరు మూతపడినట్లయింది. బళ్లారి జిల్లాలో అక్రమ గనుల తవ్వకాలు చేపట్టిన గనుల కంపెనీల్లో సీఈసీ ఇచ్చిన సీ క్యాటగెరీ నివేదికలో అనిల్‌లాడ్‌కు చెందిన గనుల కంపెనీలు ఉన్నాయి. ఈనేపథ్యంలో అక్రమ గనుల తవ్వకం కాంగ్రెస్ నేతల మెడకు చుట్టుకుంటోంది.