
కానిస్టేబుల్ హత్య
► మహిళా కానిస్టేబుల్ సహా ఇద్దరి అరెస్ట్
► మరో ముగ్గురు కానిస్టేబుళ్ల వద్ద విచారణ
తిరువళ్లూరు: తిరువళ్లూరులో మహిళా కానిస్టేబుల్ నడిపిన వివాహేతర సంబంధం ఒకరి హత్యకు దారితీసింది. మృతుడు, హంతకుడు ఇద్దరూ పోలీసులు కావడం గమనార్హం. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. తేనీ జిల్లా కూంబై గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్(30) బీఎస్‌ఎఫ్ ఉద్యోగి. ఇతని భార్య (23) తిరువళ్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయుధ విభాగం (వీఆర్)లో కానిస్టేబుల్. ఈమె తిరువళ్లూరులోని పూంగానగర్‌లో ఇంటిని అద్దెకు తీసుకుని తండ్రి (70), అక్క తో కలిసి నివసిస్తోంది.
ఇలాఉండగా తిరునల్వేలి జిల్లా వన్నియకుళం గ్రామానికి చెందిన ఇరుళపాండ్యన్ కుమారుడు అమృతరాజ్(25) చెన్నైలో వీఆర్ కానిస్టేబుల్. ఆరు నెలల కిందట ఢిల్లీలో శిక్షణ కోసం వెళ్లిన సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. అంతకుముందు తిరువళ్లూరులో పనిచేస్తున్న వీఆర్ కానిస్టేబుల్ కల్లన్ తో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలిసింది. ఒకరికి తెలియకుండా మరొకరితో ఆమె సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో శనివారం రాత్రి అమృతరాజ్ ఆమె ఇంటికి వెళ్లాడు. అప్పుడు కల్లన్ తో సబంధం గురించి తెలుసుకుని అతనికి ఫోన్ చేసి హెచ్చరించాడు. ఈ విషయంపై ఇరువురి మధ్య వాగ్వాదం ఏర్పడింది.
మద్యం మత్తులో వెళ్లి హత్యకు గురైన కానిస్టేబుల్: అమృతరాజ్ హెచ్చరించిన విషయాన్ని కల్లన్ తన సహచరులతో చెప్పాడు. అనంతరం సహచరులు మదురై ఉసిలంబట్టికి చెందిన సుందరపాండ్యన్ (24), ఊత్తపాళ్యంకు చెందిన చంద్రన్ మదురైకు చెందిన సంతానకుమార్(26)తో కలిసి మద్యం తాగి సదరు మహిళ ఇంటికి వెళ్లి ఘర్షణకు దిగారు. ఆ సమయంలో అమృతరాజ్ అక్కడే ఉండడంతో వారు అతనితో ఘర్షణ పడ్డారు. అమృతరాజ్ ఇంటిపైకి వెళ్లగా సుందరపాండ్యన్ అతన్ని వెంబడిస్తూ వెళ్లాడు.
ఆ సమయంలో అమృతరాజ్ పక్కన ఉన్న కత్తితో సుందరపాండ్యన్ పై విచక్షణారహితంగా దాడిచేశాడు. దీనిపై అతని సహచరులు తిరువళ్లూరు టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని సుందరపాండ్యన్ ను తిరువళ్లూరు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు అమృతరాజ్, కల్లన్, చంద్రన్, సంతానకుమార్, మహిళా కానిస్టేబుల్ వద్ద విచారణ చేపట్టారు. నిందితులను డీఐజీ ఆదివారం మధ్యాహ్నం విచారించారు.