కేసు మాఫీ కోసం ఏపీ మంత్రికి రూ. కోటి!
పత్తి కొనుగోళ్ల కుంభకోణంలో 64 మంది అక్రమార్కుల గుర్తింపు
ఇప్పటికీ చర్యలు తీసుకోకుండా నాన్చుతున్న మంత్రి
అక్కడ తొక్కిపెట్టేందుకే నిధుల సేకరణ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల కుంభకోణంలో అక్రమార్కులుగా నిర్ధారణ జరిగిన వారు ఆ కేసు నుంచి బయటపడేందుకు కోటి రూపాయలకు పైగా వసూళ్లు చేసి సంబంధిత మంత్రికి సమర్పించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అక్రమార్కులంతా గుంటూరులోని ఒక హోటల్‌లో సమావేశమై నిధుల సేకరణ వ్యవహారాన్ని చర్చించినట్టు తెలిసింది. వీరిలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ఉద్యోగులు, అధికారులు కూడా ఉన్నారు.
మార్కెటింగ్ శాఖలో పదవీ విరమణ చేసిన ఇద్దరు అధికారుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పత్తి అక్రమ కొనుగోళ్లపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం, మార్కెటింగ్ శాఖలు ఇచ్చిన నివేదికలు, వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేషీకి చేరుకున్న ఫైళ్లపై చర్చించినట్టు తెలిసింది. ఈ కేసు నుంచి బయటపడేందుకు ఎంతైనా ఖర్చు చేయాలని వారంతా ఏకాభిప్రాయానికి వచ్చారని, ముందస్తుగా కోటి రూపాయలను ఒకటి రెండు రోజుల్లో సమీకరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
రూ. 700 కోట్ల కుంభకోణం
2014–15లో జరిగిన పత్తి కొనుగోళ్లలో రూ. 700 కోట్ల కుంభకోణం జరిగిందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విచారణ సంస్థలు ప్రాథమికంగా గుర్తించిన విషయం విధితమే. కేంద్ర ప్రభుత్వ సంస్థ సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పత్తి అక్రమ కొనుగోళ్లలో ప్రమేయమున్న పర్చేజింగ్ ఆఫీసర్లు, ఇతర అధికారులను దేశ వ్యాప్తంగా బదిలీ చేసి నష్ట నివారణ చర్యలు తీసుకుంది.
అయితే రాష్ట్రంలో 43 మార్కెట్ యార్డుల్లో, 64 మంది అక్రమాలకు పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం, మార్కెటింగ్ శాఖలు నివేదికలు ఇచ్చినా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అప్పట్లో పత్తి అక్రమ కొనుగోళ్లలో మంత్రి పుల్లారావు అనుచరులు, ఆయన కంపెనీల్లో పనిచేసిన ఉద్యోగులు క్రియాశీలంగా వ్యవహరించారని, వీరందరినీ రక్షించేందుకు ఆయన ప్రయత్నించారనే ఆరోపణలు బాహాటంగా వినపడ్డాయి. ఇవన్నీ వాస్తవాలేనన్నట్టుగా ప్రస్తుతం అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
దీనికితోడు మంత్రి పుల్లారావును ఈ విషయమై మీడియా ప్రశ్నిస్తే, తనకు ‘ఆ ఫైల్ వస్తే కదా చర్యలు తీసుకునేది’ అంటూ దాటవేత ధోరణిలో సమాధానం ఇస్తున్నారు. ఆ కేసులోని కొందరు అక్రమార్కులు మంత్రి ఇంటి చుట్టూ, కార్యాలయం చుట్టూ తిరుగుతున్న విషయాలను కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. మంత్రి పేషీకి చేరిన ఫైల్‌ను కోల్డ్ స్టోరేజ్‌లో పడేసేలా చేయడానికి ఈ కోటి రూపాయలను ఖర్చు చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.