మహేంద్రన్ నామినేషన్ దాఖలు
సాక్షి, చెన్నై : ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈనెల 27న ఉపఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ప్రధాన పార్టీలు ఎన్నికల్ని బహిష్కరించాయి. ఇక, రాష్ట్ర ముఖ్యమంత్రి , అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను ఢీ కొట్టేందుకు సీపీఐ అభ్యర్థి మహేంద్రన్ రేసులో నిలబడ్డారు. నామినేషన్ దాఖలు కన్నా ముందుగా, తన ఓట్ల వేటకు మహేంద్రన్ శ్రీకారం చుట్టి, ప్రజల్ని ఆకర్షించే పనిలో పడ్డారు. ఇక, ఆయనకు మద్దతుగా సీపీఐ, సీపీఎం నాయకులు రంగంలోకి దిగారు.
నామినేషన్ దాఖలు : సోమవారం నాటికి అన్నాడీఎంకే అభ్యర్థి జయలలితతో పాటుగా 27 మంది తమ నామినేషన్లను సమర్పించారు. ఇందులో కొన్ని చిన్నా చితకా పార్టీల నాయకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం తండయార్ పేటలోని ఎన్నికల అధికారి కార్యాలయానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్‌తో కలసి అభ్యర్థి మహేంద్రన్ వచ్చారు. తన నామినేషన్, ప్రమాణ పత్రాన్ని అందజేశారు. అంతకు ముందుగా స్వతంత్ర అభ్యర్థులు పలువురు తమ నామినేషన్లను దాఖలు చేశారు. మొత్తం 11 నామినేషన్లు దాఖలు అయ్యాయి. వీటితో కలుపుకుంటే, ఇప్పటి వరకు ఆ నియోజకవర్గం బరిలో నిలబడ్డ వారి సంఖ్య 38కి చేరిం ది. ఇక నామినేషన్ల పర్వం బుధవారం సాయంత్రంతో ముగియనుంది. చివరి రోజు స్వతంత్ర అభ్యర్థుల పేరిట నాలుగైదు నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి. గురువారం నామినేషన్ల పరిశీలన పర్వం జరగనున్నది. ఇందులో ఎన్ని నామినేషన్లు తిరస్కరణకు గురి అవుతాయో వేచి చూడాల్సిందే.
ప్రచార హోరు : ఈ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థులుగా చిన్నా , చితక పార్టీల నాయకులు ఉన్నా, ప్రధానంగా పోటీ అన్నది అన్నాడీఎంకే, సీపీఐ మధ్య నెలకొని ఉంది. ఆ నియోజకవర్గంలో కార్మిక ఓటు బ్యాంక్ అధికమే. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత గెలుపు సునాయాసమైనా, ఆమె మెజారిటీ తగ్గించే దిశగా ప్రయత్నాలు వేగవంతం అయ్యాయని చెప్పవచ్చు. తమకు బలం ఉందని చాటుకునే విధంగా సీపీఐ అభ్యర్థి సుడిగాలి ప్రచారం సాగిస్తుండడం విశేషం.
నామినేషన్ దాఖలు అనంతరం తండయార్ పేట నెహ్రూ నగర్‌కు చేరుకున్న మహేంద్రన్ అక్కడ జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని సీపీఎం రాజ్య సభ సభ్యుడు రంగరాజన్ ప్రారంభించారు. అనంతరం మహేంద్రన్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం సాగింది. ఇక, నామినేషన్ల పర్వం ముగింపు దశకు చేరడంతో నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అన్నాడీఎంకే అభ్యర్థి,సీఎం జయలలిత తరుపున మంత్రులు వలర్మతి, వైద్యలింగం, పళనియప్పన్, సెల్లూరు కే రాజు వేర్వేరుగా ఆ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఓట్ల సేకరణలో నిమగ్నం అయ్యారు.