
కన్నకూతురే చంపేసింది
నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన కన్నతల్లిని రక్తం పంచుకు పుట్టిన కూతురే విచక్షణ కోల్పోయి కర్రతో గొడ్డును బాదినట్లు బాది ఆమె మృతికి కారణమైంది.
- మిస్టరీ వీడిన వృద్ధురాలి ఆస్తిపంజరం కేసు
- కేసులో మూడో నిందితుడి అరెస్ట్
- హతురాలి కుమార్తె, మనువడి కోసం గాలింపు ముమ్మరం
బనశంకరి (బెంగుళూరు) : నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన కన్నతల్లిని రక్తం పంచుకు పుట్టిన కూతురే విచక్షణ కోల్పోయి కర్రతో గొడ్డును బాదినట్లు బాది ఆమె మృతికి కారణమైంది. కెంగేరి గాంధీనగర్‌లో ఓ ఇంటిలోని గోడలో ఇటీవల వృద్ధురాలి అస్థిపంజరం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈఘటనపై కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కుమార్తెనే కన్నతల్లిని హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈమేరకు ఈ కేసులో మూడో నిందితుడిగా ఉన్న నందీశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితురాలు శశికళ, ఆమె కుమారుడు సంజయ్ కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు.
పశ్చిమవిభాగం పోలీస్ కమిషనర్ ఎంఎన్.అనుచేత్ ఆదివారం వెల్లడించిన వివరాలు ప్రకారం శశికళ, ఆమె కుమారుడు సంజయ్, అతని నానమ్మ శాంతకుమారిలు అద్దె ఇంటిలో నివాసం ఉండేవారు. గత ఏడాది ఆగస్టు మూడో వారంలో శాంతకుమారికి కుమార్తె పల్లెంలో అన్నం పెట్టగా కాలితో తన్నింది. కోపోద్రిక్తురాలైన శశికళ ఆ వృద్ధురాలిని కర్రతో తలపై బాదింది. ఆమెను ఆస్పత్రికి తరలిస్తే విషయం బయటకు పొక్కుతుందని భావించి ఇంట్లోనే ఉంచగా ఆమె మరుసటి రోజు మృతి చెందింది. భయాందోళనకు గురైన సంజయ్..తన స్నేహితుడైన నందీశ్‌ని రప్పించాడు. విషయం బయటకు పొక్కితే పోలీసు కేసు తప్పదని భావించి పెద్ద నీటిడ్రమ్ తెచ్చి శవాన్ని అందులో ఉంచి మట్టి నింపేందుకు యత్నించారు. అది సాధ్యం కాక గోడలోని కప్‌బోర్డులో మృతదేహం పెట్టి టేప్ అంటించారు. రక్తసిక్తమైన దుస్తులను డ్రమ్‌లో పెట్టి టేప్ అంటించారు. కొద్ది రోజుల అనంతరం కప్‌బోర్డుకు సిమెంట్ ప్లాస్టింగ్ చేసి రంగులువేశారు. దుర్వాసన వస్తుండటంతో ఇల్లు వదలి ఉడాయించారు.
ఈనెల 7న ఇంటి యజమాని వచ్చి తాళం తెరవగా వృద్ధురాలి అస్థిపంజరం బయట పడింది. కేసు దర్యాప్తు చేపట్టిన కెంగేరి పోలీసులు నిందితుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈక్రమంలో సంజయ్ సెల్‌ఫోన్ నంబర్‌పై దృష్టి పెట్టారు. ఆ నంబర్‌కు ఎక్కువ సార్లు కాల్ చేసిన నంబర్‌ను ట్రేస్ చేయగా అది కంబళగూడు కు చెందిన నందీష్‌దిగా తేలింది. అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా శశికళనే శాంతకుమారిని చావబాది ఆమె మృతికి కారణమైందని వెల్లడించాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు మిగతా ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు.