రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ఆదివారం అర్ధరాత్రి అరాచకం రాజ్యమేలింది. కొందరు గుర్తుతెలియని దుండగులు పచ్చని పొలాల్లో నిప్పుపెట్టారు. తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక, తుళ్లూరు మండలం వెంకటపాలెం, లింగాయపాలెం, మందడం గ్రామాల్లో యథేచ్ఛగా సాగించిన దహనకాండలో మొత్తం 13 చోట్ల సోమవారం తెల్లవారు జాము వరకు అరటి తోటలు, రైతుల షెడ్లు, డ్రిప్ పరికరాలు, ఎరువులు, వెదురు బొంగులు దగ్ధమయ్యాయి. నష్టం అంచనా రూ.లక్షల్లో ఉన్నా దుండగుల దుశ్చర్యతో ఆయా గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ ఘటనతో ఇకపై ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం రైతులను వెంటాడుతోంది. రాజధాని కోసం ప్రతిపాదించిన గ్రామాలు కావడంతో ఇక్కడి భూములు లాక్కునే చర్యల్లో భాగంగానే భయాందోళనలు సృష్టించేందుకే తెలుగుదేశం పార్టీ పంపిన రౌడీమూకలు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాయని రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఈ సంఘటనపై అసందర్భంగా వ్యాఖ్యానించిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపైనా పెనుమాకలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు : రాజధాని గ్రామాల్లో యథేచ్ఛగా కొనసాగిన దహనకాండపై ముందు వెనుకా చూసుకోకుండా వ్యాఖ్యానించిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రైతుల కోపాన్ని చూడాల్సి వచ్చింది. తొలుత దగ్ధమైన ప్రాంతాలను పరిశీలించకుండానే ‘‘సంఘటన వెనుక వైసీపీ హస్తం ఉంది’’ అని చిలకలూరిపేటలో మాట్లాడి ఆ తరువాత పెనుమాక గ్రామానికి చేరుకున్న మంత్రి రైతుల ఆగ్రహాన్ని చవి చూశారు. దీనికి తోడు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం పుల్లారావుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మధ్యాహ్నం వరకు సంఘటనా స్థలానికి వెళ్లకుండా ఏం చేస్తున్నారని మందలించినట్టు సమాచారం. వెంటనే అక్కడకు వెళ్లి ప్రతి గంటకు సమాచారం తనకు తెలియజేయాలని సీఎం ఆదేశించడంతో మంత్రి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు.
ముఖ్యమంత్రి ఆరా...
సంఘటన జరిగిన తీరును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయమే జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండేను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ లింగాయపాలెంలో ఉన్న సమయంలో ఫోన్ రావడంతో అక్కడ మధు అనే రైతుతో ముఖ్యమంత్రితో మాట్లాడించారు. అనంతరం పెనుమాకలో ఉన్న మంత్రి పుల్లారావుకు సీఎం ఫోన్ చేశారు. ఈ సందర్భంలో అక్కడి పరిస్థితిని పుల్లారావు, కలెక్టర్, ఎమ్మెల్యేలు వివరించారు. సాయంత్రం లోపు దోషులను పట్టుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయవాడలోఉన్న డీజీపీకి సీఎం ఫోన్ చేసి కేసును స్వయంగా దర్యాప్తు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.
వైఎస్సార్ సీపీ నేతల సందర్శన
సంఘటన జరిగిన ప్రాంతాన్ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, తాడికొండ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి కత్తెర క్రిస్టీనా సందర్శించి సంఘటన జరిగిన తీరు గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతుల్లో భయాందోళనలు సృష్టించేందుకు దుండగులు ఓ పక్కా ప్రణాళిక ప్రకారం చేపట్టిన పిరికిపంద చర్యగా అభివర్ణించారు.
దుండగుల కోసం పోలీసుల గాలింపు...
రాజధాని గ్రామాల్లో పొలాలకు, రైతుల షెడ్లుకు నిప్పుపెట్టిన దుండగుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. డీజీపీ స్వీయ పర్యవేక్షణలో అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్, రూరల్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ స్వయంగా రంగంలోకి దిగారు. సంఘటనా స్థలంలోనే ఉండి నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రత్యేకంగా ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. పోలీసు జాగిలాలను సైతం రప్పించి దర్యాప్తు చేస్తున్నారు.
అరాచకం
Published Tue, Dec 30 2014 8:26 AM | Last Updated on Sat, Aug 18 2018 5:50 PM
Advertisement