ఆర్కే నగర్ ఉప సమరం వేడెక్కింది. సీపీఐ అభ్యర్థిగా రేసులో నిలబడ్డ మహేంద్రన్ శనివారం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈనెల తొమ్మిదిన నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. ఇక, ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ సందీప్ సక్సేనా దృష్టి పెట్టారు. ఈ సారి ఈవీఎంలలో అభ్యర్థుల ఫొటోలు సైతం పొందుపరచబోతున్నారు.
సాక్షి, చెన్నై: ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈనెల 27న ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామితో పాటుగా పధ్నాలుగు మంది ఇప్పటికే నామినేషన్లను దాఖలు చేశారు. సీఎం, అన్నాడీఎంకే అభ్యర్థి జయలలిత శుక్రవారం తన నామినేషన్‌ను ఎన్నికల అధికారికి సమర్పించారు. జయలలిత నామినేషన్ దాఖలుతో ఆ నియోజకవర్గంలో ఎన్నికల వేడి రాజుకుంది. తమ అమ్మ జయలలితను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా అన్నాడీఎంకే వర్గాలు ఇంటింటా సుడిగాలి ప్రచారంలో నిమగ్నమయ్యాయి. శనివారం ఉదయాన్నే తమ ప్రచారాన్ని చేపట్టినా, పార్టీ నాయకురాలు సులోచన సంపత్ మృతితో రద్దు చేసుకున్నారు. ఇక, జయలలితను ఢీకొట్టేందుకు సీపీఐ రేసులో నిలబడింది. ఆ పార్టీ అభ్యర్థిగా మహేంద్రన్ పోటీకి సిద్ధం అయ్యారు.
ప్రచారంలో మహేంద్రన్: తంజావూరు జిల్లా ఒరత్తనాడుకు చెందిన మహేంద్రన్ సీపీఐ జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. 40 ఏళ్లుగా సీపీఐకు ఆయన సేవలు అందిస్తూ రాగా, ప్రస్తుతం తొలి సారిగా ఎన్నికల బరిలో నిలబడే అవకాశం వచ్చింది. సీఎం జయలలితకు ప్రత్యర్థిగా ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమైన మహేంద్రన్ తన ప్రచారాన్ని చేపట్టారు. ఉదయాన్నే తండయార్ పేట పరిసరాల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించినానంతరం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటా తిరుగుతూ, ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. ఈసందర్భంగా మహేంద్రన్ మీడియాతో మాట్లాడుతూ, ఆర్కే నగర్‌లో అన్నాడీఎంకే వరుసగా గెలుపొంది ఉందని గుర్తు చేస్తూ, వారి ద్వారా ఇక్కడి ప్రజలకు ఒరిగింది శూన్యమేనని శివాలెత్తారు.
పేదలు, కార్మికులు అత్యధికంగా నివాసం ఉన్న నియోజకవర్గం ఇది అని, అభివృద్ధి పరంగా ఈ ప్రాంతం వెనుకబడి ఉందని వివరించారు. అన్నాడీఎంకే సర్కారు ఈ నియోజకవర్గంపై చూపుతున్న నిర్లక్ష్యాన్ని, ఆ ప్రభుత్వ అవినీతి , అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా తన ప్రచారం సాగుతుందన్నారు. ఇక, ఆర్కే నగర్ బరిలో తామూ అంటూ కొన్ని చిన్నా, చితక పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో తమిళ మానిల కట్చి నేత, న్యాయవాది పాల్ కనకరాజ్, తమిళ మానిల ద్రావిడ మున్నేట్ర కళగం నేత యూకే మణియన్ కూడా ఉన్నారు.
డీఎండీకే, బీజేపీ మళ్లీ చర్చ : ఆర్కే నగర్ ఉప ఎన్నికపై బీజేపీ, డీఎండీకేలు ఇంత వరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించ లేదు. ఈ ఇద్దర్లో ఎవరో ఒకరు బరిలో దిగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఇప్పటికే ఓ మారు డిఎండికే నేత విజయకాంత్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ భేటీ అయ్యారు. అయితే, విజయాకాంత్ ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించ లేదు. నామినేషన్ల గడువు సమయం దగ్గర పడుతుండటంతో ఎన్నికల్లో పోటీ చేద్దామా..? వద్దా..? అన్న నిర్ణయం తీసుకునేందుకు విజయకాంత్ ఇంటి మెట్లను మరో మారు తమిళి సై ఎక్కాల్సి వచ్చింది. ఉదయం పదకొండున్నర గంటలకు విజయకాంత్ ఇంటికి వెళ్లిన ఆమె అర గంట పాటుగా భేటీ అయ్యారు. పోటీ విషయంగా ఆదివారం తమ నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు బీజేపీ, డీఎండీకే వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈవీఎంలలో ఫోటోలు : ఆర్కే నగర్‌లో ఉపయోగించే ఈవీఎంలలో అభ్యర్థుల ఫోటోలను పొందు పరచబోతున్నారు. ఒకే పేర్లతో పలువురు ఎన్నికల బరిలో నిలబడుట పరిపాటే. ఇది కాస్త ఓటర్లను గందరగోళానికి గురి చేస్తుంటుంది. ఇలాంటి పరిస్థితిని అధిగమించే రీతిలో ఉప ఎన్నికలో అభ్యర్థి ఫోటోను పొందు పరిచేందుకు చర్యలు చేపట్టారు. ఈ విషయంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సందీప్ సక్సేనా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. అభ్యర్థి పేరు, వరుస నెంబరు, చిహ్నంతో పాటుగా ఫోటోను పొందు పరిచే కసరత్తులు ఆరంభం అయ్యాయి. నామినేషన్ల సమయంలోనే మూడు నెలల్లోపు తీసుకున్న ఫోటోలను అభ్యర్థుల నుంచి స్వీకరిస్తున్నట్టు, ఆ ఫోటోలే ఈవీఎంలలో ప్రత్యక్షం కాబోతున్నట్టుగా ఎన్నికల వర్గాలు పేర్కొంటున్నాయి.
వేడెక్కిన ఉప సమరం
Published Sun, Jun 7 2015 3:33 AM | Last Updated on Thu, Aug 30 2018 6:07 PM
Advertisement