భారత్‌ను విడదీసేందుకు విదేశీ శక్తులు కుట్రలు
ఆర్‌ఎస్‌ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్
తుమకూరు : భారతదేశాన్ని విడదీసేందుకు విదేశీ శక్తులు కుట్రలు పన్నుతున్నాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అధ్యక్షుడు మోహన్ భగవత్ విమర్శించారు. అందువల్ల ప్రస్తుతం భారతీయులందరూ ఐకమత్యంతో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ సంస్థ ఏర్పాటై 50 సంవత్సరాలు పూర్తన సందర్భంగా మంగళవారం తుమకూరులోని సిద్ధగంగా మఠంలో ఏర్పాటు చేసిన ‘సాధు సంతర సమావేశంలో ఆయన మాట్లాడారు.
భారత్‌లో హిందూ ధర్మ సంప్రదాయాలు పాశ్చాత్య వైఖరి కారణంగా ఇప్పటికే చాలా వరకు నాశనమయ్యాయని అభిప్రాయపడ్డారు. ఇది ఇలాగే కొనసాగితే కొన్నేళ్లలో హిందూ సంప్రదాయాలు అదృశ్యమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలను హిందువులందరూ కలిసికట్టుగా ఎదుర్కొనాల్సిన అవసరం ఉందని అన్నారు. అందులో భాగంగా ఇతర మతాల్లోకి వెళ్లిన హిందువులను తిరిగి మన మాతృ మతంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
సాధుసంతర సమావేశాన్ని ప్రారంభించిన సిద్ధగంగా మఠం పీఠాధిపతి శివకుమార స్వామీజీ మాట్లాడుతూ....హిందూ ధర్మం ప్రపంచంలోని అన్ని ధర్మాలకు ఆదర్శమన్నారు. అయితే ప్రస్తుత తరంలో చాలా మంది యువకులు హిందూ ధర్మం పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం తనకు ఆందోళన కలిగిస్తోందన్నారు. కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర గురూజీ, ఆదిచుంచనగిరి మఠాధిపతి నిర్మలానంద నాధ స్వామీజీ తదితరులు పాల్గొన్నారు.