తప్పులు గుర్తించే పనిలో..
ఘోర పరాజయం డీఎండీకేను డీలా పడేలా చేసింది. డిపాజిట్ల గల్లంతుతో పాటుగా ఓటు బ్యాంక్ పతనం కావడంతో భవిష్యత్తు కార్యచరణపై విజయకాంత్ దృష్టి పెట్టారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు జిల్లాల కార్యదర్శులతో సమాలోచనలో మునిగారు. ప్రజా సంక్షేమ కూటమితో పొత్తే పార్టీ కొంప ముంచిందని పలువురు జిల్లా కార్యదర్శులు విజయకాంత్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. బీజేపీ సైతం తప్పులను గుర్తించే పనిలో పడింది.
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి ఘోర పరాజయాన్ని చవి చూసిన విషయం తెలి సిందే. ఇందులో డీఎండీకేకు అత్యధికంగా నష్టం జరిగి ఉన్నది. ప్రధాన ప్రతిపక్ష స్థాయిలో ఉన్న పార్టీ, ఇప్పుడు చతికిల పడింది. 5.4 శాతం మేరకు ఓటు బ్యాంక్‌ను సైతం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. విజయకాంత్ సైతం ముఫ్పై వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి చవి చూడాల్సినంతగా డీఎండీకే దిగజారింది.
విజయకాంత్‌కు తీవ్ర నష్టం ఏర్పడిందన్న విషయం కూటమిలోని మిత్రులందరికీ తెలుసు. అందుకే ఆయన్ను ఓదార్చే రీతిలో కూటమిలోని ఎండీఎంకే, సీపీఎం, సీపీఐ, వీసీకే, తమిళ మానిల కాంగ్రెస్‌లు రెండు రోజుల క్రితం విజయకాంత్‌తో సమాలోచించారు. ఈ సమాలోచనతో విజయకాంత్ మినహా తక్కిన నేతలు మీడియా ముందుకు వచ్చి తమ కూటమి కొనసాగుతుందని ప్రకటించి వెళ్లారు. అయితే, నష్టం ఎక్కడి నుంచి తమకు ఎదురైందో అన్వేషించి, భవిష్యత్తును మళ్లీ పునర్ నిర్మించుకునేందుకు విజయకాంత్ సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా సోమవారం నుంచి మూడు రోజుల పాటుగా రాష్ట్రంలోని పార్టీ జిల్లాల కార్యదర్శులు ముఖ్య నాయకులతో సమాలోచనకు నిర్ణయించారు. ఆ మేరకు కోయంబేడులో జరిగిన సమాలోచనకు ఉదయం పలువురు జిల్లాల కార్యదర్శులు హాజరయ్యారు.
పొత్తే కొంప ముంచింది:
కోయంబేడులో విజయకాంత్ నేతృత్వంలో జరిగిన ఈ సమాలోచనలో పలువురు నేతలు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేసి ఉన్నారు. ప్రజా సంక్షేమ కూటమితో కలిసి వెళ్లడం వల్లే పార్టీ పతనం కావాల్సి వచ్చిందని, ఇది కొనసాగితే, ఇక కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్న హెచ్చరికను చేసినట్టు సమాచారం. ఇకనైనా వ్యూహాత్మకంగా వ్యవహరించడం, అదును చూసి అడుగులు వేసి బలోపేతం చేసుకోవాలని లేనిపక్షంలో కేడర్ చేజారే ప్రమాదం ఉందని సూచించినట్టు తెలిసింది. పార్టీ ఎన్నికల గుర్తింపు రద్దు, ఢంకా చిహ్నం దూరం కాబోతున్న విషయంగా విజయకాంత్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేసినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లోపు బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగుదామని, ఆ ఎన్నికల్లో గెలుపుతో మళ్లీ బలాన్ని చాటుకుందామన్న భరోసాను కేడర్‌కు ఇచ్చే విధంగా పలు సూచనలు , సలహాల్ని జిల్లాల కార్యదర్శులకు విజయకాంత్ ఇచ్చి ఉన్నారు. ఇక, విజయకాంత్ బాటలోనే ఎండీఎంకే నేత వైగో ఓటమిపై నేతలతో సమాలోచించేందుకు నిర్ణయించారు. ఒకటో తేదిన చెన్నైలోని పార్టీ కార్యాలయంలో ఈ సమాలోచనా సమావేశం సాగనున్నది. ఇక, రాష్ట్రంలో ఓటమి చవి చూసినా, ఓటు బ్యాంక్ ఊరట నివ్వడంతో తదుపరి అడుగులు దిశగా పీఎంకే సిద్ధం అయింది. ఇందు కోసం కేడర్‌తో సమాలోచించేందుకు నిర్ణయించారు. ఓటమి చవిచూసిన అభ్యర్థులు, పార్టీ ముఖ్య నేతలతో మంగళవారం పీఎంకే అధినేత రాందాసు, ఎంపీ అన్భుమణి రాందాసు, పార్టీ అధ్యక్షుడు జికే మణిలు సమాలోచనా సమావేశానికి నిర్ణయించారు.
కమలనాథుల మంతనాలు :
ఇక ఐదుసీట్లు గ్యారంటీ అని ఢిల్లీకి నివేదిక పంపించి చివరకు ఒక్కటి కూడా దక్కక నిరాశలో పడ్డ కమలనాథులు సైతం మంతనాల్లో మునిగారు. నాలుగు చోట్ల రెండో స్థానం దక్కినా, మిగిలిన అన్ని చోట్ల డిపాజిట్లు గల్లంతు కావడంతో ఓటమి కారణాలపై సోమవారం సమీక్షించారు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సంతోష్ నేతృత్వంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్, నేతలు ఇలగణేషన్, వానతీ శ్రీనివాసన్, హెచ్ రాజా తదితరులతో కూడిన కమిటీ సమాలోచించి ఓటమి కారణాలను ఆరా తీసింది. కేంద్ర ప్రభుత్వ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు తగ్గట్టుగా బలాన్ని పెంచుకునే విధంగా కార్యచరణను సిద్ధం చేశారు. ఈసమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీలోని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పంపించేందుకు నిర్ణయించారు.