రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆత్మహత్యాయత్నాల పర్వం కొనసాగుతూనే ఉన్నది. సీఎం పన్నీరు సెల్వం బంధువుకు సైతం అధికారుల వేధింపులు తప్పలేదు. సీఎం సొంత గ్రామం తేని జిల్లా పెరియకుళంలో గురువారం రేషన్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అలాగే, తేనిలో మరో ఉద్యోగి ఆసుపత్రి పాలయ్యాడు.
సాక్షి, చెన్నై : రాష్ర్టంలో పౌరసరఫరాల విభాగం నేతృత్వంలో ముప్పై వేలకు పైగా రేషన్ దుకాణాలు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంగా అధికారులు తమను వేధిస్తున్నారంటూ, రేషన్ దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆత్మహత్యాయత్నాల బాట పడుతున్నారు. ఈ ఘటనలకు నిరసన తెలుపుతూ ఓ రోజు బంద్‌కు సైతం రేషన్ సిబ్బంది పిలుపునిచ్చారు. తమపై వేధింపులు మానుకోవాలని డిమాండ్ చేస్తూ, ఆందోళనలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం పన్నీరు సెల్వం బంధువుకు సైతం అధికారుల వేదింపులు తప్పలేదని చెప్పవచ్చు. బుధవారం రాత్రి సీఎం పన్నీరు సెల్వం సొంత జిల్లా తేనిలో ఇద్దరు రేషన్ సిబ్బంది వేర్వేరుగా ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు.
ఆత్మహత్యాయత్నాల బాట : తేని జిల్లా పెరియకుళంకు దక్షిణ వీధికి చెందిన పళని స్వామి కుమారుడు రమేష్(27) సీఎం పన్నీరు సెల్వంకు బంధువుగా సమాచారం. అక్కడి రేషన్ దుకాణంలో పనిచేస్తున్న రమేష్ బుధవారం రాత్రి విషం సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడ్ని చికిత్స నిమిత్తం పెరియకుళం ఆసుపత్రికి తరలించారు. అతడు రాసి పెట్టిన లేఖలో తనను అధికారులు వేధిస్తున్నారని, తడిసిన, చెడి పోయిన బియ్యం వినియోగం చేయమని హెచ్చరిస్తున్నారని ఆరోపిస్తూ ఆ లేఖలో పేర్కొన్నాడు.
ఆ ప్రాంత ఉన్నతాధికారి మనోహర్‌పై ఆరోపణలు గుప్పించడంతో ఆ దిశగా విచారణ సాగుతున్నది. ఇక, తేనిలో మరో సిబ్బంది ఆత్మహత్యాయత్నం చేశాడు. తనను అధికారులు బలవంతంగా మరో చోటకు బదిలీ చేశారని ఆరోపిస్తూ, అధికారుల తీరును ఖండిస్తూ ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్టుగా తేనికి చెందిన అజ్మత్ ఖాన్ లేఖ రాసి పెట్టడం గమనార్హం. ఇక, రేషన్ సిబ్బంది అధికారుల ఒత్తిళ్లతో ఆత్మహత్యాయత్నాల బాట పడుతుండటంతో ఆ సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.
కొనసాగుతున్న ‘రేషన్’ఆత్మహత్యలు
Published Fri, May 8 2015 3:13 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM
Advertisement
Advertisement