‘చేతి’కి చికిత్స!
పార్టీ ప్రక్షాళనపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి
దూకుడు వ్యక్తికి ఎంపీసీసీ పగ్గాలు
రాష్ర్ట మంత్రివర్గంలోనూ మార్పులు
కొత్తవారికి చోటుదక్కే అవకాశం
అవినీతి ముద్రను తొలగించేందుకు యత్నాలు
సాక్షి, ముంబై: అవినీతి ఆరోపణలతో మకిలపడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను పునరుద్ధరించడంపై అధిష్టానం దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లోపు ప్రజల్లో పార్టీకి ఆదరణ పెంచే దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతమున్న రాష్ట్ర మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించి అవినీతి రహిత పాలన అందించాలని వడివడిగా అడుగులు వేస్తోంది. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో దారుణ పరాజయం చవిచూసిన అనంతరం కాంగ్రెస్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ వరకు ఈ మంత్రి మండలి విస్తరించే యోచనలో ఉందని సమాచారం. అవినీతి, కుంభకోణాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ...మంత్రి మండలిలో కొందరు కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి మండలిలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోనున్నాయనే విషయం అందరికీ ఉత్కంఠను రేపుతోంది.
ఎంపీసీసీ అధ్యక్షునిగా రాణే, విఖే పాటిల్ పేర్లు...!
ఆదర్శ్ కుంభకోణం దెబ్బ కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళనకు బాటలు వేసింది. వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను ధీటుగా ఎదుర్కొవాలంటే దూకుడు స్వభామున్న వారికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది. ఆదర్శ్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి ఆశోక్ చవాన్ విచారించాల్సిన అవసరం లేదని గవర్నర్ కె.శంకర నారాయణన్ సీబీఐ నివేదికను తోసిపుచ్చడంతో ఎంపీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని అనుకుంది. అయితే ప్రతిపక్షాల ఒత్తిడితో ఆదర్శ్ నివేదికను సర్కార్ శాసనసభలో ప్రవేశపెట్టడంతో అశోక్‌కు ఆ పదవి ఇవ్వకపోవడమే ఉత్తమమనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మంచి వాగ్ధాటి, కార్యకర్తలతో కలుపుకోయే స్వభావం గల నారాయణ రాణే, రాధకృష్ణ విఖేపాటిల్ పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. వీరిలో ఒకరికి పార్టీ పగ్గాలు అప్పజెప్పేందుకు పార్టీ నేతలందరితో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఏ నిర్ణయమైన త్వరగా తీసుకోవాలని రాష్ట్ర సీనియర్ నాయకులు అధిష్టానానికి ఇప్పటికే సూచించారు.
48 లోక్‌సభ సీట్ల బలాబలాలపై అధ్యయనం...
ఎన్సీపీ వైఖరితో మింగుడుపడని కాంగ్రెస్ అధిష్టానం అవసరమైతే రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు సిద్దంగా ఉండాలని సూచించినట్టు సమాచారం. దీంతో ఆ స్థానాల్లో బలబలాలపై అధ్యయనం ప్రారంభించినట్టు తెలిసింది. మరోవైపు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేలు అధిస్టానం పిలుపుమేరకు చర్చలు జరిపేందుకు ఢిల్లీ వెళ్లారు. 48 స్థానాల్లో పోటీపైనే అక్కడ ఢిల్లీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. 2014లో జరగబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు, పార్టీ బలాలపై చర్చిస్తున్నట్టు తెలిసింది. లోక్‌సభ ఎన్నిక ల్లో పోటీ చేసే అభ్యర్థులకు ప్రచారం కోసం కావల్సిన సమయం లభించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జనవరిలోనే తొలి జాబితాను ప్రకటిచేందుకు సన్నాహాలు చేపట్టారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాల్లో సమర్థులైన అభ్యర్థుల పేర్లపై అన్ని కోణాల్లో చర్చలు జరిపిన రాహుల్...వారికి ఆయా నియోజకవర్గాల్లో ఎంత అనుకూలత ఉందనే విషయమై కూడా చర్చల్లో అడిగి తెలుసుకుంటున్నట్టు సమాచారం. కాంగ్రెస్ కోటలోకి 26 సీట్లు రావడం ఖాయమైనప్పటికీ 29 సీట్లను ఇవ్వాలని మిత్రపక్షమైన ఎన్సీపీని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అభ్యర్థులెవరనే విషయమై ఇప్పటి నుంచే చర్చలు ప్రారంభమయ్యాయి. పార్టీని గెలిపించే సత్తా ఉన్న అభ్యర్థులుగా పార్టీ అధిష్టానం భావిస్తున్న కొందరి పేర్లను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సూచించింది. వీరిలో ముంబైకి చెందిన ఐదుగురు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. కేంద్ర మంత్రి మిలింద్ దేవ్‌రా, ప్రియాదత్, సంజయ్ నిరూపమ్, గురుదాస్ కామత్‌లను మళ్లీ బరిలోకి దింపడం ఖాయం చేశారని చెప్పవచ్చు. వీరి పేర్లు తొలి జాబితాలో ప్రకటించే అవకాశాలున్నాయి. ఇక సాంగ్లీ ఎంపీ ప్రతీక్ పాటిల్, నాగపూర్ ఎంపీ విలాస్ ముత్తెంవార్, ధుళే మాజీ మంత్రి అమ్రీష్ పాటిల్‌ల పేర్లు కూడా మొదటి జాబితాలోనే వెల్లడించే అవకాశాలున్నాయి.