కొన్నవి చూపిస్తే పేదలకు పంచుతాం
♦ సాక్షిలో అవాస్తవాలు రాస్తున్నారు
♦ పత్రిక ఎండీ, ఎడిటర్, ప్రమోటర్లు, విలేకరిపై పరువు నష్టం దావా
♦ భూదురాక్రమణ కథనాలపై మంత్రులు నారాయణ, పుల్లారావు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధానిలో తాము భూములు ఎక్కడ కొన్నామో చూపిస్తే వాటిని పేదలకు పంచుతామని మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. సాక్షి పత్రికలో తమపై కావాలని బురద జల్లుతున్నారని ఆరోపించారు. సాక్షి పత్రికలో బుధవారం ప్రచురితమైన భూదురాక్రమణ కథనాలపై మంత్రులు సీఎం కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ.. రాజధానిలో ఏ లావాదేవీ జరిగినా లోకేశ్‌బాబుకు, తనకు, నారాయణకూ సంబంధం ఉందంటున్నారని, ఇలాగైతే పదేళ్లలో రాష్ట్రంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లలో జగన్ పాత్ర ఉందని అనాల్సివస్తుందన్నారు.
రాసిన వ్యక్తుల్లో ఎవరికి భూములున్నా సాక్షి మేనేజ్‌మెంట్‌కు రాసిస్తామని చెప్పారు. ఈ కథనాలు రాసిన సాక్షి ప్రమోటర్, ఎండీ, ఎడిటర్, వార్త పంపిన విలేకరిపై సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు. ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామన్నారు. తప్పుడు వార్తలు రాయడం, దానిపై బొత్స సత్యనారాయణ వంటి నేతలు ఇష్టానుసారం మాట్లాడడం సరికాదన్నారు. పత్రిక, చానల్ ఉంది కదా అని అవాస్తవాలు రాస్తే పత్రికలను ఏంచేస్తున్నారో చూస్తున్నారుగా అంటూ హెచ్చరిక ధోరణిలో మాట్లాడారు. నారాయణ మూడు వేల ఎకరాలు కొన్నాడని ఎవరెవరి పేర్లో చెబుతున్నారని, రాజారెడ్డి, పుల్లారెడ్డి తన బినామీలంటున్నారని, ఇంతవరకూ రాజారెడ్డి పేరే తాను వినలేదన్నారు.
సూటిగా సమాధానం చెప్పని పుల్లారావు
లింగమనేని ఎస్టేట్స్‌తో క్విడ్‌ప్రోకో జరగడం వాస్తవం కాదా అని విలేకరులు ప్రశ్నించగా పుల్లారావు నేరుగా స్పందించకుండా క్విడ్‌ప్రోకో చర్రిత జగన్‌దేనన్నారు. ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్న విషయాన్ని పక్కదారి పట్టించడానికి ఇలా రాస్తున్నారని ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే ప్రతిపక్ష స్థానాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుందన్నారు. బాలకృష్ణ వియ్యంకుడి కోసం సీఆర్‌డీఏ పరిధిని జగ్గయ్యపేట వరకూ విస్తరించడం వాస్తవం కాదా అని విలేకరుల ప్రశ్నించగా ఒకరి కోసం డిజైన్ మార్చే పరిస్థితి ఉందంటూనే మళ్లీ పాత విషయాలపై మాట్లాడారు. మంత్రి రావెల కిషోర్‌బాబు తన భార్య పేరు మీదే భూములు కొన్న విషయాన్ని ప్రస్తావించగా దానికి సమాధానం చెప్పకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కరపత్రిక మంత్రివర్గంపై ఇలా బురద జల్లుతోందని ఆరోపించారు. సాక్షి కథనాలను ఖండించడానికి ఆవేశంగా మీడియా పాయింట్ వద్దకొచ్చిన మంత్రులు నారాయణ, పుల్లారావు తమ భూముల గురించి లోతుగా ప్రశ్నలు అడిగితే నీళ్లు నమిలారు.
ఆశ్చర్యం కలిగించాయి: నారాయణ
మంత్రి నారాయణ మాట్లాడుతూ సాక్షిలో వచ్చిన కథనాలు తనకు ఆశ్చర్యం కలిగించాయని, నిజాలు తెలుసుకుని రాయాలని సూచించారు. ఏదో రకంగా రాజధానిని అడ్డంగించాలని ప్రయత్నించి కోర్టులో కేసులు వేయించారని, రైతుల్ని రెచ్చగొట్టారని అయినా రాజధాని నిర్మిస్తుండడంతో ఓర్వలేక ఇలా బురద జల్లుతున్నారని ఆరోపించారు.తాను మూడు వేల ఎకరాలు ఎక్కడ కొన్నానో చూపిస్తే పేదలకు పంచేస్తానన్నారు. అసైన్డ్ భూములకు పరిహారం ఇచ్చే విషయంలో అవకతవకల గురించి ప్రశ్నించగా నిబంధనల ప్రకారమే అంతా చేశామన్నారు.